తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Sachin On One Day Cricket: వన్డేలు బోర్ కొడుతున్నాయి.. ఇలా చేస్తేనే బతుకుతాయి: సచిన్ టెండూల్కర్

Sachin on one day cricket: వన్డేలు బోర్ కొడుతున్నాయి.. ఇలా చేస్తేనే బతుకుతాయి: సచిన్ టెండూల్కర్

Hari Prasad S HT Telugu

17 March 2023, 14:01 IST

    • Sachin on one day cricket: వన్డేలు బోర్ కొడుతున్నాయి.. ఇలా చేస్తేనే బతుకుతాయి అంటూ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కీలకమైన సూచన చేశాడు. ఇండియా టుడే కాన్‌క్లేవ్ లో మాస్టర్ మాట్లాడాడు.
సచిన్ టెండూల్కర్ (ఫైల్ ఫొటో)
సచిన్ టెండూల్కర్ (ఫైల్ ఫొటో) (Deepak Salvi)

సచిన్ టెండూల్కర్ (ఫైల్ ఫొటో)

Sachin on one day cricket: వన్డే క్రికెట్ మనుగడ సాగించాలంటే ఏం చేయాలో సూచించాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. ఈ ఫార్మాట్ చాలా బోర్ కొడుతోందని, దానికి కారణంగా రెండు కొత్త బాల్స్ ఉపయోగించడమే అని కూడా అతడు చెప్పాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఢిల్లీలో జరుగుతున్న ఇండియా టుడే కాన్‌క్లేవ్ లో మాట్లాడిన సచిన్.. వన్డే వరల్డ్ కప్ జరగనున్న ఏడాదిలో ఈ ఫార్మాట్ కోసం కీలకమైన సూచనలు చేశాడు.

రెండు కొత్త బంతులతోనే సమస్య

"వన్డేలు చాలా డల్లుగా ఉంటున్నాయనడంలో సందేహం లేదు. ఇక్కడ రెండు విషయాలు మాట్లాడుకోవాలి. ప్రస్తుత ఫార్మాట్ ఒకటైతే.. రెండోది ఈ ఫార్మాట్ ఎలా ఆడాలి అన్నది. ముందుగా ఇప్పుడు ఆడుతున్న విధానం గురించి మాట్లాడితే రెండు కొత్త బంతులు ఉపయోగిస్తున్నారు.

దీనివల్ల రివర్స్ స్వింగ్ చేసే ఛాన్స్ దక్కడం లేదు. 40వ ఓవర్ ఆడుతున్నా కూడా బంతికి మాత్రం అది 20వ ఓవరే అవుతుంది. కానీ ఓ బంతి 30 ఓవర్ల తర్వాతే రివర్స్ అవుతుంది" అని సచిన్ చెప్పాడు.

ఇక వన్డేల్లో చివరి 10 ఓవర్లలో ఐదుగురు ఫీల్డర్లు సర్కిల్ లోపల ఉండాలన్న నిబంధనపై కూడా సచిన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. "నేను కొందరు స్పిన్నర్లతో మాట్లాడాను. సర్కిల్ లో ఐదుగురు ఫీల్డర్ల నిబంధనపై వాళ్లేమనుకుంటున్నారో తెలుసుకోవాలని అనుకున్నాను.

దీనివల్ల తమ లైన్ మార్చుకునే అవకాశం దొరకడం లేదని వాళ్లు అంటున్నారు. అలా చేస్తే బ్యాటర్లు ఒక్కోసారి వికెట్ సమర్పించుకునే అవకాశం ఉన్నా.. చాలాసార్లు భారీగా పరుగులు ఇచ్చుకోవాల్సి వస్తోంది అని వాళ్లు అన్నారు. ఇప్పుడున్న ఫార్మాట్ లో బౌలర్లకు సరైన ఫీల్డింగ్ రక్షణ లేదు" అని సచిన్ స్పష్టం చేశాడు.

25 ఓవర్లు.. నాలుగు ఇన్నింగ్స్..

వన్డేలకు సచిన్ ఓ కొత్త ఫార్మాట్ సూచించాడు. అలా చేస్తే వన్డేలు చాలా ఆసక్తిగా మారతాయని అన్నాడు. ఈ ఫార్మాట్ ను 25 ఓవర్ల చొప్పున నాలుగు భాగాలు చేయాలని చెప్పాడు. "ఇక రెండో విషయం గురించి చెప్పాలంటే వన్డేల్లో మొదట ఓ టీమ్ 25 ఓవర్లు ఆడాలి. టెస్ట్ క్రికెట్ లాగా నాలుగు భాగాలు చేయాలి.

టెస్టుల్లో అయితే 20 వికెట్లు ఉంటాయి. ఇక్కడ పదే వికెట్లు ఉంటాయి. ఒకవేళ తొలి 25 ఓవర్లలోనే పది వికెట్లు కోల్పోతే ఇక అంతే. తర్వాతి 25 ఓవర్లు ఉండవు. నేను ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే మేము శ్రీలంకలో 118 ఓవర్లు ఎలాంటి ఫలితం లేకుండా ఆడాము.

తొలి రోజు శ్రీలంక బ్యాటింగ్ చేసి 10 ఓవర్లు ఆడిన తర్వాత వర్షం పడింది. తర్వాతి రోజు కూడా రద్దయింది. మేము ఫలితం లేకుండా 118 ఓవర్లు ఆడాము. ఇక్కడ మొదట 25 ఓవర్లు ఆడిన తర్వాత మరో టీమ్ వచ్చి 25 ఓవర్లు ఆడుతుంది. ఇక్కడ కనీసం ఒక్కో టీమ్ 25 ఓవర్లు పూర్తి చేసుకుంటాయి.

ఇప్పుడు వన్డే క్రికెట్ మరీ ముందుగానే అంచనా వేసేటట్లుగా మారిపోయింది. 15 నుంచి 40వ ఓవర్ మధ్య బోర్ కొడుతోంది. దీనిని ఎలా మార్చాలి? వన్డేల్లో మంచు ప్రభావాన్ని ఎలా తొలగించాలి. ఓ కెప్టెన్ టాస్ ఓడి రెండో ఇన్నింగ్స్ బౌలింగ్ చేయాల్సి వస్తే మంచు కారణంగా నష్టపోతున్నారు. అలా కాకుండా ఒక్కో టీమ్ 25 ఓవర్లు ఆడితే వీటిని బ్యాలెన్స్ చేయొచ్చు" అని సచిన్ స్పష్టం చేశాడు.