Modi 3.0 cabinet: మోదీ 3.0 కేబినెట్ లో టీడీపీ నుంచి నలుగురికి, జేడీయూ నుంచి ఇద్దరికి అవకాశం!
08 June 2024, 20:43 IST
Modi 3.0 cabinet: జూన్ 9, ఆదివారం మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నరేంద్రమోదీ టీమ్ లో తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు, జేడీయూ నుంచి ఇద్దరు మంత్రులకు అవకాశం లభించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తొలిసారి సంకీర్ణ ప్రభుత్వం నడుపుతున్న మోదీకి కేబినెట్ కూర్పు తొలి సవాలు కానుంది.
మోదీ 3.0 కేబినెట్ లో టీడీపీకి నాలుగు బెర్త్ లు!
Modi 3.0 cabinet: నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధాని పీఠం అధిష్టించేందుకు రంగం సిద్ధమైంది. ఆదివారం ఆయన ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2014లో తొలిసారి ప్రధాని పదవి చేపట్టిన మోదీ.. ఇప్పుడు తొలిసారి అసలైన సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపనున్నారు. ఈ సంకీర్ణ ప్రభుత్వంలో కేబినెట్ కూర్పు ప్రధాని మోదీకి మొట్ట మొదటి సవాలు కానుంది.
టీడీపీకి నాలుగు..
మెజారిటీ కి ముప్పై రెండు సీట్ల దూరంలో నిలిచిన బీజేపీకి ఎన్డీయేలోని టీడీపీ, జేడీయూల మద్దతు కీలకంగా మారింది. ఈరెండు పార్టీలకు 28 మంది ఎంపీలు ఉన్నారు. ఈ నేపథ్యంలో, ఈ రెండు పార్టీలకు కేబినెట్లో సముచిత స్థానం లభించడం ఖాయమే. అయితే, ఏ పార్టీకి ఎన్ని కేబినెట్ బెర్త్ లు లభిస్తాయన్నది ఉత్కంఠగా మారింది. అయితే, విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ నుంచి నలుగురికి, నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ నుంచి ఇద్దరికి కేబినెట్ మంత్రులుగా అవకాశం లభించనుంది.
రామ్మోహన్ నాయుడుకు పక్కా..
టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, హరీశ్ బాలయోగి, దగ్గుమల్ల ప్రసాద్ కు మోదీ 3.0 కేబినెట్లో అవకాశం లభిస్తుందని తెలుస్తోంది. ఈ ముగ్గురికి కీలక శాఖలు కూడా లభించే అవకాశం ఉంది. మరోవైపు, జేడీయూ కి లభించే రెండు కేబినెట్ బెర్త్ ల్లో సీనియర్ నాయకులైన లలన్ సింగ్, రామ్ నాథ్ ఠాకూర్ లకు అవకాశం లభించనుంది. వీరిలో రామ్ నాథ్ ఠాకూర్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఈయన ఈ సంవత్సరం భారత రత్న లభించిన బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్ కుమారుడు. టీడీపీ, జేడీయూలకు కేబినెట్ స్థానాలు ఖరారైనప్పటికీ, మంత్రిత్వ శాఖల విషయంలో కొంత అనిశ్చితి నెలకొని ఉన్నట్లు తెలుస్తోంది.
స్పీకర్ పదవి కూడా అడిగిన టీడీపీ
ఆంధ్రప్రదేశ్‌లో 16 లోక్‌సభ స్థానాలను గెలుచుకున్న తర్వాత టీడీపీ నాలుగు మంత్రిత్వ శాఖలను, లోక్ సభ స్పీకర్ పదవిని కోరింది. గతంలో వాజ్ పేయి సర్కారులో టీడీపీ ఎంపీ స్పీకర్ గా ఉన్న విషయం తెలిసిందే. 12 సీట్లు గెలుచుకున్న జేడీయూ రెండు కేబినెట్ బెర్త్‌లను అడిగింది.