తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Wrong National Anthem?: జనగణమన బదులుగా నేపాల్ జాతీయ గీతం; రాహుల్ సభలో పొరపాటు

Wrong National Anthem?: జనగణమన బదులుగా నేపాల్ జాతీయ గీతం; రాహుల్ సభలో పొరపాటు

HT Telugu Desk HT Telugu

17 November 2022, 23:15 IST

  • భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ పాల్గొన్న సభలో చిన్న పొరపాటు చోటు చేసుకుంది. 

వేదికపై రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు
వేదికపై రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు

వేదికపై రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన దేశవ్యాప్త పాదయాత్ర ‘భారత్ జోడో యాత్ర’ ప్రస్తుతం మహారాష్ట్రలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా వాషిమ్ జిల్లాలో ఒక సభను ఏర్పాటు చేశారు.

జనగణమన బదులుగా..

సభ లో ప్రసంగించిన అనంతరం ఇప్పుడు జాతీయ గీతం వస్తుందని రాహుల్ గాంధీ ప్రకటించగానే, అంతా గౌరవ సూచకంగా లేచి నిల్చున్నారు. అయితే, అనుకోని విధంగా మైక్ లో నుంచి భారత జాతీయ గీతమైన జనగణమన కాకుండా మరేదో పాట రావడం ప్రారంభమైంది. దాంతో, విస్తుపోయిన రాహుల్ గాంధీ.. వేదికపై ఉన్న కాంగ్రెస్ నేతల వైపు ఏంటిది? అంటూ చూశారు. దాంతో, హుటాహుటిన కాంగ్రెస్ నేతలు ఆ పాటను నిలిపేశారు. అనంతరం జనగణ మన రావడం ప్రారంభమైంది. అయితే, ఇప్పుడు కూడా నిర్ధారిత రెండు స్టాంజాలు కాకుండా, మూడో స్టాంజా కూడా మైక్ లోనుంచి రావడం ప్రారంభమైంది. అయితే, రెండో స్టాంజా పూర్త కాగానే నేతలు, కార్యకర్తలు, జై హింద్, జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు. అనంతరం, మైక్ ను నిలిపేశారు.

బీజేపీ విమర్శలు

భారత్ జోడో యాత్రలో భారత జాతీయ గీతం బదులుగా మరో గీతం ప్రసారం అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాంగ్రెస్ నేతలకు జాతీయ గీతమేదో కూడ తెలియదా? అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ఇదే అదనుగా తీసుకున్న బీజేపీ కాంగ్రెస్ పై, రాహుల్ గాంధీపై వ్యంగ్యాస్త్రాలు విసరడం ప్రారంభించింది. ‘మిస్టర్ రాహుల్ గాంధీ.. వాటీజ్ దిస్’ అంటూ ఒక బీజేపీ నేత, ‘పప్పు కా కామెడీ సర్కస్’ అంటూ మరో నేత ఈ వీడియోను ట్విటర్ లో షేర్ చేస్తూ కామెంట్లు చేశారు. ఇది పొరపాటున జరిగిన తప్పిదంగా కాంగ్రెస్ ప్రకటించింది. అయితే, పొరపాటున ప్రసారమైన ఆ గేయం నేపాలీ జాతీయ గీతమని ఆ తరువాత తేలింది.

మహారాష్ట్రలో యాత్ర

తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మహారాష్ట్రలో కొనసాగుతోంది. ఇప్పటివరకు ఈ యాత్ర తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో జరిగింది. మహారాష్ట్రలో 5 జిల్లాల్లో ఈ యాత్ర సాగుతుంది. ప్రస్తుతం అకోలా జిల్లాలో కొనసాగుతోంది.