INDIA Bloc : నరేంద్ర మోదీకి నైతిక ఓటమి, బీజేపీ ఫాసిస్ట్ పాలనపై ఇండియా కూటమి పోరాడుతుంది- మల్లికార్జున ఖర్గే-delhi india bloc leaders meeting decided fight against bjp fascist rule says kharge ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  India Bloc : నరేంద్ర మోదీకి నైతిక ఓటమి, బీజేపీ ఫాసిస్ట్ పాలనపై ఇండియా కూటమి పోరాడుతుంది- మల్లికార్జున ఖర్గే

INDIA Bloc : నరేంద్ర మోదీకి నైతిక ఓటమి, బీజేపీ ఫాసిస్ట్ పాలనపై ఇండియా కూటమి పోరాడుతుంది- మల్లికార్జున ఖర్గే

Bandaru Satyaprasad HT Telugu
Jun 05, 2024 10:24 PM IST

INDIA Bloc : భారత రాజ్యాంగం పరిరక్షణకు ఇండియా కూటమికి ప్రజలు మద్దతు తెలిపారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. దిల్లీలో ఇండియా కూటమి భేటీ అనంతరం ఉమ్మడి ప్రకటన చేశారు.

మోదీకి నైతిక ఓటమి, బీజేపీ ఫాసిస్ట్ పాలనపై ఇండియా కూటమి పోరాడుతుంది
మోదీకి నైతిక ఓటమి, బీజేపీ ఫాసిస్ట్ పాలనపై ఇండియా కూటమి పోరాడుతుంది

INDIA Bloc : ఇండియా కూటమి నేతలు బుధవారం సాయంత్రం దిల్లీలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో సహా 30 మందికి పైగా ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన ఇండియా కూటమి సమావేశం అనంతరం ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఇండియా కూటమికి అఖండమైన మద్దతు లభించినందుకు భారతదేశ ప్రజలకు ఇండియా కూటమి కృతజ్ఞతలు తెలియజేసింది. ప్రజాతీర్పు బీజేపీ, వారి ద్వేషం, అవినీతి, స్వార్థ రాజకీయాలకు తగిన సమాధానం అన్నారు. ఇది నరేంద్ర మోదీకి రాజకీయంగా, నైతికంగా ఓటమి అన్నారు. భారత రాజ్యాంగ పరిరక్షణకు, ధరల పెరుగుదల, నిరుద్యోగం, మోదీ ప్రభుత్వ క్రోనీ క్యాపిటలిజానికి వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పు అన్నారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా ఇండియా కూటమి పోరాడుతూనే ఉంటుంది. బీజేపీ ప్రభుత్వ పాలన ఉండకూడదనే ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు తగిన సమయంలో తగిన చర్యలు తీసుకుంటామన్నారు ఇండియా కూటమి నేతలు.

నరేంద్ర మోదీకి నైతిక ఓటమి

ఇండియా కూటమి అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటన జారీ చేశారు. మోదీకి వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తీర్పునిచ్చారన్నారు. మోదీకి రాజకీయ ఓటమి మాత్రమే కాకుండా నైతిక ఓటమిగా అభివర్ణించారు. మోదీ తరహా రాజకీయలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారన్నారు. అయినా మోదీ ప్రజాభీష్టాన్ని కాలరాసేందుకు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. నరేంద్ర మోదీపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లినట్లు 18వ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయన్నారు. మోదీ నాయకత్వంపై ఎన్నికల ప్రచారం భారీగా నిర్వహించినా, మోదీ పేరు, ఇమేజ్‌పై ప్రచారం చేసినా బీజేపీకి సొంతంగా మెజారిటీ సాధించడంలో విఫలమైందన్నారు. దీనిబట్టి మోదీ నాయకత్వంపై ప్రజలకు నమ్మకం లేదన్నారు.

ఇతర పార్టీలకు ఆహ్వానం

ఇండియా కూటమిలోకి ఇతర పార్టీలను ఆహ్వానిస్తున్నామని ఖర్గే తెలిపారు. భారత రాజ్యాంగ పీఠికపై విశ్వాసం, దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం వంటి లక్ష్యాలకు కట్టుబడి ఉన్న రాజకీయ పార్టీలను ఇండియా కూటమిలోకి స్వాగతిస్తున్నట్లు ఈ మేరకు మల్లికార్జున ఖర్గే ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీలు కలిసికట్టుగా ఎంతో సమన్వయంతో పోరాడాయని కొనియాడరు.

దేశవ్యాప్తంగా ఉన్న 543 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగగా... బీజేపీకి 240 సీట్లు రాగా కాంగ్రెస్ కు 99 సీట్లు వచ్చాయి. ఎన్డీఏ కూటమికి 292 సీట్లు రాగా, ఇండియా కూటమికి 232 సీట్లు వచ్చాయి. దీంతో ఎన్డీఏ, ఇండియా కూటమి పార్టీలు ఇవాళ దిల్లీలో సమావేశం అయ్యాయి. ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాట్లు సమాయత్తం అవుతుంది. ఈ నెల 7న రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనుంది. నరేంద్ర మోదీ వరుసగా మూడో సారి ప్రధానిగా ఈ నెల 9న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 232 సీట్లు సాధించిన ఇండియా కూటమి ప్రతిపక్షంలోనే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సరైన సమయంలో నిర్ణయం ఉందని ఇండియా కూటమి సమావేశం అనంతరం ఖర్గే అన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం