Phone hack: మీ స్మార్ట్ ఫోన్ హ్యాక్ అయిందో లేదో.. ఇలా తెలుసుకోండి..
Phone hack: నేటి డిజిటల్ యుగంలో, మన స్మార్ట్ ఫోన్ లు కేవలం కమ్యూనికేషన్ పరికరాలు మాత్రమే కాదు. అందులో మన సమస్త వ్యక్తిగత సమాచారం ఉంటుంది. ఒకవేళ, మీ ఫోన్ హ్యాకర్ల బారిన పడితే ఏమవుతుంది?.. వ్యక్తిగత సమాచారంతో పాటు బ్యాంక్ ల్లోని మీ డబ్బు కూడా మాయమవుతుంది.
Smart phone tips: స్మార్ట్ ఫోన్ ఇప్పుడు నిత్యావసరం. స్మార్ట్ ఫోనే మన బ్యాంక్, స్మార్ట్ ఫోనే మన డాక్యుమెంట్ లాకర్, స్మార్ట్ ఫోనే మన డైరీ, స్మార్ట్ ఫోనే మన ఫొటో అల్బమ్, స్మార్ట్ ఫోనే మనకు ఎవ్రీ థింగ్.. అందువల్ల స్మార్ట్ ఫోన్ హ్యాక్ కాకుండా చూసుకోవడం చాలా అవసరం. మీ స్మార్ట్ ఫోన్ హ్యాక్ అయిందో? లేదో మీ స్మార్ట్ ఫోనే కొన్ని సంకేతాల ద్వారా చెబుతుంది. అవేంటంటే..
మీ బ్యాటరీ సాధారణం కంటే వేగంగా ఖాళీ అవుతుందా?
మీ ఫోన్ బ్యాటరీ సాధారణం కంటే వేగంగా డ్రెయిన్ అవుతోందా? ఛార్జ్ చేసిన కొద్ది సేపట్లోనే మళ్లీ జీరోలోకి వెళ్తోందా? అయితే, ఆందోళన చెందాల్సిందే. మీ ఫోన్ హ్యాక్ కు గురై ఉండవచ్చు. మీ ఫోన్ లోకి స్పైవేర్ లేదా మాల్వేర్ను చేరి ఉండవచ్చు. అది బ్యాక్ గ్రౌండ్ లో నడిపిస్తున్న రహస్య ప్రక్రియలు మీకు తెలియకుండానే మీ బ్యాటరీ శక్తిని దెబ్బతీస్తాయి.
డేటా వినియోగం ఎక్కువయిందా?
మీ ఫోన్ లో డేటా వినియోగమయ్యే తీరుపై ఓ కన్నేసి ఉంచండి. మీరు ఉపయోగించకపోయినా.. మీ ఫోన్ లో డేటా ఖర్చు అవుతోందా? మీ ఫోన్ లో దాగి ఉన్న హానికరమైన సాఫ్ట్ వేర్ ఆ డేటాను అధికంగా వినియోగిస్తుండవచ్చు. డేటా వినియోగంలో ఊహించని పెరుగుదలను మీరు గమనిస్తే, వెంటనే అప్రమత్తం కావాల్సిందే.
మీ ఫోన్ స్లోగా పనిచేస్తోందా?
మీ ఫోన్ పనితీరు క్షీణించిందా? తరచుగా ఫ్రీజ్ కావడం లేదా ల్యాగ్ కావడం జరుగుతోందా? అయితే, మీ ఫోన్ లో మాల్వేర్ లేదా స్పైవేర్ ఉండి ఉండవచ్చు. అవి తరచుగా ఫోన్ ప్రాసెసింగ్ శక్తిని వాటి కార్యకలాపాలను ఉపయోగిస్తాయి. దానివల్ల మీ ఫోన్ స్లో కావడం కానీ, తరచుగా క్రాష్ కావడం కానీ జరుగుతుంది.
ఫోన్ లో అసాధారణ కార్యకలాపాలు జరుగుతున్నాయా?
ఫోన్ లో అసాధారణ కార్యకలాపాలు జరుగుతున్నాయా?.. యాప్స్ వాటికవే ఓపెన్ అవడం, లేదా వాటికవే క్లోజ్ అయిపోవడం జరుగుతోందా?.. మీకు తెలియకుండానే మీ ఫోన్ లో నుంచి మెసేజెస్ వెళ్తున్నాయా? అయితే, ఆందోళన చ చెందాల్సిందే. మీ ఫోన్ లోకి మీ శత్రువు మాల్ వేర్ రూపంలో చొరపడింది. అదనంగా, మీకు తెలియకుండా కాల్స్ బ్లాక్ కావడం మీరు గమనించినట్లయితే వెంటనే తగిన చర్యలు తీసుకోండి.
అవాంఛిత యాప్స్ పాప్ అప్
మీ ఫోన్ లో మీకు తెలియని, అవాంచిత యాప్స్ ఆటోమేటిక్ గా ఇన్ స్టాల్ అవుతున్నాయా? అవి సడెన్ గా పాప్ అప్ అవుతున్నాయా? హ్యాకర్లు తమ చొరబాటు వ్యూహంలో భాగంగా మీకు తెలియకుండానే హానికరమైన యాప్ లను ఇన్స్టాల్ చేయవచ్చు.మీకు తెలియకుండా మీ ఫోన్ లోకి డౌన్ లోడ్ అయిన యాప్స్ కనిపిస్తే.. వెంటనే చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం.
అసాధారణ శబ్దం లేదా స్క్రీన్ యాక్టివిటీ
మీ ఫోన్ లో అసాధారణ యాక్టివిటీ ని గమనించారా? అంటే, మీరు ఫోన్ ను ఉపయోగించని సమయాల్లో కూడా అందులో నుంచి శబ్ధాలు రావడం లేదా స్క్రీన్ ఓపెన్ కావడం జరుగుతోందా?.. ఇది కూడా మీ ఫోన్ హ్యాక్ అయిందనడానికి సంకేతమే. మీ స్మార్ట్ ఫోన్ లోని వ్యక్తిగత డేటాను రక్షించడానికి ఈ సంకేతాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ ఫోన్ హ్యాక్ అయిందని మీరు అనుమానించినట్లయితే, సెక్యూరిటీ స్కాన్ రన్ చేయడం, అనుమానాస్పద యాప్ లను తొలగించడం, మీ పరికరం యొక్క సాఫ్ట్వేర్ ను అప్ డేట్ చేయడం వంటి చర్యలు తీసుకోండి.