Kanakadhara stotram: కనకధారా స్తోత్రం విశిష్టత ఏమిటి? ఈ స్తోత్రం అర్థమేమిటి?-what is special about kanakadhara stotram what is the meaning of this hymn ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Kanakadhara Stotram: కనకధారా స్తోత్రం విశిష్టత ఏమిటి? ఈ స్తోత్రం అర్థమేమిటి?

Kanakadhara stotram: కనకధారా స్తోత్రం విశిష్టత ఏమిటి? ఈ స్తోత్రం అర్థమేమిటి?

HT Telugu Desk HT Telugu
May 10, 2024 05:52 PM IST

Kanakadhara stotram: కనకధారా స్త్రోత్రం అంటే ఏంటి? ఈ స్తోత్రం విశిష్టత ఏంటి? దీని అర్థం గురించి పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చక్కగా వివరించారు.

కనకధారా స్తోత్రం
కనకధారా స్తోత్రం

Kanakadhara stotram: శంకరాచార్యులవారు వైశాఖ మాస శుక్ల పక్ష తదియనాడు కేరళ రాష్ట్రంలో కాలడి గ్రామములో భిక్షాటన కోసం పేద బ్రాహ్మణ స్త్రీ ఇంటికి వెళ్ళగా ఆమె తన ఇంటిలో భగవంతుడు దగ్గర నివేదనగా ఉన్నటువంటి ఉసిరికాయను శంకరులకు భిక్షగా వేసినటువంటి రోజు. ఆ భిక్షను స్వీకరించి కనకధారా స్తోత్రాన్ని శంకరాచార్యులవారు చెప్పినరోజు వైశాఖ మాస శుక్ల పక్ష తదియ అక్షయ తృతీయగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

ఏ మానవుడికైతే జీవితంలో ధన సమస్యలు ఎదుర్కొంటున్నాడో ధనపరమైనటువంటి విషయాలలో లక్ష్మీ కటాక్షాన్ని పొందాలని చూస్తున్నాడో అటువంటి వారికి కనకధారా స్తోత్రం ఒక వరం అని చిలకమర్తి తెలిపారు. ఈ స్తోత్రాన్ని ప్రతీ శుక్రవారం పారాయణం చేయటం లేదా అక్షయ తృతీయ వంటి పర్వదినాలలో పారాయణ చేయటం వలన లక్ష్మీ కటాక్షం లభిస్తుందని చిలకమర్తి తెలిపారు.

“'కనకధారాస్తవం”' పారాయణ చేయడం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం శీఘ్రంగా లభిస్తుంది. దారిద్ర్య బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అష్టలక్ష్ముల సమష్టి రూపమైన మహాలక్ష్మిదేవి అనుగ్రహం ద్వారా దైనందిన జీవితంలో భోగభాగ్యాలు కలగటంతో పాటు శాశ్వతమైన విష్ణులోకప్రాప్తి మహాలక్ష్మి అనుగ్రహంద్వారా కలుగుతుంది. అదే నిజమైన సంపద. అదే నిజమైన లక్ష్మీకటాక్షం అని చిలకమర్తి తెలిపారు. ఈ కనకధారా స్తోత్రం అర్ధాన్ని వివరంగా ఈ క్రింద అందచేస్తున్నాం.

అంగం హరేః పులక భూషణ మాశ్రయన్తి

భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్‌|

అంగీకృతాభిల విభూతి రపాంగలీలా

మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః ||

తాత్పర్యం: మొగ్గలతో శోభిల్లే గానుగు చెట్టును ఆడు తుమ్మెద ఆశ్రయించినట్లుగా, గానుగువృక్షం మాదిరి చల్లనివాడూ, నల్లని వాడూ అయిన మహావిష్ణువు ఆనందం వల్ల ఏర్పడిన గగుర్పాటుతో కూడిన శరీరాన్ని మంగళదేవత అనే సార్ధక నామాన్ని ధరించిన శ్రీ మహాలక్ష్మి ఆశ్రయించి ఉంది. ఆమెకు విష్ణు వక్షస్థలమే నివాస భూమి కదా! అట్టి సకలైశ్వర్యాలకూ నిలయములైన ఆ జగజ్జనని కరుణా కటాక్ష వీక్షణాలు నా మీద ప్రసరించి నాకు శుభాలిచ్చు గాక!

ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః

ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని|

మాలాద్భశోర్మధుకరీవ మహోత్పలే యా

సా మే శ్రియం దిశతు సాగరసంభవాయాః ||

తాత్పర్యం: నల్లకలువ మీద ఆడు తుమ్మెద ప్రీతితో వ్రాలినట్లు శ్రీమహా లక్ష్మి సుందరమైన చూపులు ప్రణయంచేత తన నాథుదైన నారాయణుని చూచుటకు ముందుకు సాగుతున్నాయి. ఆయన తన్ను చూచినప్పుడు సిగ్గుతో ఆమె చూపులు వెనుకకు మరలుతున్నాయి. ఈ రీతిగా ప్రణయం చేత, ఆయన తన వైపు చూడనప్పుడు ప్రియుణ్ణి వీక్షిస్తూ, ఆయన చూపులు తన మీదికి వ్రాలినప్పుడు లజ్జతో వెనుకకు మరలుతున్న ఆ కలుముల చెలి కంటి చూపులు నా మీద ప్రసరించి నాకు సిరిసంపదలు అనుగ్రహించును గాక!

విశ్వామరేంద్రపదవి భ్రమ దానదక్షం

ఆనంద హేతురధికం మురవిద్విషోపి|

ఈషన్నిషీదతు మయి క్షణ మీక్షణార్థం

మిందీవరోదర సహోదర మిందిరాయాః ||

తాత్పర్యం: నల్లకలువ పూవు లోపలి భాగంవలె నల్లని కాంతితో విలసిల్లు శ్రీ మహాలక్ష్మి క్రీగంటి చూపు సమస్త స్వర్గ సామ్రాజ్యాధిపత్యాన్ని తన భక్తులకు అనుగ్రహించడానికి శక్తి గలిగి ఉంది. అ చూపు మురాంతకుడైన శ్రీ మహావిష్ణువునకు సైతం మిక్కిలి అనందాన్ని కలిగిస్తుంది. అట్టి ఇందిరాదేవి అరవిరిసిన కను చూపు నాయందు త్రుటికాలం ఒకింత నిల్చియుండుగాక!

ఆమీలితాక్ష మధిగమ్య ముదా ముకుంద

మానంద కంద మనిమేష మనంగ తంత్రమ్‌|

ఆఅకేకర స్థిత కనీనిక పక్ష్మనేత్రం

భూత్యై భవే న్మమ భుజంగశయాంగనాయాః ||

తాత్పర్యం: ఇంచుక మూసుకొన్న కన్నులుగల వాడూ, అనందానికి ఆధారమైనవాడూ అయిన నారాయణుని ప్రీతితో పొంది, రెప్ప పాటు లేనిదీ, మదనపరవశమైందీ, అర మూసిన కనురెప్పలు గలదీ అయిన ఓరగంటితో సిగ్గు బరువున స్వామిని వీక్షిస్తున్న రమాదేవి నేత్రదృష్టి నాకు సంపదలు ప్రసాదించుగాక!

కాలాంబుదాళి లలితోరసి కైటభారేః

ధారాధరే స్పురతి యా తటిదంగనేవ|

మాతు స్సమస్తజగతాం మహనీయమూర్తిః

భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః ||

తాత్పర్యం: మేఘమందు మెరుపుతీగ విలసిల్లిన చందంగా వానా కాలం మబ్బు మాదిరి నల్లని శరీరచ్చాయగల శ్రీమహావిష్ణువు వక్షస్థలంలో ఏ జగజ్జనని రూపం వెలిగిపోతోందో అ మహాలక్ష్మి మంగళస్వరూపం నాకు శుభాలను ప్రసాదించు గాక!

బాహ్వంతరే మురజితః ట్రితకౌస్తుఖేయా

హారావళీవ హరినీలమయిీ విభాతి |

కామప్రదా భగవతోపి కటాక్షమాలా

కల్యాణ మావహతు మే కమలాలయాయాః ||

తాత్పర్యం: ఏ జగజ్జనని కడగంటి చూపులు కౌస్తుభమణిని ధరించినవాడూ, ఐదుతలలుగల మురాసురుణ్ణి సంహరించిన వాడూ అయిన శ్రీమహావిష్ణువు వక్షస్థలంలో ఇంద్రనీల మణిహారాల శోభను వెలయిస్తున్నవో అట్టి ఆ నారాయణుడి కరుణాకటాక్షవీక్షణాలు నాకు మేలు చేకూర్చు గాక!

ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ష్రభావాత్‌

మాంగల్యభాజి మధుమాథిని మన్మథేన|

మయ్యాపతే త్త దిహ మంథర మీక్షణార్ధం

మందాలసం చ మకరాలయ కన్యకాయాః ||

తాత్పర్యం: శ్రీమహాలక్ష్మి కటాక్షవీక్షణ మహిమ వల్ల మధువను రాక్షసుణ్ణి నిర్మూలించిన నారాయణమూర్తి సమస్త సన్మంగళాలకూ నిలయుడైనాడు. అనురాగభరితమైన ఆ దేవేరి దృష్టి తన మీద వ్రాలడం వల్లనే కామపరవశుడై జగద్రక్షణ కార్యం ఆయన చక్కగా నిర్వర్తిస్తున్నాడు. వాడివేడిలేని ఆ దేవి తిన్నని క్రీగంటి చూపు నా మీద ప్రసరించి నన్ను కృతజ్ఞుడిని కావించు గాక!

దద్యా ద్ద్హయానుపవనో ద్రవిణాంబుధారాం

అస్మిన్న కించన విహంగశిశా విషణే|

దుష్కర్మఘర్మ మపనీయ చిరాయ దూరం

నారాయణ ప్రణయినీ సయనాంబువాహః ||

తాత్పర్యం: చాతక పక్షి పిల్ల ఎండ వేడిమికి తాళలేక తల్లడిల్లగా వాయు ప్రేరితమై మేఘం వర్షించి ఆ పక్షికూన తాపంబాపి, వాన చినుకులచే దప్పిక దీర్చి, తృప్తి కల్గించిన విధంగా శ్రీమన్నారాయణ మూర్తి ప్రియురాలైన ఇందిరాదేవి కటాక్షమనే కారుమబ్బు కారుణ్యమనే గాలిచే ప్రేరితమై బహుకాలార్జితమైన దుష్కర్మ అనే తాపాన్ని దవ్వులకు తరిమి ధనమనే వానగురిసి నేను అనే చాతక శిశువుకు సంతృప్తి కల్గించుగాక!

ఇష్టా విశిషుతయోపి యయా దయార్ద్ర

దృష్ట్వా త్రివిష్టప్ప పదం సులభం లభన్తే|

దృష్టిః ప్రహృష్ట కమలోదరదీప్తి రిష్టాం

పుష్టిం కృషీష్ట మమ పుష్మరవిష్టరాయాః ||

తాత్పర్యం: స్వర్గలోక సుఖం కలిగించే యజ్ఞయాగాదులైన శుభకర్మలు అచరించడంలో మనసులేని వారైనప్పటికిని శ్రీ మహాదేవి దృష్టి తమపై ప్రసరించగానే మానవులు అనాయాసంగా స్వర్గపదవిని పొందగల్గుతున్నారు. అట్టి పద్మ గర్భం యొక్క కాంతివంటి కాంతి గల్గిన శ్రీమహాలక్ష్మి కడగంటి చూపులు నాకు ఐశ్వర్యసమృద్ధిని సమకూర్చుగాక!

గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి

శాకంభరీతి శశిశేఖర వల్లఫేతి|

సృష్టిస్థితి ప్రళయకేళిషు సంస్థితాయా

తస్యై నమస్రిభువనైకగురో స్తరుత్యై ||

తాత్పర్యం: లోకాలను సృష్టించే వేళ బ్రహ్మభార్యభారతి అనీ, రక్షణ సమయాన నారాయణుని పత్నియైన నారాయణి అనీ, కాలస్వరూపిణియైన శాకంభరి అనీ, ప్రళభయకాల మందు శంభు రాణియైన గౌరియనీ పేరొంది, ముజ్జగంబుల నేలు మురహరుని ఇల్లాలు శ్రీ మహాలక్ష్మికి నమస్కారాలు తెల్పుతున్నాను.

