New Zealand vs Ireland: ఐర్లాండ్‌ను చిత్తు చేసి సెమీస్‌లోకి న్యూజిలాండ్‌-new zealand beat ireland to confirm their semifinal berth in t20 world cup 2022 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  New Zealand Beat Ireland To Confirm Their Semifinal Berth In T20 World Cup 2022

New Zealand vs Ireland: ఐర్లాండ్‌ను చిత్తు చేసి సెమీస్‌లోకి న్యూజిలాండ్‌

Hari Prasad S HT Telugu
Nov 04, 2022 01:09 PM IST

New Zealand vs Ireland: ఐర్లాండ్‌ను చిత్తు చేసి సెమీస్‌ బెర్త్‌ను ఖాయం చేసుకుంది న్యూజిలాండ్‌ టీమ్‌. టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్ చేరుకున్న తొలి జ‌ట్టుగా నిలిచింది. శుక్ర‌వారం (నవంబర్‌ 4) జరిగిన ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను 35 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఓడించింది.

న్యూజిలాండ్ టీమ్
న్యూజిలాండ్ టీమ్ (AP)

New Zealand vs Ireland: టీ20 వరల్డ్‌కప్‌ 2022లో తొలి సెమీఫైనల్ బెర్త్‌ను న్యూజిలాండ్ ఖాయం చేసుకుంది. శుక్రవారం (నవంబర్‌ 4) తన చివరి సూపర్‌ 12 మ్యాచ్‌లో కివీస్.. ఐర్లాండ్‌పై విజయం సాధించింది. ఆల్‌రౌండ్ పర్ఫార్మెన్స్‌తో ఈ కీలకమైన మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజ‌యంతో మొత్తం 7 పాయింట్లు సాధించిన న్యూజిలాండ్‌ గ్రూప్ ఏ లో టాప‌ర్‌గా నిలిచింది. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సెమీఫైన‌ల్ చేరిన తొలి టీమ్‌గా నిలిచింది. మొదట బ్యాటింగ్‌లో కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌, తర్వాత బౌలింగ్‌లో లాకీ ఫెర్గూసన్‌ రాణించడంతో న్యూజిలాండ్‌ సులువుగా విజయం సాధించగలిగింది.

ఈ మ్యాచ్‌లో 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 150 రన్స్‌ మాత్రమే చేసింది. న్యూజిలాండ్‌ బౌలర్లలో ఫెర్గూసన్ 3 వికెట్లు తీయగా.. టిమ్‌ సౌథీ, సాంట్నర్‌, ఇష్‌ సోధి తలా రెండు వికెట్లు తీసుకున్నారు. ఐర్లాండ్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ పాల్‌ స్టిర్లింగ్‌ 37 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ విజయంతో న్యూజిలాండ్‌ 7 పాయింట్లతో గ్రూప్‌ 1లో టాపర్‌గా ముగించింది.

ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా టీమ్స్‌కు కూడా ఏడు పాయింట్లు అందుకునే వీలున్నా.. నెట్‌ రన్‌రేట్‌ పరంగా న్యూజిలాండ్‌ ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. మరో బెర్త్ కోసం ఆఫ్ఘనిస్థాన్‌తో ఆస్ట్రేలియా, శ్రీలంకతో ఇంగ్లండ్‌ తలపడనున్నాయి.

ఆఫ్ఘనిస్థాన్‌తో ఆస్ట్రేలియా శుక్రవారమే (నవంబర్‌ 4) తలపడుతోంది. ఇక శ్రీలంకతో ఇంగ్లండ్‌ మ్యాచ్ శనివారం (నవంబర్ 5) జరగనుంది. ఆఫ్ఘనిస్థాన్‌పై ఆస్ట్రేలియా గెలిస్తే ఆ టీమ్‌ 7 పాయింట్లకు చేరుతుంది. అయితే ఇంగ్లండ్‌ నెట్‌ రన్‌రేట్‌ కంటే ఆస్ట్రేలియా చాలా వెనుకబడి ఉంది. దీంతో శ్రీలంక చేతుల్లో ఓడటం లేదంటే మ్యాచ్ రద్దయితే తప్ప ఇంగ్లండ్‌కే సెమీస్‌ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో కేన్‌ విలియమ్సన్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడు కేవలం 35 బాల్స్‌లో 61 రన్స్‌ చేశాడు. విలియమ్సన్‌ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. ఇక ఫిన్‌ అలెన్‌ 32, డారిల్ మిచెల్‌ 31 రన్స్‌ చేశారు.

WhatsApp channel