తెలుగు న్యూస్  /  Sports  /  Pakistan Vs New Zealand In T20 World Cup Semis As The Former Never Lost To New Zealand In Semis

Pakistan vs New Zealand: వరల్డ్‌కప్‌ సెమీఫైనల్స్‌లో న్యూజిలాండ్‌పై పాకిస్థాన్‌కు తిరుగులేని రికార్డు

Hari Prasad S HT Telugu

08 November 2022, 17:02 IST

    • Pakistan vs New Zealand: వరల్డ్‌కప్‌ సెమీఫైనల్స్‌లో న్యూజిలాండ్‌పై పాకిస్థాన్‌కు తిరుగులేని రికార్డు ఉంది. బుధవారం (నవంబర్‌ 9) ఈ రెండు టీమ్స్‌ మధ్య టీ20 వరల్డ్‌కప్‌ సెమీస్‌ జరగనున్న నేపథ్యంలో ఈ రికార్డుతో పాక్‌ కాన్ఫిడెంట్‌గా బరిలోకి దిగబోతోంది.
పాకిస్థాన్ క్రికెట్ టీమ్
పాకిస్థాన్ క్రికెట్ టీమ్ (ANI)

పాకిస్థాన్ క్రికెట్ టీమ్

Pakistan vs New Zealand: టీ20 వరల్డ్‌కప్‌ 2022 నాకౌట్‌ స్టేజ్‌కు చేరుకుంది. ఎంతో ఆసక్తి రేపిన సూపర్ 12 స్టేజ్‌లో సంచలనాలు, అనూహ్య జయాపజయాలు, ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టిన మ్యాచ్‌లను చూసిన తర్వాత ఇక సెమీఫైనల్స్‌కు రంగం సిద్ధమైంది. బుధవారం (నవంబర్‌ 9) పాకిస్థాన్, న్యూజిలాండ్‌ మధ్య సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో తొలి సెమీఫైనల్‌ జరగనుంది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

అయితే సూపర్‌ 12 స్టేజ్‌లోనే ఇంటిదారి పట్టే ప్రమాదం నుంచి అనూహ్యంగా సెమీఫైనల్‌ చేరిన పాకిస్థాన్‌ ఈ మ్యాచ్‌కు చాలా కాన్ఫిడెంట్‌గా బరిలోకి దిగుతోంది. తొలి రెండు మ్యాచ్‌లలో ఓడినా.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌లు గెలవడం, అటు నెదర్లాండ్స్‌ చేతుల్లో సౌతాఫ్రికా అనూహ్య ఓటమితో పాకిస్థాన్‌ సెమీస్‌ చేరింది.

ఇక ఇప్పటి వరకూ వన్డే కానీ, టీ20 కానీ వరల్డ్‌కప్‌ సెమీఫైనల్స్‌లో న్యూజిలాండ్‌ చేతుల్లో ఓటమెరుగని రికార్డు పాకిస్థాన్‌కు ఉండటం విశేషం. ఈ రెండు టీమ్స్‌ వన్డే, టీ20 వరల్డ్‌కప్‌లలో కలిపి మూడు సెమీఫైనల్స్‌లో తలపడగా.. అన్నింట్లోనూ పాకిస్థానే పైచేయి సాధించింది.

1992 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌

1992లో వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌ విజేతగా నిలిచింది. అయితే అంతకుముందు లీగ్‌ స్టేజ్‌లో ఒకసారి, సెమీఫైనల్లో మరోసారి న్యూజిలాండ్‌ను ఆ టీమ్‌ ఓడించింది. లీగ్ స్టేజ్‌లో 7 వికెట్లతో, సెమీస్‌లో 4 వికెట్లతో విజయం సాధించింది. న్యూజిలాండ్‌ను వాళ్ల సొంతగడ్డ (ఆక్లాండ్‌)పైనే పాక్‌ సెమీఫైనల్లో ఓడించింది. ఆ మ్యాచ్‌లో ఇంజమాముల్‌ హక్‌ 37 బాల్స్‌లోనే 60 రన్స్‌ చేశాడు. దీంతో పాక్‌ 4 వికెట్లతో గెలిచి ఫైనల్‌ చేరింది. ఫైనల్లోనూ ఇంజమామ్‌ 35 బాల్స్‌లో 42 రన్స్‌ చేయడంతో ఇంగ్లండ్‌ను మట్టి కరిపించి తొలిసారి పాకిస్థాన్ విశ్వవిజేతగా నిలిచింది.

1999 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌

ఏడేళ్ల తర్వాత మరోసారి వన్డే వరల్డ్‌కప్‌ సెమీఫైనల్లో పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ తలపడ్డాయి. ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌లో ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో షోయబ్‌ అక్తర్‌ చెలరేగడంతో మొదట బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 7 వికెట్లకు 241 రన్స్‌ మాత్రమే చేసింది. ఆ తర్వాత ఓపెనర్‌ సయీద్‌ అన్వర్‌ సెంచరీ (113) చేయడంతో పాకిస్థాన్‌ 9 వికెట్లతో సులువుగా విజయం సాధించి ఫైనల్‌ చేరింది. అయితే ఫైనల్లో ఆస్ట్రేలియా చేతుల్లో ఓడిపోయింది.

2007 టీ20 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌

2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్లోనూ పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ తలపడ్డాయి. పాక్‌ బౌలర్‌ ఉమర్‌ గుల్‌ 3 వికెట్లు తీయడంతో న్యూజిలాండ్‌ 143 రన్స్‌ మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత ఇమ్రాన్‌ నజీర్‌ 59 రన్స్‌ చేయడంతో పాకిస్థాన్‌ ఏడు బాల్స్‌ మిగిలి ఉండగానే టార్గెట్‌ చేజ్‌ చేసింది. అయితే ఫైనల్లో ఇండియా చేతుల్లో ఓడి ట్రోఫీకి దూరమైంది.

గత రికార్డు చూసుకుంటే ఈసారి కూడా తమ జట్టే విజేతగా నిలుస్తుందని పాకిస్థాన్‌ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి ఊపు మీదున్న పాక్‌ టీమ్‌ను న్యూజిలాండ్‌ ఎంత వరకూ నిలువరిస్తుందో చూడాలి. పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ బుధవారం (నవంబర్‌ 9) మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది. స్టార్‌ నెట్‌వార్క్‌, డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఈ మ్యాచ్ చూడొచ్చు.