TRS to BRS: టీఆర్ఎస్ 2.0 - ‘బీఆర్ఎస్’ తో మరో ప్రస్థానం వైపు అడుగులు…-history about formation of trs party ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  History About Formation Of Trs Party

TRS to BRS: టీఆర్ఎస్ 2.0 - ‘బీఆర్ఎస్’ తో మరో ప్రస్థానం వైపు అడుగులు…

Mahendra Maheshwaram HT Telugu
Oct 05, 2022 07:50 AM IST

TRS to BRS: టీఆర్ఎస్ మరో ప్రస్థానం వైపు అడుగులువేయబోతుంది. 2001లో ఉద్యమ పార్టీగా ఆవిర్భావించిన ఆ పార్టీ… విజయదశమి రోజు(అక్టోబర్ 5)న భారత రాష్ట్ర సమితిగా అవతరించబోతుంది.

నేడే బీఆర్ఎస్
నేడే బీఆర్ఎస్

TRS Party: తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)… ఉద్యమ పార్టీగా ఎంట్రీ ఇచ్చింది... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఏకైక అజెండాగా ముందుకొచ్చింది. ఓ వైపు ఉద్యమం.. మరోవైపు రాజకీయపంథా...! ఇలా దశాబ్ధానికిపైగా ఎన్నో వ్యూహాలు.. ప్రతివ్యూహాలు.. అటుపోటులు ఇలా అన్నింటిని ఎదుర్కొని నిలబడింది. పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించి... దేశ రాజకీయ యవనికపై తనకంటూ ఓ చరిత్రను లిఖించుకుంది. అలాంటి పార్టీ జాతీయ స్థాయిలో విస్తరణ దిశగా అడుగులు వేసేందుకు సిద్ధమైంది.

ట్రెండింగ్ వార్తలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీఆర్ఎస్ ఏర్పాటు ఓ సంచలనం. ఇందుకోసం హైదరాబాద్ లోని జలదృశ్యం వేదికైంది. 2001 ఏడాదిలో ఏప్రిల్ 27 కొంతమంది తెలంగాణవాదుల సమక్షంలో పార్టీని ప్రకటించారు కేసీఆర్. టీడీపీకి రాజీనామా ప్రకటించిన కేసీఆర్.. పార్టీ ఆవిర్భావ సభలో కీలక ప్రసంగం చేశారు. తెలంగాణ ఏర్పాటే ఏకైక అజెండాగా టీఆర్ఎస్ వస్తుందని స్పష్టం చేశారు. అయితే పార్టీ ఏర్పడిన కొద్దిరోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఇందులో పోటీ చేసిన టీఆర్ఎస్... పలు స్థానాల్లో విజయం సాధించింది. ఇదే క్రమంలో తెలంగాణలోని పది జిల్లాల్లోనూ సభలు.. పాదయాత్రల పేరుతో రాష్ట్ర ఏర్పాటు విషయంలో భావజాలవ్యాప్తికి ఎంతో కృషి చేసింది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత, అవసరాన్ని ప్రజల్లోకి తీసుకెళుతూనే.. మరోవైపు రాజకీయంగా ఎదిగేలా పావులు కదిపింది టీఆర్ఎస్. ఇందులో భాగంగా 2004లో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపింది. ఈ ఎన్నికల్లో 42 స్థానాల్లో పోటీ చేసి.. 26 స్థానాల్లో విక్టరీ కొట్టింది. 6 పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసిన టీఆర్ఎస్... ఐదింట్లో గెలిచి విజయబావుటా ఎగరవేసింది. ఇలా మొదలైన ప్రస్థానంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ మొండిచేయి చూపటంతో బయటికి వచ్చిన కేసీఆర్ ఉప ఎన్నికలకు వెళ్లారు. గతంలో కంటే కొన్ని స్థానాలను కోల్పోవాల్సి వచ్చింది. ఇక కరీంనగర్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ గెలుపు ఓ చరిత్ర అనే చెప్పొచ్చు. ఇక 2009లో మహాకూటమితో జట్టుకట్టిన కేసీఆర్… టీడీపీతో పాటు కమ్యూనిస్టులతో జై తెలంగాణ అనిపించగలిగారు. అయితే ఈ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నారు. ఓ దశలో టీఆర్ఎస్ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ఆ తర్వాత 14 ఎఫ్ పై సుప్రీంతీర్పుతో కేసీఆర్ దీక్షకు దిగడంతో టీఆర్ఎస్ మళ్లీ ఫామ్ లో కి వచ్చేసింది. తిరుగులేని ఆదిపత్యాన్ని సాధించింది. ఆరోజు నుంచి 2014 వరకు ఉద్యమాన్ని నడిపించటంలో అగ్రభాగాన నిలించింది.

