AP New Cabinet 2024 : ఏపీ కొత్త కేబినెట్ - రేసులో ఉన్నదెవరు..?-who will get a minister chance in andhrapradesh new cabinet ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap New Cabinet 2024 : ఏపీ కొత్త కేబినెట్ - రేసులో ఉన్నదెవరు..?

AP New Cabinet 2024 : ఏపీ కొత్త కేబినెట్ - రేసులో ఉన్నదెవరు..?

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 06, 2024 04:27 PM IST

AP New Cabinet 2024 Updates: ఏపీలో కూటమి అధికారంలోకి రావటంతో కొత్త మంత్రివర్గంపై ఆసక్తి నెలకొంది. మూడు పక్షాలు ఇందులో ఉండటంతో ఎవరికి ఛాన్స్ దక్కబోతుందనేది టాక్ ఆఫ్ ది ఆంధ్రాగా మారింది.

చంద్రబాబు - పవన్ కల్యాణ్
చంద్రబాబు - పవన్ కల్యాణ్ (Photo Source janasena Twitter)

Andhrapradesh New Cabinet : ఏపీలో కూటమి విజయం సాధించటంతో ఎవరు మంత్రులు కాబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. కూటమిలో మూడు పార్టీలు భాగం కావటంతో… ఎవరిని అదృష్టం వరించబోతుందనే దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీనియారిటీ, కూటమిలోని పక్షాలకు ప్రయారిటీతో పాటు సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని మంత్రివర్గ కూర్పు ఉండబోతుందని ఆయా పార్టీల  నేతలు చెబుతున్నారు.

ఏ పార్టీకి ఎన్ని సీట్లు….

ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో  ఎన్డీఏ కూటమి 164 సీట్లలో విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ మొత్తం 144 స్థానాల్లో పోటీ చేయగా 135 స్థానాల్లో నెగ్గింది. అతిపెద్ద భాగస్వామ్యపక్షంగా టీడీపీ ఉంది. ఇక జనసేన 21కి 21 స్థానాల్లో జెండా ఎగరవేసింది. భారతీయ జనతా పార్టీ మొత్తం 10 చోట్ల పోటీ చేయగా.. 8 సీట్లలో గెలుపొందింది.

ఇక పార్లమెంట్ స్థానాల విషయానికొస్తే మొత్తం 25 స్థానాలకుగాను టీడీపీ 16 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది.కూటమిలో ఉన్న జనసేన 2, బీజేపీ 3 పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంది. రాష్ట్రం నుంచి మెజార్టీ గెలుచుకున్న టీడీపీ…. అటు కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో రెండో అతిపెద్ద పార్టీ అవతరించింది. దీంతో కేంద్రంలోనూ తెలుగుదేశం పార్టీకి కీలక మంత్రిత్వ శాఖలు దక్కే అవకాశం ఉంది.

మంత్రులుగా ఎవరికి అవకాశం - రేసులో ఉన్నది ఎవరు…?

చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ఏపీలో అధికార పీఠాన్ని అధిష్టించింది. జూన్ 12వ తేదీన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. చంద్రబాబు కేబినెట్ లో మొత్తం 25 మందికి అవకాశం ఉంది. అయితే ఆ రోజు ఎంత మంది మంత్రులుగా ప్రమాణం చేస్తారనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారా లేక కొంతమందితో కూడిన కేబినెట్ కొలువుదీరుతుందా అనేది తెలియాల్సి ఉంది.  

