Modi's new cabinet: మోదీ కొత్త కేబినెట్ లో చంద్రబాబు నాయుడు, నితీశ్ కుమార్ ఏం అడుగుతున్నారు?
Modi's new cabinet: నరేంద్ర మోదీ తొలిసారి సిసలైన సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపబోతున్నారు. 2014, 2019 ల్లో సాంకేతికంగా ఎన్డీయే ప్రభుత్వమే అధికారంలోకి వచ్చినప్పటికీ.. అప్పుడు బీజేపీకి సొంతంగా మెజారిటీ స్థానాలు ఉండడం వల్ల, అది పేరుకే సంకీర్ణ ప్రభుత్వంలా కొనసాగింది. కానీ, ఇప్పుడలా కాదు..
Modi's new cabinet: 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించడంలో విఫలమైంది. మెజారిటీ కోసం మిత్ర పక్షాల మద్ధతు అవసరమైంది. దాంతో, ఇప్పుడు, ఎక్కువ సీట్లు ఉన్న ఎన్డీయే మిత్ర పక్షాల డిమాండ్లను నెరవేర్చాల్సిన అవసరం, పరిస్థతి మోదీ ప్రభుత్వానికి ఉంటుంది. ముందుగా, మంత్రిత్వ శాఖల నుంచే మిత్ర పక్షాల డిమాండ్ ప్రారంభమవుతుంది.
బాబు, నితీశ్ ల డిమాండ్స్
మోదీ కేబినెట్లో ఎక్కువ మంత్రి పదవుల కోసం టీడీపీ, జేడీయూ గట్టిగానే ప్రయత్నిస్తాయి. 12 ఎంపీ స్థానాలున్న జేడీయూ నేత నితీశ్ కుమార్ 5 మంత్రి పదవులు, కేంద్ర నిధులు, ముందస్తు ఎన్నికలు, బీహార్ కు ప్రత్యేక హోదా లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, టీడీపీ వ్యూహాత్మకంగా కీలకమైన మంత్రిత్వ శాఖలు, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, స్పీకర్ పదవిని కోరుతోంది.
సంకీర్ణాలపై అనుభవం
టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఇద్దరికీ సంకీర్ణ రాజకీయాల్లో గణనీయమైన అనుభవం ఉంది. బలమైన సంప్రదింపుల నైపుణ్యాలు ఉన్నాయి. వారి మద్దతును వ్యూహాత్మకంగా ఉపయోగించుకోవడానికి వారు అన్ని ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యమైన మంత్రిత్వ శాఖలను డిమాండ్ చేస్తారు.
జేడీయూ డిమాండ్స్
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కనీసం 5 మంత్రి పదవులు, కేంద్ర నిధులు, బిహార్ కు ప్రత్యేక హోదా, ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు.. మొదలైన వాటి కోసం బేరసారాలు చేయనున్నట్లు తెలుస్తోంది. తొలుత జేడీయూకు కనీసం మూడు కేబినెట్ బెర్తులు, ఒక సహాయ మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు ఆయన మంచి బేరసారాల స్థితిలో ఉన్నారని ఈ విషయం తెలిసిన వర్గాలు హిందుస్థాన్ టైమ్స్ కు తెలిపాయి. ‘‘కనీసం నాలుగు కేబినెట్ బెర్తులు వస్తాయని ఆశిస్తున్నాం. మరో సహాయ మంత్రి పదవిని అడగవచ్చు’’ అని జేడీయూ నేత ఒకరు తెలిపారు. రైల్వేలు, గ్రామీణాభివృద్ధి, జలవనరులు వంటి శాఖలపై పార్టీ ఆసక్తిగా ఉందని, ఈ శాఖలు బిహార్ లో అభివృద్ధిని వేగవంతం చేయడానికి ఉపయోగపడ్తాయని, తద్వారా జేడీయూ కి ప్రజాదరణ పెరుగుతుందని భావిస్తున్నామని ఆయన వెల్లడించారు.
చంద్రబాబు నాయుడు ఏం అడుగుతున్నారు?
కీలక, వ్యూహాత్మక మంత్రిత్వ శాఖలు, స్పీకర్ పదవితో పాటు ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ను ప్రధానంగా టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు డిమాండ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా డిమాండ్ పైననే చంద్రబాబు నాయుడు 2016లో బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. మరోవైపు, చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) లేదా ఎల్జేపీ-ఆర్వీకి మంత్రివర్గంలో ఒక బెర్త్ ఇస్తామని ఇప్పటికే హామీ ఇచ్చారు. ఇప్పుడు మరో సహాయ మంత్రి బెర్త్ ను చిరాగ్ పాశ్వాన్ డిమాండ్ చేసే అవకాశం ఉంది. ‘‘మాకు ఒక బెర్త్ గ్యారంటీ. సహాయ మంత్రి పదవి పెద్ద బోనస్ అవుతుంది’’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఎల్జేపీ-ఆర్వీ కార్యకర్త ఒకరు వ్యాఖ్యానించారు.