Ravi Shastri on ODIs: వన్డేలను 40 ఓవర్లకు తగ్గించాలి.. అలా అయితేనే మనుగడ: రవిశాస్త్రి-ravi shastri on odis says they should be reduced to 40 overs an innings ,స్పోర్ట్స్ న్యూస్
Telugu News  /  Sports  /  Ravi Shastri On Odis Says They Should Be Reduced To 40 Overs An Innings

Ravi Shastri on ODIs: వన్డేలను 40 ఓవర్లకు తగ్గించాలి.. అలా అయితేనే మనుగడ: రవిశాస్త్రి

టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి
టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి (Twitter)

Ravi Shastri on ODIs: వన్డేలను 40 ఓవర్లకు తగ్గించాలి.. అలా అయితేనే మనుగడ సాగిస్తాయని అన్నాడు మాజీ కోచ్ రవిశాస్త్రి. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు సందర్భంగా వన్డేలపై చర్చ జరిగింది.

Ravi Shastri on ODIs: క్రికెట్ టెస్ట్ క్రికెట్ గా మొదలై తర్వాత వన్డేలు, టీ20లుగానూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఒకప్పుడు వన్డే క్రికెట్ ప్రారంభమైన కొత్తలో ప్రేక్షకులకు మంచి మజా అందించింది. ఐదు రోజుల పాటు సాగే టెస్ట్ క్రికెట్ కంటే ఒక రోజులో ముగిసే వన్డేలు ఆకట్టుకున్నాయి. మొదట ఇన్నింగ్స్ కు 60 ఓవర్లు ఉండగా తర్వాత 50 ఓవర్లకు కుదించారు.

ట్రెండింగ్ వార్తలు

అయితే టీ20 క్రికెట్ వచ్చే వరకూ వన్డేల పరిస్థితి బాగానే ఉంది. ఆ తర్వాత క్రమంగా ఈ ఫార్మాట్ తన చరిష్మా కోల్పోతూ వస్తోంది. ఇప్పుడు వన్డేలంటే అభిమానులూ మొహం చిట్లిస్తున్నారు. ఒక రోజంతా ఎవరు టీవీల ముందు కూర్చుంటారని మాజీ క్రికెటర్లే అభిప్రాయపడుతున్నారు. తాజాగా మాజీ కోచ్ రవిశాస్త్రి వన్డేలు మనుగడ సాగించడానికి చాన్నాళ్లుగా ఉన్న ఓ ప్రతిపాదనను మరోసారి తెరపైకి తెచ్చాడు.

"వన్డే క్రికెట్ మనుగడ సాగించాలంటే 40 ఓవర్లకు కుదించాలి. ఎందుకంటే మేము వరల్డ్ కప్ గెలిచినప్పుడు అది 60 ఓవర్లుగా ఉండేది. ఆ తర్వాత దీనిని 50 ఓవర్లకు కుదించారు. ఇప్పుడు దానిని 40 ఓవర్లకు కుదించే సమయం వచ్చింది. కాలాన్ని బట్టి మారాలి. ఫార్మాట్ ను తగ్గించాలి" అని రవిశాస్త్రి అన్నాడు. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు, నాలుగో రోజు ఆటలో కామెంట్రీ ఇస్తున్న సమయంలో రవిశాస్త్రి ఈ కామెంట్స్ చేశాడు.

"టీ20 ఫార్మాట్ ముఖ్యమైనది. ఆట పరిణామ క్రమంలో ఇది తప్పనిసరి. ఇది క్రికెట్ కు కామధేనువులాంటిది. అయితే ద్వైపాక్షిక సిరీస్ లు తగ్గించాలి. టీ20 ఆట మజా అందించేందుకు ప్రపంచవ్యాప్తంగా చాలా డొమెస్టిక్ లీగ్స్ ఉన్నాయి. ఆ లీగ్స్ మధ్యలో అప్పుడప్పుడూ వరల్డ్ కప్ జరిగితే చాలు. మరీ అవసరమైతే వరల్డ్ కప్ ముందు కొన్ని ద్వైపాక్షిక సిరీస్ లు నిర్వహించాలి. అలా అయితే మూడు ఫార్మాట్లూ ఉంటాయి" అని రవిశాస్త్రి స్పష్టం చేశాడు.

టెస్ట్ క్రికెట్ కు అన్నింటి కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా శాస్త్రి కోరాడు. భారత ఉపఖండంతోపాటు ఆస్ట్రేలియాలాంటి దేశాలలో క్రికెట్ మూడు ఫార్మాట్లూ మనుగడ సాగిస్తాయని అభిప్రాయపడ్డాడు. వన్డేలు మనుగడ సాగించాలంటే ఈ ఫార్మాట్ ను 40 ఓవర్లకు కుదించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఒకప్పుడు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడం విశేషం.

సంబంధిత కథనం