Saqlain Mushtaq on Sachin: సచిన్ కంటే గొప్పోళ్లు ఎవరూ లేరు.. కోహ్లి ఆ బౌలర్లను ఎదుర్కోలేడు: పాక్ మాజీ బౌలర్
Saqlain Mushtaq on Sachin: సచిన్ కంటే గొప్పోళ్లు ఎవరూ లేరు.. కోహ్లి ఆ బౌలర్లను ఎదుర్కోలేడు అని అన్నాడు పాక్ మాజీ బౌలర్ సక్లైన్ ముస్తాక్. ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప అన్న చర్చకు ఒక్క మాటతో అతడు తెరదించాడు.
Saqlain Mushtaq on Sachin: సచిన్ టెండూల్కర్ ను క్రికెట్ గాడ్ అని పిలుస్తారు. 1990, 2000లలో ఇండియన్ క్రికెటే కాదు వరల్డ్ క్రికెట్ మొత్తం మాస్టర్ చుట్టే తిరిగింది. అయితే ప్రస్తుతం క్రికెట్ లో సచిన్ రికార్డులను సవాలు చేస్తున్న ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లి. అతని ప్రతి రికార్డునూ విరాట్ తిరగరాస్తాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.
ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ లో 75 సెంచరీలు చేసిన కోహ్లి.. సచిన్ నమ్మశక్యం కాని 100 సెంచరీల రికార్డుపై కన్నేశాడు. దీంతో ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప అనే ప్రశ్న చాలా రోజులుగా వస్తోంది. అయితే పాకిస్థాన్ మాజీ బౌలర్ సక్లైన్ ముస్తాక్ ఒక్క మాటలో అసలు సచిన్ కంటే గొప్పోళ్లు ఎవరూ లేరని తేల్చేశాడు. సచిన్ ఎదుర్కొన్న నాణ్యమైన బౌలర్ల గురించి చెబుతూ అతడే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని స్పష్టం చేశాడు.
""ఇది నేను చెప్పే మాట కాదు. ఎవరైనా ఇదే చెబుతారు. ప్రపంచంలో సచిన్ టెండూల్కర్ కంటే గొప్ప బ్యాటర్ ఎవరూ లేరు. ఏ షాట్ కైనా ఉదాహరణ చెప్పాలంటే సచిన్ పేరే చెబుతాం. విరాట్ కోహ్లి ఈ కాలంలో లెజెండ్ కావచ్చు. కానీ సచిన్ మాత్రం అత్యంత కఠినమైన బౌలర్లను ఎదుర్కొన్నాడు. ఆ కాలంలో బౌలర్లు చాలా భిన్నంగా ఉండేవాళ్లు.
కోహ్లి ఏమైనా వసీం అక్రమ్ ను ఎదుర్కొన్నాడా? వాల్ష్, ఆంబ్రోస్, మెక్‌గ్రాత్, షేన్ వార్న్, మురళీధరన్ లను ఎదుర్కొన్నాడా? వాళ్లంతా గొప్ప బౌలర్లు. చాలా తెలివైన బౌలర్లు. బ్యాటర్లను ఎలా బోల్తా కొట్టించాలో వాళ్లకు తెలుసు. ఇప్పుడు రెండు రకాల బౌలర్లు ఉన్నారు. ఒకరికి ఎలా ఆపాలో తెలుసు. మరొకరికి ఎలా వికెట్ తీయాలో తెలుసు. కానీ వాళ్లకు మాత్రం ఈ రెండూ తెలుసు" అని నదీర్ అలీ షోలో మాట్లాడుతూ సక్లైన్ ముస్తాక్ అన్నాడు.
ఇక ఈ కాలంలో విరాట్ కోహ్లి, బాబర్ ఆజంలను చాలా మంది పోలుస్తుంటారు. దీనిపై కూడా సక్లైన్ స్పందించాడు. నిజానికి విరాట్ తో పోల్చాలంటే బాబర్ ఇంకా సాధించాల్సింది చాలానే ఉన్నా.. సాంకేతికంగా కోహ్లి కంటే బాబరే బెటర్ బ్యాటర్ అని సక్లైన్ అనడం విశేషం.
"కోహ్లి, బాబర్ పూర్తి భిన్నమైన బ్యాటర్లు. ఎవరి క్లాస్ వాళ్లది. కానీ బ్యూటీ, పర్ఫెక్షన్, సాంకేతిక అంశాలు చూస్తే మాత్రం బాబర్ కవర్ డ్రైవ్ లు చాలా చాలా బెటర్ గా ఉంటాయి" అని సక్లైన్ స్పష్టం చేశాడు.
సంబంధిత కథనం