ఉమ్మడి జిల్లాల వారీగా పరిశీలిస్తే…

  • ప్రకాశం జిల్లా -  వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, సాంబశివరావుతో పాటు మరో ఎమ్మెల్యే రేసులో ఉండే అవకాశం ఉంది.
  • నెల్లూరు జిల్లా -  మాజీ మంత్రి నారాయణ, ఆనం  రాం నారాయణరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితో పాటు కోటంరెడ్డి పేరు కూడా పరిశీలించే అవకాశం ఉంటుంది.
  • చిత్తూరు జిల్లా -  అమరనాథ్‌రెడ్డి, నల్లారి కిషోర్‌కుమార్‌ రెడ్డితో పాటు మరో ఎమ్మెల్యే పేరు కూడా పరిశీలించవచ్చు.
  • కృష్ణా జిల్లా -  ఈసారి ఇక్కడ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. దీంతో ఈ జిల్లాకు మంత్రివర్గంలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వొచ్చు.  బోండా ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి ఉన్నారు. 
  • గుంటూరు జిల్లా - సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనందబాబు,ధూళిపాళ్ల నరేంద్ర,, శ్రావణ్ కుమార్ ఉన్నారు.
  • అనంతపురం జిల్లా  - సీనియర్ నేతలైన పయ్యావుల కేశవ్, కాలువ శ్రీనివాసులు, పరిటాల సునీత రేసులో ఉన్నారు. వీరిలో ఇద్దరికి అవకాశం రావొచ్చు.
  •   కర్నూలు జిల్లా -కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డితో పాటు మరో పేరును పరిశీలించే అవకాశం ఉంది.
  • కడప జిల్లా -  పుట్టా సుధాకర్‌ యాదవ్,  భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డితో పాటు మరో ఎమ్మెల్యే పేరును పరిశీలిస్తారని సమాచారం.
  • తూర్పు గోదావరి -  సీనియర్ నేత అయిన యనమల రామకృష్ణుడు, చినరాజప్పతో పాటు జ్యోతుల నెహ్రూ పేరు పరిశీలించనున్నారు. ఇక   7వ సారి ఎమ్మెల్యేగా గెలిచిన  గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
  •  పశ్చిమ గోదావరి - బీసీ సామాజికవర్గానికి చెందిన పితానితో పాటు నిమ్మల రామానాయుడు పేరు పరిశీలించే అవకాశం ఉంది.
  • శ్రీకాకుళం - అచ్చెన్నాయుడకు దాదాపుగా ఛాన్స్ ఉంటుంది. ఇక కూన రవికుమార్ పేరు పరిశీలనలో ఉంది.
  •  విజయనగరం - కళా వెంకటరావుతో పాటు మరో ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి.
  •  విశాఖ - అయ్యన్నపాత్రుడు, పల్లా శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు కేబినెట్ రేసులో ఉంటారు. పల్లా ఈసారి అత్యధిక మెజార్టీతో గెలిచారు. 

మంత్రివర్గం కూర్పులో జనసేన నుంచి పలువురికి అవకాశం దక్కే అవకాశం స్పష్టంగా ఉంది. అయితే పవన్ కల్యాణ్ కు డిప్యూటీ సీఎం ఇస్తారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ… దీనిపై జనసేన వర్గాల నుంచి స్పష్టమైన సమాచారం లేదు. ఇదే పార్టీకి చెందిన నాదెండ్లకు దాదాపుగా బెర్త్ ఖరారయ్యే ఛాన్స్ ఉంది. 

ఇక ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి గెలిచిన కొణతాల పేరు కూడా పరిశీలనకు రావొచ్చు. ఇక బీజేపీకి ఒకటి లేదా రెండు స్థానాలు దక్కే అవకాశం ఉంది. ఇందుకోసం సుజనా చౌదరితో పాటు కామినేని శ్రీనివాస్ పోటీ పడే అవకాశం ఉంది. వీరే కాకుండా బీసీ సామాజికవర్గానికి చెందిన సత్య కుమార్ రేసులో ఉండనున్నారు. ఇక కేబినెట్ మహిళలకు అవకాశం దక్కనుంది. ఇందుకోసం పలువురి పేర్లు పరిశీలించే అవకాశం ఉంది. ఇక మంత్రివర్గంలో మైనార్టీ వర్గాలకు ఛాన్స్ ఇవ్వొచ్చు. అయితే ఇది ఎవరికి ఇస్తారనేది చూడాలి.

పైన పేర్కొన్న పేర్లు మాత్రమే కాకుండా… సామాజిక సమీకరణాలతో పాటు పార్టీ సీనియారిటీని కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. కేవలం ఎమ్మెల్యేగా గెలిచిన వారు మాత్రమే కాకుండా… ఎమ్మెల్సీలుగా ఉన్న వారి పేర్లు కూడా పరిశీలించవచ్చు. ఇక స్పీకర్, డిప్యూటీ స్పీకర్ తో పాటు మరికొన్ని ముఖ్యమైన పదవులు కూడా ఉన్న నేపథ్యంలో….. మంత్రులుగా ఎవరికి ఛాన్స్ దక్కబోతుందనేది చూడాలి…!

Whats_app_banner