Narendra Modi 3.0: ‘‘ఆలస్యం చేయొద్దు.. త్వరపడండి’’ - మోదీకి నితీశ్ కుమార్ సలహా
Narendra Modi 3.0: నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని పదవి చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. జూన్ 8న ఆయన వరుసగా మూడో సారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, బుధవారం జరిగిన ఎన్డీయే సమావేశంలో జేడీయూ నేత నితీశ్ కుమార్ నరేంద్ర మోదీకి కీలకమైన సలహా ఒకటి ఇచ్చారు.
బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ () బుధవారం నరేంద్ర మోదీకి సంపూర్ణ, బేషరతు మద్దతు ప్రకటించింది. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు హిందీలో మూడు పేరాల తీర్మానాన్ని ఆమోదించి బీజేపీ అగ్రనేతను తమ నేతగా ఎన్నుకున్నాయి. వారణాసి నుంచి ఎంపీగా గెలిచిన నరేంద్ర మోదీ జూన్ 8న మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
బీజేపీ అధికారం చేపట్టకూడదు
మరోవైపు, బీజేపీ ప్రభుత్వం పాలించకూడదని ఈ ఎన్నికల్లో ప్రజలు తీర్పునిచ్చారని, వారి ఆకాంక్షను నెరవేర్చేందుకు తగిన సమయంలో తగిన చర్యలు తీసుకుంటామని ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి హెచ్చరించింది. ఇండియా కూటమి నేతలు బుధవారం ఢిల్లీలో సమావేశమయ్యారు.
త్వరపడండి..
కాగా, లోక్ సభ ఎన్నికల తర్వాత కింగ్ మేకర్ గా అవతరించిన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నరేంద్రమోదీకి కీలక సూచన ఒకటి చేశారు. ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం వద్దని, సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నితీశ్ సూచించారు. బుధవారం జరిగిన ఎన్డీయే భేటీలో నితీశ్ ఈ సూచన చేసినట్లు సమాచారం. 'జల్దీ కిజియే' అని నితీశ్ కుమార్ నరేంద్ర మోదీతో అన్నట్లు సమాచారం. బిహార్ లో జేడీయూ 12 లోక్ సభ స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే.
కేబినెట్ కూర్పుపై చర్చించలేదు
ఢిల్లీలో బుధవారం సుహృద్భావ వాతావరణంలో ఎన్డీయే సమావేశం జరిగింది. ఎన్డీయే సభ్యులు మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు. కేబినెట్ కూర్పుపై అంశం ఈ భేటీలో ప్రస్తావనకు రాలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ‘‘మంత్రివర్గ కూర్పుపై ఎలాంటి చర్చ జరగలేదు. సంప్రదింపులు జరగలేదు. లోక్ సభ ఎన్నికలు సుదీర్ఘంగా, ఏడు దశల్లో జరిగినందున ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని నితీశ్ కుమార్ అన్నారు’’ అని ఓ సభ్యుడు తెలిపారు.
మోదీకి చంద్రబాబు ప్రశంసలు
ఎన్డీయే భేటీలో మోదీపై చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. వరుసగా మూడుసార్లు ఎన్నికల్లో గెలవడం సాధారణ విషయం కాదని మోదీని కొనియాడారు. ఆంధ్ర ప్రదేశ్ లో 16 లోక్ సభ స్థానాలను గెలుచుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంలో కీలక భూమిక పోషించనున్నారు.
వివాదాస్పద అంశాలపై.
కాగా, వివాదాస్పద అంశాలపై చర్చించేందుకు ఎన్డీయే సభ్య పార్టీలకు ఒక ప్రత్యేక యంత్రాంగం ఉండాలనే దానిపై ఎన్డీయే భేటీలో సూచనప్రాయంగా చర్చ జరిగినట్లు సమాచారం. బీజేపీ ఎజెండాలో కొన్ని అంశాలు ఉన్నాయని, వాటితో కొందరు సభ్యులు విభేదించవచ్చునని, దీనిపై విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉందని సమావేశంలో పాల్గొన్న మరో వ్యక్తి తెలిపారు.
తొలిసారి సొంత మెజారిటీకి దూరంగా మోదీ
నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక.. ఈ ఎన్నికల్లోనే తొలిసారి బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాల మద్దతు అవసరమైంది. లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం 240 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఇది సాధారణ మెజారిటీకి 32 సీట్లు తక్కువ. మొత్తంగా ఎన్డీయేకు 293 సీట్లు వచ్చాయి. 12 సీట్లతో నితీశ్ కుమార్, 16 సీట్లతో చంద్రబాబు నాయుడుల మద్ధతు బీజేపీ ప్రభుత్వం కొనసాగడానికి కీలకంగా మారింది.