Fact check: ఎన్నికల్లో గెలిపించినందుకు మోదీ, బీజేపీ ఉచితంగా 3 నెలల మొబైల్ రీచార్జ్ ఇస్తున్నారన్న మెస్సేజ్ లను నమ్మకండి..-viral posts claim bjp modi are offering free recharge after results know truth ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Fact Check: ఎన్నికల్లో గెలిపించినందుకు మోదీ, బీజేపీ ఉచితంగా 3 నెలల మొబైల్ రీచార్జ్ ఇస్తున్నారన్న మెస్సేజ్ లను నమ్మకండి..

Fact check: ఎన్నికల్లో గెలిపించినందుకు మోదీ, బీజేపీ ఉచితంగా 3 నెలల మొబైల్ రీచార్జ్ ఇస్తున్నారన్న మెస్సేజ్ లను నమ్మకండి..

HT Telugu Desk HT Telugu
Jun 07, 2024 02:46 PM IST

ప్రజలను మోసం చేయడానికి ఏ అవకాశాన్ని కూడా సైబర్ క్రిమినల్స్ వదులుకోవడం లేదు. లోక్ సభ ఎన్నికల్లో గెలిపించినందుకు మోదీ, బీజేపీ భారతీయులందరికీ ఉచితంగా రూ. 599 విలువైన 3 నెలల మొబైల్ రీచార్జ్ ను అందిస్తున్నారన్న మెసేజ్ లు ఇప్పడు వైరల్ గా మారాయి. వాటిని నమ్మి, ఆ లింక్స్ పై క్లిక్ చేయకండి.. నష్టపోతారు.

ఫ్రీ రీచార్జ్ మెసేజ్ లను నమ్మకండి
ఫ్రీ రీచార్జ్ మెసేజ్ లను నమ్మకండి

Fact check: 2024 ఎన్నికల్లో విజయం సాధించినందుకు, మోడీ మూడోసారి ప్రధాని అయినందుకు బహుమతిగా ప్రధాని మోదీ, బీజేపీ ప్రతి భారతీయుడికి మూడు నెలల పాటు ఉచిత మొబైల్ రీఛార్జ్ ఆఫర్ చేస్తున్నాయని పేర్కొంటూ చాలా మందికి మెసేజెస్ వస్తున్నాయి. వాటిలో గుర్తుతెలియని వెబ్సైట్ల లింక్స్ ఉంటున్నాయి. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ లు విస్తృతంగా షేర్ అవుతున్నాయి. అలాంటి మెసేజెస్ ను నమ్మి, ఆ లింక్ లను ఓపెన్ చేయవద్దని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరొ సూచిస్తోంది.

ఉచిత రీచార్జ్ ఆఫర్ అవాస్తవం

వైరల్ మెసేజ్: ‘మూడోసారి విజయవంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న సందర్భంగా బీజేపీ, ప్రధాని మోదీ భారతీయులందరికీ మూడు నెలల పాటు ఉచితంగా రూ. 599 విలువైన మొబైల్ రీఛార్జ్ ను ఆఫర్ చేస్తున్నారు’ అన్న మెసేజెస్ విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వాస్తవం: ఈ వైరల్ పోస్టులు ఫేక్. మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న సందర్భంగా బీజేపీ కానీ, ప్రధాని మోదీ కానీ ఉచిత రీఛార్జ్ ఆఫర్ చేయడం లేదు. పోస్టుల్లో ఇచ్చిన లింకులు నేరుగా అనుమానాస్పద వెబ్ సైట్లకు చేరుతాయి. ఇలాంటి ఫేక్ మెసేజ్ లు, వెబ్సైట్ల ద్వారా సైబర్ నేరగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు అనేక వార్తలు వస్తున్నాయి. చమోలి పోలీసులు (ఉత్తరాఖండ్) తమ ఫేస్బుక్ పోస్ట్ లో ఈ పోస్ట్ ఫేక్ అని స్పష్టం చేశారు. ఇలాంటి తెలియని లింక్ లను తెరవవద్దని ప్రజలకు సూచించారు. అందువల్ల, అలాంటి మెసేజెస్ ఏవైనా మీకు వస్తే, వాటిలోని లింక్ పై క్లిక్ చేయకండి (Fact check).

సైబర్ నేరగాళ్ల అతి తెలివి

మూడు నెల ఫ్రీ రీ చార్జ్ అంటూ వచ్చిన మెసేజ్ లోని యూఆర్ఎల్ లింక్ ను క్లిక్ చేస్తే ప్రధాని మోదీ ర్యాలీ ఫోటో ఉన్న వెబ్ పేజీ కనిపించింది. ఈ వెబ్ పేజీ లో ఆఫర్ ప్రయోజనాలను పొందడానికి 'చెక్ నౌ' బటన్ పై క్లిక్ చేయమని వినియోగదారులను ప్రేరేపిస్తుంది. బటన్ క్లిక్ చేసిన తర్వాత యూజర్లను తమ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతారు. అయితే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వెబ్ పేజీ మరే ఇతర పేజీకి దారితీయదు. ప్రధాని మోదీ కానీ, బీజేపీ కానీ అలాంటి పథకాన్ని ప్రకటించలేదు.

గతంలో కూడా

గతంలో కూడా ప్రధాని మోదీ ఉచిత రీఛార్జ్ పథకాలను పేర్కొంటూ ఇలాంటి పోస్టులు వైరల్ అయినప్పుడు, అటువంటి పథకాన్ని అమలు చేయడం లేదని పీఐబీ స్పష్టం చేసింది. ఇలాంటి అనుమానాస్పద వెబ్సైట్లలో మొబైల్ నంబర్ ను నమోదు చేయడం వల్ల స్పామ్ కాల్స్, మెసేజ్ లు, ఫిషింగ్ లింక్స్ కూడా వస్తాయి. కాబట్టి ఈ తరహా లింకులు, వెబ్ సైట్లు ఓపెన్ చేయకుండా జాగ్రత్త పడాలి. తెలియని లేదా అనుమానాస్పద లింక్ లను క్లిక్ చేయవద్దని నిపుణులు గట్టిగా సలహా ఇస్తున్నారు. ఎందుకంటే అలా చేయడం వల్ల వినియోగదారు స్మార్ట్ ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా మీ సెన్సిటివ్ డేటాను, మీ యూపీఐ యాప్స్ హ్యాక్ అయితే, మీ బ్యాంక్ ఖాతాల్లోని డబ్బును కోల్పోతారు.

Whats_app_banner