Kapil Warning to BCCI Selectors: కెప్టెన్సీపై సెలక్టర్లకు కపిల్ వార్నింగ్.. ఒక్క సిరీస్‌లో ఓడగానే తీసేయకూడదని స్పష్టం
Kapil Warning to BCCI Selectors: భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బీసీసీఐ సెలక్టర్లకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. హార్దిక్ పాండ్య కెప్టెన్సీ విషయంపై స్పందించిన ఆయన.. ఒక్కసిరీస్‌లో ఓడగానే తొలగించకూడదని స్పష్టం చేశారు.
Kapil Warning to BCCI Selectors: ప్రస్తుతం టీమిండియా టీ20 ఫార్మాట్‌కు కెప్టెన్ విషయంపై సర్వత్ర చర్చ నడుస్తోంది. ఇది హాట్ టాపిక్‌గా మారింది. భారత క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా టీమిండియాను ఇద్దరు కెప్టెన్లు లీడ్ చేస్తున్నారు. రోహిత్ శర్మ వన్డే, టెస్టు సిరీస్‌కు సారథిగా ఉండగా.. హార్దిక్ పాండ్య టీ20 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. దీర్ఘకాలంలో ప్రణాళికలను దృష్టిలో ఉంచుకుని హార్దిక్‌కు పొట్టి ఫార్మాట్ పగ్గాలు ఇచ్చారు. 2023 ప్రపంచకప్ తర్వాత రోహిత్ శర్మ కేవలం టెస్టు జట్టుకే పరిమతం చేస్తారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. హార్దిక్‌కు కెప్టెన్సీని అప్పగించే విషయంపై భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ కూడా స్పందించారు. బీసీసీఐ దీర్ఘకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కెప్టెన్‌ను నియమించాలని, ఒక్క సిరీస్‌లో ఓడగానే తీసేయడం తగదని హెచ్చరించారు.
"బయట ప్రపంచం ఏమనుకుంటుందో చూడకూడదని నేను అనుకుంటున్నాను. మీ ఆలోచన విధానానికి అనుగుణంగా జట్టును ఎంపిక చేయాలి. హార్దిక్ పాండ్య విషయానికే వద్దాం. 'హార్దిక్ నువ్వు ఒక్కసిరీస్ ఓడిపోతే నిన్ను మేము తొలగిస్తాం' అనే విధంగా వ్యవహరించకూడదు. మీరు ఎవరినైనా కెప్టెన్‌గా చేయదలచుకుంటే దీర్ఘకాలాన్ని దృష్టిలో పెట్టుకుని బాధ్యతలు అప్పగించాలి. అతడు కూడా పొరపాట్లు చేయవచ్చు. అంత మాత్రాన ఆ తప్పులను వేలెత్తి చూపకుండా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జట్టును ముందుకు నడిపించేలా ఫోకస్ పెట్టాలి. ప్రతి సిరీస్‌కు లెక్కలు వేసుకొని చూడకూడదు." అని కపిల్ దేవ్ తెలిపారు.
గతేడాది ఇదే సమయంలో రోహిత్ స్థానంలో కెప్టెన్‌గా హార్దిక్ వచ్చాడు. అప్పుడు కెప్టెన్సీ రేసులో ఏడుగురు ఆటగాళ్లు నిలిచారు. రిషభ్ పంత్, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ సహా ఏడుగురు క్రికెటర్లు దీని కోసం చూశారు. చాలా కాలంగా రోహిత్, రాహుల్ మధ్య ఈ పోటీ కనిపించింది. కానీ చివరకు హార్దిక్ పాండ్యాకు ప్రయోజనం చేకూరింది.
హార్దిక్ నేతృత్వంలో టీమిండియా రెండు మ్యాచ్‌ల్లోనే ఓడింది. గతేడాది ఐపీఎల్ గెలిచిన గుజరాత్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన పాండ్య.. తన ప్రాబవాన్ని చూపాడు. హార్దిక్ పాండ్య బ్యాటింగ్‌లోనూ మెచ్యురిటీ కనిపించింది. టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు.
సంబంధిత కథనం