Opposition leaders iPhones hacking: విపక్ష నేతల ఫోన్లను హ్యాక్ చేసే ప్రయత్నం: యాపిల్ హెచ్చరిక
Opposition leaders iPhones hacking: ప్రభుత్వ అనుకూల హ్యాకర్లు ప్రముఖ విపక్ష నేతల ఐ ఫోన్ల (iPhone) ను హ్యాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారని యాపిల్ (apple) సంస్థ ఆయా విపక్ష నేతలను హెచ్చరించింది. పెగాసస్ మాల్వేర్ ద్వారా తమ ఫోన్లను హ్యాకింగ్ చేశారని గతంలో కూడా విపక్ష నేతలు ఆరోపించారు.
iPhones hacking: ‘మీ ఐ ఫోన్ల (iPhones)ను హ్యాక్ చేయడానకి ప్రభుత్వ అనుకూల హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారని యాపిల్ సంస్థ పలువురు ప్రముఖ విపక్ష నేతలకు ఈ మెయిల్ చేసింది. యాపిల్ నుంచి ఈ మెయిల్ అందిన నాయకుల్లో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra), శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది, కాంగ్రెస్ నాయకులు శశి థరూర్ (Shashi Tharoor), పవన్ ఖేరా, ఆప్ ఎంపీ రాఘవ్ చధ్దా, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi).. తదితరులు ఉన్నారు.
ఈ కారణాలతో..
‘‘మీ ఫోన్ ను ప్రభుత్వ అనుకూల అటాకర్లు హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మీ యాపిల్ ఐడీ తో ఉన్న ఫోన్ ను హ్యాక్ చేయడం ద్వారా మీ గురించి, మీ కార్యకలాపాల గురించి తెలుసుకోవాలని వారు భావిస్తున్నారు. ఒకవేళ వారు మీ ఫోన్ ను హ్యాక్ చేయగలిగితే మీకు సంబంధించిన సెన్సిటివ్ సమాచారం, మీ ఇతర వివరాలు వారికి లభిస్తాయి. మీ ఫోన్ లోని మైక్రో ఫోన్ ను, కెమెరాను కూడా యాక్సెస్ చేసుకోగలుగుతారు. ఈ హెచ్చరికను తీవ్రంగా తీసుకోండి’’ అని యాపిల్ నుంచి వచ్చిన ఆ మెయిల్ లో ఉంది.
నా ఫోన్ తీసుకోండి..
విపక్ష నాయకుల ఐ ఫోన్ హ్యాకింగ్ పై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. హ్యాకింగ్ లకు భయపడబోమని, కావాలనుకుంటే తన ఫోన్ ను కూడా తీసుకోవాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సవాలు విసిరారు. కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణు గోపాల్, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఐ ఫోన్లను కూడా హ్యాక్ చేయడానికి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు యాపిల్ నుంచి వారికి మెయిల్స్ వచ్చాయన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో బీజేపీ సర్కారు ఈ పనులు చేస్తోందని విమర్శించారు.
ఇప్పుడు నంబర్ 1 మోదీ కాదు..
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై పలు వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వంలో ఇప్పటివరకు నంబర్ 1 నరేంద్ర మోదీ, నంబర్ 2 గౌతమ్ అదానీ, నంబర్ 3 అమిత్ షా అనుకున్నాను. కానీ, ఇప్పుడు ఆలస్యంగా తెలిసింది. ఇప్పడు నంబర్ 1 గౌతమ్ అదానీ, నంబర్ 2 నరేంద్ర మోదీ, నంబర్ 3 అమిత్ షా’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
ఆ అవసరం లేదు..
మరోవైపు, ఈ హ్యాకింగ్ వార్తలను బీజేపీ, కేంద్ర మంత్రులు ఖండించారు. విపక్ష నేతల ఫోన్లను హ్యాక్ చేసే అవసరం బీజేపీకి కానీ, కేంద్రానికి కానీ లేదని తేల్చి చెప్పారు. ‘వారి ఫోన్లు హ్యాక్ చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వమే చేసిందని ఎలా చెప్తారు?’ అని బీజేపీ నేత, సుప్రీంకోర్టు లాయర్ నళిన్ కోహ్లీ ప్రశ్నించారు. ‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి బదులుగా.. తమ ఫోన్ల హ్యాకింగ్ పై విపక్ష నేతలు యాపిల్ కు నేరుగా ఫిర్యాదు చేయాలి’ అని మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు.