TS Congress : నేడు డీకే శివకుమార్, రేపు మల్లికార్జున ఖర్గే-అగ్రనేతలను రంగంలోకి దింపుతున్న కాంగ్రెస్-congress aicc president mallikarjun kharge dk shivakumar telangana tours confirmed ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Congress : నేడు డీకే శివకుమార్, రేపు మల్లికార్జున ఖర్గే-అగ్రనేతలను రంగంలోకి దింపుతున్న కాంగ్రెస్

TS Congress : నేడు డీకే శివకుమార్, రేపు మల్లికార్జున ఖర్గే-అగ్రనేతలను రంగంలోకి దింపుతున్న కాంగ్రెస్

Bandaru Satyaprasad HT Telugu
Oct 28, 2023 09:52 AM IST

TS Congress : తెలంగాణలో ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకుంది. నామినేషన్లకు సమయం దగ్గర పడడంతో కాంగ్రెస్ కీలక నేతలను ప్రచార రంగంలోకి దింపుతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్ తెలంగాణలో పర్యటించనున్నారు.

మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్
మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్

TS Congress : తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి జాతీయ నాయకులను రంగంలోకి దింపుతోంది కాంగ్రెస్. ఈసారి ఎన్నికల్లో విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్... అందివచ్చే ఏ అవకాశాన్ని వదులుకోవడంలేదు. ఘర్ వాపసీ పేరుతో పార్టీని వీడిన నేతలను తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తుంది. బీఆర్ఎస్ లో అసమ్మతి నేతలకు గాలం వేస్తుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే. శివకుమార్ తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. వీరి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. శనివారం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలంగాణలో పర్యటించనున్నారు. రేపు(ఆదివారం) ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. తాండూరు, పరిగి, చేవెళ్ల నియోజక వర్గాలలో డీకే శివకుమార్ ప్రచారం నిర్వహిస్తారు. శనివారం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు తాండూరు, సాయంత్రం 4 నుంచి 5 వరకు పరిగి, సాయంత్రం 6 నుంచి 7 వరకు చేవెళ్లలో డీకే శివకుమార్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు.

కాంగ్రెస్ అధ్యక్షుడి ప్రచార షెడ్యూల్-అక్టోబర్ 29

  • మధ్యాహ్నం 12.00 గంటలకు గుల్బర్గా నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ టేకాఫ్
  • మధ్యాహ్నం 12.30 గంటలకు - సంగారెడ్డిలో ల్యాండింగ్
  • 12.30 నుంచి 01.30 వరకు - బహిరంగ సభ, సంగారెడ్డి
  • మధ్యాహ్నం 02.45 - సంగారెడ్డిలో టేకాఫ్
  • మధ్యాహ్నం 03.15 గంటలకు - మెదక్‌లో ల్యాండింగ్
  • మధ్యాహ్నం 03.30 నుంచి 04.30 వరకు - బహిరంగ సభ, మెదక్
  • సాయంత్రం 04.45 - మెదక్‌లో టేకాఫ్
  • సాయంత్రం 05.30 గంటలకు - శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్

తెలంగాణ కాంగ్రెస్ 45 మంది అభ్యర్థులతో రెండో జాబితా విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ రెండు విడతల్లో ఇప్పటికి వంద నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. కమ్యూనిస్టులతో పొత్తుతోపాటు ఇతర రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మరో 19 స్థానాలను రిజర్వుడులో ఉంచింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 5 స్థానాలు ఖరారు కాలేదు. రేణుకా చౌదరి, పొంగులేటీ శ్రీనివాస రెడ్డి, భట్టి విక్రమార్క వారి అనుచరులకు సీట్లు ఇప్పించాలని పట్టుపట్టడంతో కొన్ని స్థానాలను పెండింగ్ లో పెట్టింది.

పెండింగ్ స్థానాలివే

వైరా, కొత్తగూడెం, మిర్యాలగూడ, చెన్నూరు, చార్మినార్, నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి, సిరిసిల్ల, సూర్యపేట, తుంగతుర్తి, బాన్సువాడ, జుక్కల్, పఠాన్ చెరువు, కరీంనగర్, ఇల్లందు, డోర్నకల్, సత్తుపల్లి, నారాయణ్ ఖేడ్, అశ్వారావుపేట.

మొదలైన అసంతృప్తుల లొల్లి

కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తుల లొల్లి మొదలైంది. టికెట్ల ఆశించిన నేతలకు రెండో జాబితాలో చుక్కెదురవ్వడంతో... భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకుంటున్నారు. జడ్చర్ల, నారాయణపేట టికెట్ ఆశించిన ఎర్ర శేఖర్‌కు టికెట్ దక్కకపోవడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు. భవిష్యత్ కార్యాచరణపై శనివారం కార్యకర్తలతో సమావేశం కానున్నారు ఎర్ర శేఖర్.

Whats_app_banner