అక్షయ నవమి ఎప్పుడు? దీని ప్రాముఖ్యత ఏంటి? ఈరోజు ఉసిరిని ఎందుకు పూజిస్తారు?
05 November 2024, 10:35 IST
- కార్తీకమాసం శుక్ల పక్ష నవమి రోజు అక్షయ నవమి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ ఏడాది నవంబర్ 10 జరుపుకుంటారు. ఈరోజు లక్ష్మీదేవి ఉసిరి చెట్టు కింద విష్ణువు, శివుడిని పూజించిందని పురాణాలు చెబుతున్నాయి.
అక్షయ నవమి ఎప్పుడు?
దీపావళి పండుగ చేసుకున్న ఎనిమిది రోజుల తర్వాత అక్షయ వ్రతం పాటించడం చేస్తారు. అంటే కార్తీక మాసం శుక్ల పక్ష నవమి రోజు అక్షయ నవమి జరుపుకుంటారు. దీన్నే ఉసిరి నవమి అంటారు. ఈ ఏడాది అక్షయ నవమి నవంబర్ 10న వచ్చింది. అక్షయ నవమి నుండి కార్తీక పౌర్ణిమ వరకు విష్ణు మూర్తి ఉసిరి చెట్టుపైనే ఉంటాడు.
లేటెస్ట్ ఫోటోలు
ఈ రోజు చేసే పూజలు, దానాలు శాశ్వత ఫలితాలను ఇస్తాయని నమ్ముతారు. అమల నవమి, ఉసిరి నవమి అని పిలుస్తారు. అక్షయ నవమి వ్రతాన్ని ఆచరించిన వారికి సంపదలు చేకూరతాయని పండితులు చెబుతున్నారు. అక్షయ నవమి రోజు పూజ చేయడం వల్ల సంతానం కలుగుతుందని, సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్ముతారు. అందుకే కుటుంబ సమేతంగా ఉసిరి చెట్టు కింద భోజనాలు చేస్తారు. ఈరోజు విష్ణువును పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు పెరుగుతాయి.
కూష్మాండ అనే రాక్షసుడిని శ్రీ మహా విష్ణువు సంహరించినది అక్షయ నవమి రోజేనని పురాణాలు చెబుతున్నాయి. అమల నవమి రోజున కృష్ణుడు బృందావనాన్ని విడిచిపెట్టి, కంసుని ఆహ్వానంపై మధుర వైపు బయలుదేరాడు.
బ్రహ్మదేవుని కన్నీటి నుండి ఉసిరి ఆవిర్భవించిందని పద్మ, స్కంద పురాణాలలో వివరించారు. మరొక కథనం ప్రకారం సముద్ర మథనం సమయంలో అమృత కలశం నుండి అమృతపు చుక్కలు భూమిపై పడినప్పుడు ఉసిరి ఉద్భవించిందని చెబుతారు. ఇది మాత్రమే కాకుండా శివుడు విషం తాగుతుండగా భూమిపై పడిన చుక్కలు భాంగ్, ఉమ్మెత్త పువ్వు వచ్చాయి.
ఒకప్పుడు లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తోందని ఒక కథనం. విష్ణువు, శివుడు కలిసి ఎలా పూజించాలని లక్ష్మీదేవికి సందేహం కలిగింది. అప్పుడు విష్ణువు తులసిని ప్రేమిస్తాడని, శివుడికి ప్రీతికరమైనదని తెలుసుకుంది. ఈ రెండింటి లక్షణాలు ఉసిరిలో కలిసి ఉంటాయి. ఉసిరి చెట్టును విష్ణువు, శివుని చిహ్నంగా భావించి లక్ష్మీదేవి పూజించింది. వారి పూజకు సంతోషించిన విష్ణువు, శివుడు ప్రత్యక్షమయ్యారు. లక్ష్మీదేవి ఉసిరి చెట్టు కింద శివకేశవులకు భోజనం వడ్డించింది. ఆ ఆహారాన్ని ప్రసాదంగా స్వీకరించింది. ఆ రోజు నుండి ఈ తిథి ఉసిరి నవమిగా ప్రసిద్ధి చెందింది.
ఈ రోజు ఉసిరి చెట్టును పూజించడం, ఉసిరికాయతో స్నానం చేయడం, ఉసిరికాయ తినడం, ఉసిరి దానం చేయడం వల్ల తరగని పుణ్యం లభిస్తుందని విశ్వాసం. అందుకే కార్తీక మాసంలో ఉసిరి కింద దీపాలు వెలిగించడం, ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.
మరొక కథనం ప్రకారం ఈ రోజు ఒక పేద మహిళ ఆదిశంకరాచార్యులకు భిక్షలో ఎండు ఉసిరిని ఇచ్చింది. ఆ పేద మహిళ పేదరికాన్ని చూసి చలించిపోయిన శంకరాచార్యుడు 'కనకధారా' స్తోత్రంగా పిలువబడే మంత్రాల ద్వారా లక్ష్మీదేవిని స్తుతించాడు. ఆ పేద మహిళ వద్ద డబ్బు లేకపోయినా శంకరాచార్యుల కోరికపై లక్ష్మీదేవి ఆమె ఇంటిపై బంగారు ఉసిరి కాయలు కురిపించి ఆమె పేదరికాన్ని తొలగించింది. ఈ రోజున విష్ణువు కూష్మాండ అనే రాక్షసుడిని సంహరించాడు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.