శ్రుత్యై నమోస్తు శుభకర్మ ఫల ప్రసూత్యై

రత్యై నమోస్తు రమణీయ గుణార్జవాయై|

శక్ష్యై నమోస్తు శతపత్ర నికేతనాయై

పుప్వై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై ||

తాత్పర్యం: యజ్ఞయాగాది పుణ్యకర్మలన్నింటికి ప్రయోజనం సమకూర్చు వేదస్వరూపిణి అయిన శ్రీ మహాలక్ష్మికి నమస్కారం. వాత్సల్య... కారుణ్య, సౌశీల్యాది సద్దుణాలకు సముద్ర మగుచు, ఆనందు స్వరూపిణి అయినట్టి శ్రీమహాలక్ష్మికి చేతులు జోడిస్తున్నాను. తామరలం దండెడు ముద్దరాలు, శక్తి స్వరూపిణి అయిన ఇందిరా దేవికి అభివందనం. పరమపురుషుడైన శ్రీమహావిష్ణువునకు ప్రియురాలై, సర్వసమృద్ధితో నొప్పు భార్గవికి ప్రణామం.

నమోస్తు నాళీక నిభాననాయై

నమోస్తు దుర్గోదధి జన్మభూమై |

నమోస్తు సోమామృత సోదరాయై

నమోస్తు నారాయణ వల్లభాయై ||

తాత్పర్యం: శ్రీమహాలక్ష్మి పద్మంతో సమానమైన ముఖం గలది. ఆమె జన్మించిన చోటు క్షీరసముద్రం. పాలకడలి యందు జన్మించిన చంద్రునితో, అమృతంతో పాటు ఆమె కూడ జన్మించింది. కనుక ఆమె చంద్రసుధాసహోదరి. ఆమె శ్రీమన్నారాయణునకు ప్రియురాలు. అట్టి జగజ్జననికి నమస్కారం. దారిద్యమోచన స్తోత్రంలో లక్ష్మీదేవి పద్మ అని, పద్మాలయ అని, పద్మప్రియ అని, పద్మహస్త అనీ, పద్మాక్షి అని, పద్మసుందరి అని, పద్మోద్భవ అని, పద్మముఖి అని, పద్మమాలాధర అని, పద్నిని అని, పద్మగంధిని అని కీర్తించబడింది. ఆమె ముఖాదులకు పద్మంతో సామ్యం చెప్పడం వల్ల శైత్యసౌరభ్యాలకు ఆమె స్థానమని వర్ణించారు. చంద్రుని తోబుట్టువు అని చెప్పడం వల్ల ఆమె అమృతసహోదరి అని పేర్కొనడం వల్ల ఆమెనెంత సేవించినా తనివితీరదని, ఆమె పుట్టిన చోటు రత్నాకరమనడం వల్ల ఆమె ఆదిగర్భేశ్వరీత్వత్వాన్ని ప్రశంసించినట్లయింది.

నమోస్తు హేమాంబుజ పీఠికాయై

నమోస్తు భూమండల నాయికాయై |

నమోస్తు దేవాది దయాపరాయై

నమోస్తు శార్‌జ్హాయుధ వల్లభాయై||

తాత్పర్యం: బంగారు తామరగద్దెపై కూర్చుండు మహాలక్ష్మికి వందనము. భూవలయానికి నాయకురాలైన మహాదేవికి నమస్సు, దేవతలు మున్నగు సాధువర్గమునందు కారుణ్యము గల్గిన ఆ చల్లని తల్లికి స్తుతులు. శార్మను ధనుస్సును ధరించు విష్ణుదేవుని ప్రియు రాలగు శ్రీలక్ష్మికి నమస్తుతి.

నమోస్తు దేవ్యై భృగునందనాయై

నమోస్తు విష్ణోరురసి స్థితాయె|

నమోస్తు లక్ష్మి కమలాలయాయై

నమోస్తు దామోదర వల్లభాయై ||

తాత్పర్యం: భృగుమహాముని పుత్రికయు, విష్ణువు వక్షస్థలంలో నెలకొన్నదియు, పద్మాసనాసీనురాలు, యశోదా దేవి చేత రోటికి కట్టి వేయబడ్డ కేశవుని ప్రియురాలగు లక్ష్మీదేవికి వందనాలాచరిస్తున్నాను.

