Mallikarjun Kharge : తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ బలం ఇస్తే, క్రెడిట్ కేసీఆర్ కొట్టేశారు- మల్లికార్జున ఖర్గే
Mallikarjun Kharge : కేసీఆర్ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అన్నారు. తెలంగాణ తెచ్చే శక్తి కేసీఆర్ కు ఎక్కడిదని ప్రశ్నించారు.
Mallikarjun Kharge : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఒకే కుటుంబం లాభపడిందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ ప్రజాగర్జన సభ నిర్వహించింది. ఈ సభలో పాల్గొన్న మల్లికార్జున ఖర్గే.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని గుర్తుచేసుకుంటే దుఖం వస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది బలిదానం చేసుకున్నారన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ప్రజల కోసం రాష్ట్రం ఇచ్చిందన్నారు. తెలంగాణ తెచ్చే శక్తి కేసీఆర్‌కు ఎక్కడిదన్న ఖర్గే... కేసీఆర్‌కు బలం ఇచ్చింది కాంగ్రెస్ అన్నారు. కానీ కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాల్సిన కేసీఆర్ మాట మార్చారన్నారు. తెలంగాణ తెచ్చిన క్రెడిట్ అంతా తనదే అన్నట్లు కేసీఆర్ తీరు ఉందన్నారు. తెలంగాణ ఇచ్చినందుకు కేసీఆర్ సోనియా గాంధీ నివాసానికి వచ్చి ధన్యవాదాలు తెలిపారని గుర్తుచేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తీరుతుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలను అమలుచేస్తామన్నారు.
బీఆర్ఎస్-బీజేపీ మధ్య ఒప్పందం
రేపు తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నారని, ఇన్ని ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నిస్తారని మల్లిఖార్జున ఖర్గే అన్నారు. బీఆర్ఎస్ కు బీజేపీతో అంతర్గత ఒప్పందం ఉందన్నారు. హైదరాబాద్ సంస్థానానికి స్వేచ్ఛ కల్పించి కాంగ్రెస్ పార్టీ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లోని 12 హామీలు అమలు చేస్తామని మల్లికార్జున ఖర్గే తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణ కోసం అన్ని వర్గాల ప్రజలు పోరాటం చేస్తే తన వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ చెప్పుకుంటున్నారన్నారు. రాష్ట్రాన్ని ప్రకటించినందుకు సోనియాతో ఫొటో తీసుకుని బయటకు వచ్చి మాట మార్చారన్నారు.
మోదీకి భయపడే ప్రసక్తే లేదు
తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్మించిందని మల్లికార్జున ఖర్గే తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పనుల వల్లే ఆహారధాన్యాల ఉత్పత్తి పెరిగిందన్నారు. భూసంస్కరణలు అమలు చేసి జమీందారీ వ్యవస్థను నిషేధించామన్నారు. బ్యాంకులను జాతీయీకరణ, నరేగా చట్టం తెచ్చింది ఎవరు? ప్రశ్నించారు. హైదరాబాద్‌లో అనేక సంస్థలను కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పాటుచేసిందన్నారు. నేడు ప్రతి ఒక్కరి చేతిలో సెల్‌ఫోన్ ఉందంటే రాజీవ్ గాంధీ కారణమన్నారు. హరిత విప్లవం, శ్వేత విప్లవం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే వచ్చాయన్నారు. తాను 12 ఎన్నికల్లో పోటీ చేస్తే 11 సార్లు విజయం సాధించానన్నారు. మోదీకి భయపడే ప్రసక్తే లేదన్నారు. అవినీతిలో కూరుకుపోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఏఐసీసీలో తెలంగాణకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. 66 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన నేతలను కమిటీల్లోకి తీసుకున్నామన్నారు.