Minister KTR: వాజ్ పేయి కూడా రాజ్యాంగాన్ని అవమానించినట్టేనా? సవరిస్తే అలానే అనుకోవాలా?
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా.. తెలంగాణ తరహా అభివృద్ధి పనులు జరిగాయా అని బీజేపీ, కాంగ్రెస్ ను ప్రశ్నించారు. పేదల కోసం కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు తీసుకొస్తుంటే.. కావాలని విమర్శిస్తున్నారన్నారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జడ్చర్ల మండలం కోడ్గల్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించి.. 40 ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక.. సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలతో దూసుకెళ్తున్నామని కేటీఆర్ అన్నారు. వేలాది గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా మార్చామని.. గిరిజనుల ఆకాంక్షను నెరవేర్చామని చెప్పారు.
తెలంగాణ పల్లెలు ఉన్నట్టు దేశంలోని.. ఏ రాష్ట్రంలోనైనా ఒక్క పల్లె ఉందా అని బీజేపీ, కాంగ్రెస్ ను కేటీఆర్ ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పురుగులు పడిన బియ్యాన్ని విద్యార్థులకు పెడుతున్నారని.. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం.. తన మనవరాలు, మనవడు ఎలాంటి బియ్యంతో అన్నం తింటున్నారో.. అలాంటి సన్న బియ్యంతోనే పేదల కడుపు నింపుతున్నాడని కొనియాడారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని అడిగినా కేంద్రం ఇవ్వలేదని కేటీఆర్ అన్నారు. ప్రధానికి విన్నవించినా.. పట్టించుకోలేదన్నారు. కర్ణాటకలోని ప్రాజెక్టు మాత్రం జాతీయ హోదా కల్పించారన్నారు. కేంద్రం సహకరించినా.. సహకరించకపోయినా.. ప్రజల అండతో కేసీఆర్ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. బడ్జెట్ లో కేటాయింపులు చూస్తే.. తెలంగాణకు మెుండి చేయి చూపించారని స్పష్టంగా అర్థమవుతుందన్నారు.
మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో పర్యటనలో భాగంగా.. అనంతరం తిమ్మాజిపేటలో ఎంజేఆర్ ట్రస్ట్ సహకారంతో నిర్మించిన ఉన్నత పాఠశాల భవనాన్ని కేటీఆర్ ప్రారంభించారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడారు. మన ఊరు-మన బడి కింద 26 వేల పాఠశాలల నవీకరణ చేసేందుకు సిద్ధమైనట్టు చెప్పారు. పూర్వ విద్యార్థులు, ఎన్ఆర్ఐలు కూడా ఇందులో పాలుపంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని 5 లక్షల మందికి గురుకులాల్లో విద్యను అందిస్తున్నట్టు కేటీఆర్ చెప్పారు.
బడ్జెట్‌లో ఉమ్మడి పాలమూరుకు కొత్త రైల్వే లైన్లు లేవని కేటీఆర్ అన్నారు. అప్పర్ భద్రకు జాతీయ హోదా.. మరి మా పాలమూరు సంగతేంటని ప్రశ్నించారు. ఎనిమిదేళ్లలో కేంద్ర విద్యాసంస్థ ఒక్కటి కూడా రాష్ట్రానికి ఇవ్వలేదని పేర్కొన్నారు. దేశానికి ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉన్న నాలుగో రాష్ట్రం తెలంగాణ అని అలాంటి రాష్ట్రానికి విద్య అందకుండా కేంద్రం చేస్తోందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని ఇప్పటివరకు 105 సార్లు సవరించారని.. రాజ్యాంగాన్ని సవరించినవాళ్లంతా అంబేడ్కర్‌ను అవమానించినట్టేనా? అని కేటీఆర్ ప్రశ్నించారు. అలా అయితే.. వాజ్‌పేయి కూడా రాజ్యాంగ సవరణ కోసం కమిటీ వేశారని.. వాజ్‌పేయి కూడా రాజ్యాంగాన్ని అవమానించినట్టేనా? అని కేటీఆర్ అడిగారు.
సంబంధిత కథనం