నమోస్తు కాంత్యై కమలేక్షణాయై

నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై|

నమోస్తు దేవాదిఖి రర్చితాయై

నమోస్తు నందాత్మజ వల్లభాయై ||

తాత్పర్యం: నళిన దళాలవంటి నయనాలు గలది, తేజస్స్వరూపిణి, లోకాలకు కన్నతల్లి, సంపత్స్వ రూపిణి, దేవతలు మొదలగు వారి చేత పూజింపబడునది, నందగోపుని పుత్రుడైన శ్రీ కృష్ణునకు ప్రియురాలు అయిన శ్రీమహాలక్ష్మికి నమోవాకాములర్చిస్తున్నాను.

సంపత్కరాణి సకలేంద్రియ నందనాని

సామ్రాజ్యదానవిభవాని సరోరుహాక్షి|

త్వద్వందనాని దురితాహరణోద్యతాని

మామేవ మాతరనిశం కలయంతు నాన్యే ||

తాత్పర్యం: పద్మపత్రాలవంటి కన్నులు గల తల్లీ! నీకు నమస్కారాలు సమస్త సంపదలను సమకూరుస్తాయి. అన్ని ఇంద్రియాలకు అనందం కల్గిస్తాయి. సామ్రాజ్య వైభవాలను అనుగ్రహిస్తాయి. పాపాలు నిశ్శేషంగా రూపుమాపుతాయి. పూజ్యురాలవైన ఓ మాతా! నీ చరణాలకు వందనాలు సమర్పిస్తున్నాను. నన్ను కృతార్జునుడిని కావించు.

యత్కటాక్ష సముపాసనావిధిః

సెవకస్య సకలార్థ సంపదః |

సంతనోతి వచనాంగమానసైః

త్వాం మురారి హృదయేశ్వరీం భజే ||

తాత్పర్యం: అమ్మా! శ్రీ మహాలక్ష్మీ! నిన్ను కొలిచేవారికి నీ కృపాకటాక్ష వీక్షణాలు సకలార్థములనూ సంప్రాప్తింపజేస్తాయి. శ్రీహరి ప్రాణ నాయికమైన తల్లీ! నిన్ను మనోవాక్కాయములనే త్రికరణాల చేత సేవిస్తున్నాను. నన్ను అనుగ్రహించు.

సరసిజనయనే సరోజహస్తే

ధవళతమాంశుక గంధమాల్య శోభ|

భగవతి హరివల్లభే మనోజ్ఞ

త్రిభువన భూతికరి ప్రసీద మహ్యమ్‌ ||

తాత్పర్యం: తామరరేకులవంటి కండ్లుగలదీ, తామరమొగ్గ చేత ధరించినదీ, మిక్కిలి తెల్లని జిలుగు కలువ కట్టినదీ, మేనగంధపు పూతతో, మెడలో పూలదండలతో విరాజిల్లునట్టిదీ, మనస్సునకు ఇంపుగొలుపు అందచందాలు గలదీ, ముజ్జగాలకు సిరిసంపదల నొసంగునట్టిదీ, జ్ఞానబలైశ్వర్య వీర్యశక్తి తేజస్సులనే ఆరు గుణాలతో వెలుగొందునదీ, శ్రీమన్నారాయణమూర్తికి జీవితేశ్వరి అయిన ఓ మహాలక్ష్మీ! నన్ను అనుగ్రహించు తల్లీ!

దిగ్ఘస్తిభిః కనకకుంభముఖావసృష్ట

స్వర్వాహినీ విమలచారుజలప్లుతాంగీమ్‌ |

ప్రాతర్నమామి జగతాం జననీ మశేష

లోకాధినాథగృహిణీ మమృతాచ్ధి పుత్రీమ్‌ ||

తాత్పర్యం: ఐరావతాది దిగ్గజాలు ఆకాశ గంగా నది జలాలను కనక కలశాలతో కొనివచ్చి తమ తొండాలతో అభిషేకించగా తడిసిన సకలావ యవములు గలదియూ, జగాలన్నింటికీ జననియూ, సమస్తలోకాలకు ప్రభువైన శ్రీమహావిష్ణువు ఇల్లాలును, క్షీరసాగరపుత్రియూ అయిన శ్రీమహాలక్ష్మిని ఉ దయాన్నే నమస్కరిస్తున్నాను.

