Showtime Vs IPac: ఏపీ పొలిటికల్ స్ట్రాటజీలో రాబిన్ శర్మ షో సక్సెస్ అయినట్టే, టీడీపీ భారీ విజయంలో కీలక పాత్ర
Showtime Vs IPac: హంగామా హడావుడి లేకుండా ప్రత్యర్థుల మాదిరి ప్రచారం చేయకుండా, అంచనాలకు అందని విధంగా ఏపీలో టీడీపీ ఘన విజయం సాధించడంలో షో టైమ్ స్ట్రాటజీ సక్సెస్ అయ్యింది.
Showtime Vs IPac: ఏపీ రాజకీయాల్లో గెలుపొటములు గత పదేళ్లుగా పొలిటికల్ కన్సల్టెన్సీల కేంద్రంగానే సాగుతున్నాయి. 2019లో జగన్ భారీ విజయం సాధించడం వెనుక ఐపాక్ కీలకంగా పనిచేస్తే ఈసారి టీడీపీ కూటమి విజయం వెనుక షో టైమ్ స్ట్రాటజీ పని చేసింది. హడావుడి లేకుండా తమ పని తాము చేసుకుంటూ పోయిన షో టైమ్ టీడీపీ విజయంలో కీలక పాత్ర పోషించింది.
కొన్నేళ్ల క్రితం టీడీపీకి వ్యూహ రచన చేసే విషయంలో సునీల్ కనుగోలు బృందానికి, షో టైమ్ బృందానికి మధ్య పోటీ ఏర్పడిందనే వార్తలు కూడా వచ్చాయి. కర్ణాటక ఎన్నికలకు ముందే టీడీపీ తరపున ఎవరు పనిచేయాలనే విషయంలో ప్రధాన కన్సల్టెన్సీల మధ్య పోటీ ఏర్పడటంతో చివరకు సునీల్ కనుగోలు ఏపీ వ్యవహారాల నుంచి తప్పుకున్నారనే ప్రచారం జరిగింది.
పొలిటికల్ స్ట్రాటజిస్టుల పనితీరు మీద రకరకాల ప్రచారాలు ఉన్నా ఏపీలో టీడీపీ తరపున పనిచేసిన షో టైమ్ నిశబ్దంగా పనిచేసుకుంటూ పోయింది. చివరకు టీడీపీ భారీ విజయాన్ని కట్టబెట్టింది.
ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ తరపున రెండున్నరేళ్లకు పైగా ఐ పాక్ పనిచేస్తోంది. 2019 ఎన్నికలకు ముందు కూడా ఆ సంస్థ వైసీపీ కోసం పనిచేసింది. తాజా ఎన్నికల్లో గెలుపుపై భారీ అంచనాలతో కనీవిని ఎరుగని స్థాయిలో వైసీపీ ప్రచారం సాగింది. సిద్ధం పేరుతో లక్షలాది మంది ప్రజలతో భారీ ఈవెంట్లను నిర్వహించారు. జగన్ సభలకు పోటెత్తిన జనాన్ని చూసి ఎన్నికల్లో గెలుపు తమదే అని వైసీపీ కూడా గట్టిగా నమ్మింది. జగన్ సభలకు తరలి వచ్చిన జనమంతా ఎవరికి ఓట్లు వేశారనే సందేహాలు ఫలితాల తర్వాత తలెత్తాయి.
ప్రభుత్వ వ్యతిరేకతపైనే దృష్టి…
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో షో టైమ్ సక్సెస్ సాధించడం వెనుక ప్రభుత్వ వైఫల్యాలను ప్రచారం చేయడంపైనే ప్రధానంగా ఫోకస్ చేసింది. అధికార పార్టీ ప్రచారం మొత్తం ముఖ్యమంత్రి కేంద్రంగానే సాగితే టీడీపీ తరపున ప్రభుత్వ వైఫల్యాలకు విస్తృతంగా ప్రచారం కల్పించారు. గత ఐదేళ్లలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు, సమస్యలపైనే టీడీపీ ప్రచారం కేంద్రీకరించింది. అదే సమయంలో ఐపాక్ నిర్వహించిన ప్రచారాలు మొత్తం జగన్ చుట్టూ కేంద్రీకృతం కావడం తమకు కలిసొచ్చిందని షో టైమ్ భావిస్తోంది. ఎన్నికల ఫలితాలు సైతం తమ అంచనాలకు తగ్గట్టుగానే వచ్చాయి.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ కేవలం 23సీట్లకు పరిమితం అయ్యింది. 175 అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీకి 23 సీట్లు మాత్రమే లభించాయి. సరిగ్గా ఐదేళ్లలో ఆ పార్టీ 135 సీట్లను కైవసం చేసుకుంది. చంద్రబాబు తరపున పొలిటికల్ స్ట్రాటజీ బృందానికి రాబిన్ శర్మ నేతృత్వం వహించారు. గతంలో ప్రశాంత్ కిషోర్ బృందంలో ఒకరైన రాబిన్ టీడీపీకి నాలుగేళ్లకు పైగా పనిచేస్తున్నారు.
అటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తరపున పనిచేసిన ఐపాక్ సంస్థ కూడా ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్‌లో ఏర్పాటైనదే. ప్రస్తుతం దానికి సారథ్యం వహిస్తున్న రిషిరాజ్, రాబిన్ శర్మలు ఒకప్పుడు పీకే టీమ్‌లో కలిసి పనిచేశారు. ఒకప్పటి సహచరులైన రాబిన్,రిషిరాజ్ మధ్య ఐదేళ్లుగా హోరాహోరీ యుద్ధం సాగింది. బయటకు కనిపించకపోయినా తాము పనిచేస్తున్న పార్టీల గెలుపు కోసం తీవ్ర స్థాయిలో యుద్ధమే జరిగింది.
రాబిన్ శర్మ నేతృత్వంలోని షోటైమ్ కన్సల్టింగ్ (STC ) చంద్రబాబు నాయుడికి మార్గ నిర్దేశం చేయగా, రిషి రాజ్ నేతృత్వంలోని ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (I-PAC) వైఎస్సార్సీపీ కోసం పని చేసింది.
2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో పరాజయాన్ని మూటగట్టుకున్న టీడీపీకి పునర్వైభవాన్ని కల్పించే పనిని రాబిన్ చేపట్టినప్పుడు ఏ మాత్రం అంచనాలు లేవు. ఐపాక్ హంగామా చేస్తోంటే షోటైమ్ షో పనిచేయడం లేదనే విమర్శలు కూడా వచ్చాయి. ఎన్నికల్లో వచ్చిన అనూహ్య ఫలితాలతో రాబిన్ మ్యాజిక్ పనిచేసిందని కన్సల్టెంట్ల మధ్య చర్చ జరుగుతోంది.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత విజయవాడలో ఐపాక్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సందర్శించారు. మరోసారి తాము అధికారంలోకి వస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు సహజంగానే టీడీపీ శ్రేణుల్లో కొంత అలజడి సృష్టించాయి. అప్పుడు కూడా టీడీపీ, షోటైమ్ మౌనంగానే ఉండిపోయాయి.
2019 కంటే ఎక్కువ ఆధిక్యతతో వైఎస్సార్సీపీ గెలుస్తుందని జగన్ ప్రకటించినా టీడీపీ శిబిరం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. 2019లో వైఎస్సార్సీపీ 151 అసెంబ్లీ స్థానాలతో పాటు 22 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. కౌంటింగ్ రోజు దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుందని జగన్ చెప్పారు. నిజంగా అలాంటి ఫలితాలే ఏపీలో వెలువడ్డాయి.
జూన్ 4న రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో కనీసం ఎనిమిదింటిలో వైఎస్సార్‌సీపీకి కనీసం ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఏపీలో ఎన్నికల పోల్ మేనేజ్‌మెంట్ డ్రామా నడుస్తుండగానే ప్రశాంత్ కిషోర్ ఈ ఏడాది ఆరంభంలో చంద్రబాబు నాయుడుని కలవడం రాష్ట్రంలో అలజడి సృష్టించారు. చంద్రబాబు కోసం పనిచేయడం లేదని స్పష్టత ఇచ్చినా టీడీపీ ప్రచారంలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవడానికి పీకే సలహాలు ఇచ్చినట్టు సమాచారం.
