తెలుగు న్యూస్  /  Sports  /  Asia Cup 2023 Related Matters To Be Discussed On February 4th In Acc Emergency Meeting

Asia Cup 2023: ఆసియా కప్ కోసం టీమిండియా పాకిస్థాన్ వెళ్తుందా లేదా.. తేలేది ఆ రోజే!

Hari Prasad S HT Telugu

24 January 2023, 11:15 IST

    • Asia Cup 2023: ఆసియా కప్ కోసం టీమిండియా పాకిస్థాన్ వెళ్తుందా లేదా? ఈ ప్రశ్నకు సమాధానం త్వరలోనే తేలనుందా? అసలు ఈ ఏడాది ఆసియా కప్ పాకిస్థాన్ లోనే జరుగుతుందా అన్నది కూడా ఆ రోజే తేలనున్నట్లు సమాచారం.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ నజమ్ సేఠీ
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ నజమ్ సేఠీ (AP)

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ నజమ్ సేఠీ

Asia Cup 2023: ఆసియా కప్ 2023 పాకిస్థాన్ లో జరగనున్న విషయం తెలిసిందే కదా. అయితే ఈ టోర్నీ కోసం ఇండియన్ టీమ్ ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్థాన్ వెళ్లబోదని, టోర్నీనే మరో చోటుకు తరలిస్తామని గతేడాది ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, బీసీసీఐ సెక్రటరీ జై షా చెప్పడం దుమారం రేపింది. దీనిపై అప్పటి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా తీవ్రంగా స్పందించారు. అలా చేస్తే వరల్డ్ కప్ నే బాయ్ కాట్ చేస్తామనీ హెచ్చరించారు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఇక ఇప్పుడు పీసీబీ ఛైర్మన్ గా ఉన్న నజమ్ సేఠీ తాజాగా ఏసీసీపై ఒత్తిడి తీసుకొచ్చి ఓ ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేయించారు. ఫిబ్రవరి 4వ తేదీన ఏసీసీ బహ్రెయిన్ లో అత్యవసరంగా సమావేశం కానుంది. ఆసియా కప్ 2023 వేదికపై నిర్ణయం తీసుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మధ్య తాను దుబాయ్ వెళ్లిన సమయంలో ఏసీసీ సభ్యులను ఈ అత్యవసర సమావేశానికి ఒప్పించినట్లు పీసీబీ ఛీఫ్ నజమ్ సేఠీ వెల్లడించారు.

"ఏసీసీ బోర్డు ఫిబ్రవరి 4న బహ్రెయిన్ లో సమావేశం కానుండటం చాలా పెద్ద ముందడుగు. ఈ సమావేశంలోనే ఆసియా కప్ కు సంబంధించిన అంశాలను చర్చిస్తాం. మార్చిలో ఐసీసీ మీటింగ్ కూడా జరగనుంది. ఏసీసీ సభ్యులతో నేను ఏం మాట్లాడాను, నేను ఏ నిర్ణయం తీసుకున్నాను అన్నది బయటపెట్టను. కానీ ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ సంబంధాలు మాత్రం చాలా ముఖ్యం" అని నజమ్ సేఠీ చెప్పారు.

గతేడాది శ్రీలంకలో జరగాల్సిన ఆసియా కప్ తప్పనిసరి పరిస్థితుల్లో యూఏఈకి తరలించాల్సి వచ్చింది. ఈ ఏడాది ఈ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వాల్సి ఉంది. అయితే దీనికోసం ఇండియన్ టీమ్ అక్కడికి వెళ్లే ప్రసక్తే లేదని బీసీసీఐ కార్యదర్శి జై షా చెప్పారు. అవసరమైతే పాకిస్థాన్ నుంచే టోర్నీని తరలిస్తామని కూడా అన్నారు. దీనిపై పాక్ క్రికెట్ బోర్డు గుర్రుగా ఉంది.

ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్ కు రాబోమని కూడా బెదిరించింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 4న సమావేశం కానున్న ఏసీసీ దీనిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కూడా పాకిస్థాన్ లో జరగనున్న నేపథ్యంలో ఈ ఏడాది ఆసియా కప్ నిర్వహణ విషయంలో స్పష్టత ఉండాల్సిన అవసరం ఉన్నదని పీసీబీ ఛీఫ్ నజమ్ సేఠీ అన్నారు.