కమలే కమలాక్షవల్లభే త్వం

కరుణాపూర తరంగితై రపాంగైః|

అవలోకయ మా మకించనానాం

ప్రథమం పాత్ర మకృత్రిమం దయాయాః ||

తాత్పర్యం: పద్మపత్రాలవంటి నేత్రాలుగల శ్రీమన్నారాయణమూర్తికి ప్రియురాలవైన ఓ కమలాంబికా! నా మనవి ఆలకించు. నేను దరిద్రులలో అగ్రేసరుణ్ణి. నీ కృపకు అన్ని విధాలా ఇవ్వు. ఇట్టినన్ను దయారసం తొణికిసలాడే నీ కడగంటి చూపులతో నన్ను కనుగొని ధన్యుణ్ణి గావించు.

స్తువంతి యే స్తుతిఖి రమూఖి రన్వహం

త్రయీమయీం త్రిభువనమాతరం రమామ్‌|

గుణాధికా గురుతరభాగ్య భాజినో

భవంతి తే భువి బుధభావితాశయాః ||

తాత్పర్యం: ఎవ్వరు ప్రతిదినం వేదస్వరూపిణి, యజ్ఞయాగాలకు తల్లి అయిన లక్ష్మీదేవిని ఈ స్తోత్రంతో స్తుతిస్తున్నారో వారు అధిక సద్గుణ సంపన్నులు, పరమ భాగ్యోపేతులు అయి ఈ పుడమిలో పండితుల ప్రశంసలకు పాత్రులౌతున్నారు.

సువర్జధారాస్తోత్రం యచ్చంకరాచార్య నిర్మితమ్‌

త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స కుబేర సమో భవేత్‌ ||

తాత్పర్యం: ఎవరు శంకరభగవత్సాదాచార్యులచే రచించబడ్డ ఈ కనకధారా స్తోత్రాన్ని ఉదయ మధ్యాహ్నసాయం కాలాలందు చదువుతారో వారు నవనిధులకు నాయకుడైన కుబేరుడితో సమానులు కాగలరు.

గద్యం

ఇతి శ్రీమత్చరమహంస పరివ్రాజకాచార్య వర్యస్య

శ్రీమచ్చంకర భగవతః కృతిషు కనకధారాస్తోత్రం సంపూర్ణమ్‌.

సంపద్యుక్తుడు, పరమహంస పరివ్రాజకాచార్యవర్యుడగు శ్రీ శంకరభగవత్సాదుల రచనలందలి ఈ కనకధారాస్తోత్రం ముగిసింది.

విల్వాటవీ మధ్యలసత్సరోజే

సహస్రపత్రే సుఖసన్నివిష్టామ్‌|

అష్టాపదాంభోరుహ పాణిపద్మాం

సువర్ణవర్దాం ప్రణమామి లక్ష్మీమ్‌||

తాత్పర్యం: బిల్వవనం నడుమ సహస్రదళ శోభితమైన పద్మంలో హాయిగ కూర్చుండి యున్నదియూ, కనక కమలం పద్మం వంటి తనచేత ధరించినదియీ, పసిడివంటి దేహకాంతిగలది అగు రమాదేవికి నమస్కరిస్తున్నాను.

కమలాసన పాణినా లలాటే

లిఖితా మక్షరపంక్తి మస్య జంతోషి

పరిమార్దయ మాత రంఘిణా తే

ధనిక ద్వార నివాస దుఃఖ దోగ్రీమ్‌.

తాత్పర్యం: అమ్మా! ధనవంతుల వాకిళ్ల ముందు నిలబడి యాచిస్తూ వారిచ్చే డబ్బుతో బ్రతుకుమని ఈ ప్రాణి నాసట బ్రహ్మదేవుడు వ్రాసిన వ్రాతను నీ కాలితో తుడిచి ధన్యుణ్ణి చేయుము.

అంభోరుహం జన్మగ్భహం భవత్యా

వక్షస్థలం భరృృగృహం మురారేః|

కారుణ్యతః కల్చ్పయ పద్మ

వాసే లీలాగ్భహం మే హృదయారవిందమ్‌||

తాత్పర్యం: అమ్మా! నీ పుట్టిల్లు పద్మం. మెట్టినిల్లు శ్రీమన్నారాయణుని వక్షప్రదేశం. అ విధంగానే కనికరంతో నా హృదయపద్నాన్ని నీవు క్రీడాగృహంగా చేసుకో తల్లీ!

ఆధ్యాత్మిక వేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
ఆధ్యాత్మిక వేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