తెలుగు న్యూస్  /  National International  /  Tata Projects To Construct Noida International Airport At Jewar

నోయిడా ఎయిర్‌పోర్టును నిర్మించనున్న టాటా.. 2024కల్లా రెడీ..

HT Telugu Desk HT Telugu

03 June 2022, 12:50 IST

    • నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నిర్మాణ పనులను టాటా ప్రాజెక్ట్స్ దక్కించుకుంది.
ప్రయాగ్‌రాజ్ ఎయిర్‌పోర్ట్ టర్మినల్ నిర్మించిన టాటా ప్రాజెక్ట్స్
ప్రయాగ్‌రాజ్ ఎయిర్‌పోర్ట్ టర్మినల్ నిర్మించిన టాటా ప్రాజెక్ట్స్ (Tata Projects)

ప్రయాగ్‌రాజ్ ఎయిర్‌పోర్ట్ టర్మినల్ నిర్మించిన టాటా ప్రాజెక్ట్స్

ముంబై, జూన్ 3: ఢిల్లీ శివార్లలో మరో అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ రాబోతోంది. ఉత్తర ప్రదేశ్ పరిధిలోకి వచ్చే జెవార్ వద్ద నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును టాటా గ్రూప్‌లోని మౌలిక వసతులు, నిర్మాణ సంస్థ టాటా ప్రాజెక్ట్స్ నిర్మించనుంది. 

కాంట్రాక్టు ప్రకారం టాటా ప్రాజెక్ట్స్ టర్మినల్, రన్ వే, ఎయిర్‌సైడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, యుటిలిటీస్, లాండ్ సైడ్ ఫెసిలిటీస్ తదితర వసతులను ఈ ఎయిర్ పోర్టు నిర్మాణంలో భాగంగా నిర్మిస్తుంది. ఎయిర్ పోర్ట్‌ను నిర్వహించనున్న యమునా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రయివేటు లిమిటెడ్(వైఐఏపీఎల్) సంబంధిత వివరాలు వెల్లడించింది.

వైఐఏపీఎల్ స్విస్ డెవలపర్ జూరిచ్ ఎయిర్‌పోర్ట్ ఇంటర్నేషనల్ ఏజీ సంస్థకు చెందిన సబ్సిడరీ కంపెనీ. నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేసేందుకు స్పెషల్ పర్పస్ వెహికిల్‌గా రిజిస్టర్ అయ్యింది.

ఎయిర్‌పోర్టును డెవలప్ చేసేందుకు 2019లోనే జూరిచ్ ఎయిర్‌పోర్టు ఇంటర్నేషనల్ ఏజీ టెండర్ కైవసం చేసుకుంది. ఎయిర్‌పోర్టు అభివృద్ధి పనులు ప్రారంభమయ్యేందుకు వీలుగా 2020 అక్టోబరు 7న ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం వైఐఏపీఎల్‌తో కన్సెషన్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది.

కొత్తగా ఏర్పాటవుతున్న ఈ విమానాశ్రయం మొత్తం 1,334 హెక్టార్లలో విస్తరించి ఉంటుంది. తొలి విడతలో ఒకే రన్ వే కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఏటా 12 మిలియన్ల ప్రయాణికుల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఫస్ట్ ఫేజ్‌లో మొత్తంగా రూ. 5,700 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు.

‘ఈపీసీ పద్ధతిలో నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మించేందుకు వైఐఏపీఎల్ టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌ను ఎంపిక చేసేంది. డిజైన్, ప్రొక్యూర్‌మెంట్, నిర్మాణం, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మూడు కంపెనీల నుంచి టాటా ప్రాజెక్ట్స్‌ను ఎంపిక చేశాం..’ అని సంస్థ వెల్లడించింది. కొత్త ఎయిర్ పోర్టు 2024లో తన కార్యకలాపాలు ప్రారంభించనుందని తెలిపింది. 

కాగా టాటా ప్రాజెక్ట్స్ ఇతర ప్రధాన ప్రాజెక్టులలో పార్లమెంట్ కొత్త భవనం, ముంబై ట్రాన్స్-హార్బర్ లింక్, వివిధ నగరాల్లో మెట్రో రైలు మార్గాలు ఉన్నాయి.

టాపిక్