Shani dosha nivarana tree: ఈ ఒక్క చెట్టు మీ ఇంట్లో ఉంటే అన్ని దోషాలు తొలగిపోతాయ్
08 February 2024, 8:01 IST
- Shani dosha nivaran tree: హిందువులు ఎంతో పవిత్రంగా భావించే చెట్లలో రావి, వేప చెట్టు ఉంటాయి. వేప చెట్టు ఇంట్లో ఉండటం వల్ల శని, కుజ దోషాల నుంచి విముక్తి పొందవచ్చు. ఈ ఒక్క చెట్టు అనేక ప్రయోజనాలు ఇస్తుంది.
దోషాలు తొలగించే వేప చెట్టు
Shani dosha nivaran tree: మనిషి జీవనంలో చెట్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. అవి లేవంటే ఏ జీవి కూడా క్షణం కూడా బతకలేదు. మనం పీల్చే ఆక్సిజన్ చెట్ల నుంచే వస్తుంది. అందుకే పర్యావరణాన్ని కాపాడుకోవాలి. చెట్లు నరికివేయడం వల్ల నష్టాలు ఉన్నాయని పర్యావరణ వేత్తలు చెబుతారు. ఆరోగ్యపరంగా మాత్రమే కాదు సంప్రదాయ ప్రకారం కూడా మనం చెట్లని గౌరవిస్తాం.
లేటెస్ట్ ఫోటోలు
ఏదో ఒక చెట్టుకి నిత్యం పూజలు చేస్తూనే ఉంటారు. హిందువులు రావి చెట్టుకి పూజలు చేస్తూ ఉంటారు. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయని అంటారు. అది మాత్రమే కాదు హిందువులకు వేప చెట్టు కూడా పూజిస్తారు. మన సంప్రదాయంలో వేప చెట్టుకి గౌరవప్రదమైన స్థానం ఉంది. దీనిలోని ప్రతి అణువు ఔషధ గుణాలు కలిగి ఉండి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అయితే ఇది ఆరోగ్యాన్ని మాత్రమే కాదు దోషాలని కూడా తొలగిస్తుంది. రావి చెట్టు విష్ణు స్వరూపంగా భావిస్తే వేప చెట్టుని లక్ష్మీదేవిగా భావించి పూజలు చేస్తారు.
దోషాలు తొలగించే వేప చెట్టు
చాలా మందికి జాతకంలో ఏదో ఒక దోషం ఉంటూ ఉంటుంది. దోష ప్రభావాల కారణంగా ఏవైనా పనులు మొదలుపెడితే అవి అర్థాంతరంగా ఆగిపోవడం లేదంటే ఆటంకాలు ఎదురుకావడం జరుగుతుంది. ముఖ్యంగా పితృ దోషం ఉంటే పనులు ముందుకు సాగవు. శని దోషం ఉంటే ఇక కష్టాల కడలి ఈదుతున్నట్టే ఉంటుంది. కుజ దోషం ఉంటే మాత్రం అమ్మాయిలు లేదా అబ్బాయిలకు ఒక పట్టాన పెళ్లి కాదు. వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. కుజ దోషం ఉన్న అమ్మాయిని చేసుకునేందుకు ఎవరూ ముందుకు రారు. ఇలా జాతకంలోని కొన్ని దోషాల నుంచి విముక్తి పొందటం కోసం వేప చెట్టు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
వేప చెట్టు ఇంట్లో ఉంటే సదరు వ్యక్తి జాతకంలో ఉండే శని, కుజుడు దోషాల నుంచి విముక్తి కలిగిస్తుంది. శని దోషం నుంచి ఉపశమనం పొందటం కోసం ఎక్కువ మంది శమీ చెట్టుని పూజిస్తారు. అది మాత్రమే కాదు వేప చెట్టుని పూజించినా కూడా శని బాధలు తొలగిపోతాయి. ఇంట్లో వేప చెట్టు నాటడం వల్ల శని దోషం నుంచి బయట పడతారు. జాతకంలో ఉన్న అనేక దోషాలని వేప చెట్టు తొలగించేస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. వేప చెట్టు ఉండటం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. నెగటివ్ ఎనర్జీ సమస్య ఉండదు. ఆరోగ్యంగా ఉంటారు. శని దోషం ఉన్న వాళ్ళు వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శుభ ఫలితాలు పొందుతారు.
ఇంటికి దక్షిణ దిశ లేదా వాయువ్య దిశలో వేప మొక్క నాటడం వల్ల పితృ దోషాలు తొలగిపోతాయి. పూర్వీకుల ఆశీర్వాదాలు కుటుంబం మీద ఉండి సంతోషంగా ఉంటారు. శని తర్వాత అందరూ చూసి భయపడేది రాహు, కేతు గ్రహాలే. కేతువు అనుగ్రహం కోసం కూడా వేప చెట్టు ఉపయోగపడుతుంది. వేప ఆకుల నుంచి తీసిన రసాన్ని నీటిలో కలుపుకుని స్నానం చేస్తే కేతువు బాధల నుంచి బయట పడొచ్చు.