ఎన్నో మలుపుల తరువాత ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన గెజిట్ వచ్చింది. అదే ఏడాది (2104)ఎన్నికలు కూడా జరిగాయి. ఇందులో ఒంటరిగా బరిలో దిగిన టీఆర్ఎస్ ... విజయం సాధించింది. ఉద్యమ పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. వ్యవసాయం, ఇరిగేషన్ శాఖలో అనేక మార్పులు తీసుకొచ్చారు. రైతుల కోసం కీలకమైన పథకాలను ప్రవేశపెట్టారు. ఇంతలోనే ముందస్తు ఎన్నికలకు(2018) వెళ్లారు కేసీఆర్. అయితే ఇందులో సూపర్ విక్టరీనే కొట్టారు. గతంలో కంటే మెజార్టీ స్థానాలకు కైవసం చేసుకుంది టీఆర్ఎస్. ప్రతిపక్షాలకు అందనంత దూరంలో నిలిచింది. మరోసారి కూడా కేసీఆరే సీఎంగా పీఠం ఎక్కారు. రెండోసారి అధికారంలోకి వచ్చి దాదాపు నాలుగేళ్లు పూర్తి చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది.

గత కొద్దిరోజులుగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన కేసీఆర్… ఆ దిశగా పావులు కదుపుతూ వచ్చారు. దేశవ్యాప్త పర్యటనలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ యేతర ఫ్రంటే లక్ష్యంగా అడుగులు వేశారు. ఈ మేరకు ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలు జరిపారు. తెలంగాణ వ్యాప్తంగా తలపెట్టిన పలు సభల్లోనూ పదే పదే జాతీయ రాజకీయాల్లోకి పొదామా అంటూ ప్రశ్నిస్తూ వచ్చారు. ఇలా ఏడాదికిపైగా కేంద్రంలోని మోదీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కేసీఆర్… ఏకంగా జాతీయ పార్టీ అంటూ హింట్ ఇచ్చారు. ఈ ఏడాదిలో జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశంలోనే బీఆర్ఎస్ ప్రకటన చేస్తారని భావించినప్పటికీ అలా జరగలేదు. అయితే ఈ మధ్య కాలంలో అనేక రంగాల ప్రముఖలు, మేథావులతో చర్చలు జరిపారు కేసీఆర్. అన్ని అంశాలను పరిశీలించాకే ఓ క్లారిటీకి వచ్చారని తెలుస్తోంది.

ప్రస్తుతం రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నిక జరగబోతుంది.దీని తర్వాతే కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన ఉంటుందని అందరూ భావించారు. కానీ గతవారం రోజుల కిందటే పార్టీపై కేసీఆర్ ప్రకటన ఉంటుందనే వార్తలు వచ్చాయి. దానికి తగ్గట్టే కేసీఆర్ అధ్యాత్మిక పర్యటనలు చేపట్టారు. ఈ మేరకు అక్టోబర్ 5వ తేదీన హైదరాబాద్ గడ్డ సాక్షిగా టీఆర్ఎస్ పేరును భారత రాష్ట్ర సమితిగా ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. నాడు కేవలం తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా టీఆర్ఎస్ ఏర్పాటు కాగా… ఇక బీఆర్ఎస్ అజెండా, జెండా ఎలా ఉండబోతుందనేది అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. పలు ప్రాంతీయ పార్టీలు కూడా ఇవాళ బీఆర్ఎస్ లో విలీనం అవుతాయనే వార్తలు కూడా వస్తున్నాయి.

IPL_Entry_Point