ఎవరీ రిషిరాజ్, రాబిన్ శర్మ?
ఐపాక్‌కు సారథ్యం వహిస్తున్న రిషిరాజ్, షో టైమ్ కన్సల్టింగ్ రాబిన్ శర్మలు మొదట సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ (CAG)లో కలిసి పనిచేశారు. ఈ సంస్థ 2014 లోక్‌సభ ఎన్నికలలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీని అధికారంలోకి తీసుకు రావడంలో సహాయపడింది.
2014 ఎన్నికలకు ముందే ప్రశాంత్ కిషోర్ మరికొందరు కలిసి CAG సంస్థను స్థాపించారు. 2015లో రాబిన్ శర్మ, రిషిలు ఇద్దరూ ప్రశాంత్ కిషోర్‌తో కలిసి I-PAC వ్యవస్థాపక సభ్యులుగా మారారు.
రాబిన్ శర్మ యూపీలో ప్రాచుర్యం పొందిన "చాయ్ పే చర్చా" కార్యక్రమాన్ని నిర్వహించారు. 2015లో CAGని రద్దు చేసిన తర్వాత, రాబిన్ I-PAC వ్యవస్థాపక సభ్యునిగా చేరడంతో పాటు బీహార్‌లో నితీష్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని నడిపించారు.
నితీష్ కుమార్ 2015లో నిర్వహించిన సైకిల్ ప్రచారానికి రాబిన్ బృందం పని చేసింది. ఆ తరువాత రాబిన్ తన సొంత పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ షోటైమ్ కన్సల్టింగ్ (STC)ని ప్రారంభించాడు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ సొంతంగానే వ్యూహ రచన చేసుకునేది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో TDP ఓటమి తర్వాత చంద్రబాబు నాయుడు తమ పార్టీ కోసం రాబిన్ శర్మ సంస్థను నియమించుకున్నారు.
రాబిన్ బృందం 2022లో పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ కోసం కూడా పనిచేసింది. రికార్డు సంఖ్యలో అసెంబ్లీ స్థానాలతో, పంజాబ్‌లో అధికారాన్ని ఆ పార్టీ కైవసం చేసుకుంది. ఏపీలో టీడీపీ తరపున పనిచేయడం ప్రారంభించిన తర్వాత ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేకతపైనే షో టైమ్ దృష్టి మొత్తం పెట్టింది. రాబిన్ సహ వ్యవస్థాపకుడిగా ఉన్న ఐపాక్ సంస్థను ప్రత్యర్థిగా భావించకుండా వైసీపీని పోటీగా భావించి ప్రచారం చేపట్టింది.ప్రత్యర్థుల ప్రచార శైలి సాగుతున్న తీరుకు పూర్తి భిన్నమైన వైఖరిని అనుసరించారు.
ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను స్థిరంగా కొనసాగించడంపైనే దృష్టి పెట్టినట్టు షో టైమ్ ప్రతినిధులు తెలిపారు. . టీడీపీ చేపట్టిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’, ‘బాదుడు బాదుడు’ ‘ప్రజా గళం’, ‘సూపర్ సిక్స్’, యువగళం వంటి ప్రచార కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమాల ద్వారా టీడీపీకి ప్రచారం చేయడం కంటే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో కొనసాగించడమే లక్ష్యంగా ఆ సంస్థ పెట్టుకుంది. ఇవన్నీ ఫలితాన్నిచ్చాయి.
175 సీట్ల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో దాదాపు 94శాతం స్థానాలతో భారీగా విజయాన్ని టీడీపీ దక్కించుకుంది. దేశంలో ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పార్టీ ఇంత పెద్ద విజయం దక్కడం ఇదే మొదటిసారి. టీడీపీకి సొంతంగా 135 సీట్లు, జనసేనకు 21 స్థానాలు లభించాయి. 164 స్థానాలతో ప్రభుత్వం ఏర్పాటు కావడం దేశంలోని రాష్టాలన్నింటిలో ఇది తొలిసారి అని షో టైమ్ భావిస్తోంది.