Bharat Ratna: బిహార్ మాజీ సీఎం, సోషలిస్ట్ నేత కర్పూరి ఠాకూర్ కు ‘భారత రత్న’
Bharat Ratna: సోషలిస్ట్ నాయకుడు, బిహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరణానంతరం ఆయనకు ఈ అవార్డును ప్రకటించారు.
Bharat Ratna: సోషలిస్ట్ నాయకుడు, బిహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ (Karpoori Thakur) కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరణానంతరం ఆయనకు ఈ అవార్డును ప్రకటించారు.
సోషలిస్ట్ నేత
కర్పూరి ఠాకూర్ 24 జనవరి 1924 న జన్మించారు. బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. కర్పూరి ఠాకూర్ ను ప్రజలు అభిమానంగా జన్ నాయక్ అని పిలిచేవారు. కర్పూరి ఠాకూర్ డిసెంబర్ 1970 నుండి జూన్ 1971 వరకు, ఆ తరువాత, డిసెంబర్ 1977 నుండి ఏప్రిల్ 1979 వరకు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. కర్పూరి ఠాకూర్ 1988 ఫిబ్రవరి 17వ తేదీన మరణించారు.
స్వాతంత్య్రోద్యమం..
కర్పూరి ఠాకూర్ బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలోని కర్పూరి గ్రామంలో గోకుల్ ఠాకూర్, రామ్‌దులారి దేవి దంపతులకు నాయ్ కులంలో జన్మించారు. విద్యార్థిగా ఉండగానే, ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్‌లో చేరారు. విద్యార్థి దశలోనే స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమం కోసం తన కాలేజీని మధ్యలో వదిలేశారు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నందుకు 26 నెలల జైలు జీవితం గడిపారు.
స్కూల్ టీచర్ గా..
భారతదేశం స్వాతంత్య్రం పొందిన తరువాత, ఠాకూర్ (Karpoori Thakur) తన గ్రామంలోని పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. అతను 1952లో తాజ్‌పూర్ నియోజకవర్గం నుండి సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా బీహార్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1960లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సార్వత్రిక సమ్మె సమయంలో P & T ఉద్యోగులకు నాయకత్వం వహించినందుకు అరెస్టయ్యారు. 1970లో, టెల్కో కార్మికుల ప్రయోజనాల పరిరక్షణ కోసం 28 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు.
సంపూర్ణ మద్య నిషేధం
కర్పూరి ఠాకూర్ 1970లో బీహార్‌లో మొదటి కాంగ్రెసేతర సోషలిస్ట్ ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించారు. బిహార్ లో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేశారు. ఆంగ్లాన్ని మెట్రిక్యులేషన్ లో కంపల్సరీ సబ్జెక్ట్ గా తొలగించారు. సోషలిస్ట్ నాయకుడు జయప్రకాశ్ నారాయణ్ తో సన్నిహిత సంబంధాలను కలిగి ఉండేవారు.