తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  సైనిక చర్య ప్రారంభమైందన్న పుతిన్

సైనిక చర్య ప్రారంభమైందన్న పుతిన్

HT Telugu Desk HT Telugu

24 February 2022, 9:35 IST

    • ఉక్రెయిన్‌లో సైనిక చర్యను ప్రారంభించినట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం ఉదయం ప్రకటించారు.
పుతిన్ (ఫైల్ ఫోటో)
పుతిన్ (ఫైల్ ఫోటో) (AFP)

పుతిన్ (ఫైల్ ఫోటో)

ఉక్రెయిన్‌లో తూర్పున ఉన్న వేర్పాటువాదులను రక్షించడానికి, పాశ్చాత్య అనుకూల పొరుగు దేశాలు సైనికులను మోహరించాలన్న ప్రయత్నాలను భంగపరచడానికి సైనిక చర్య ప్రారంభించినట్టు పుతిన్ ఈ ఉదయం ప్రకటించారు.

‘నేను సైనిక చర్యకు నిర్ణయం తీసుకున్నాను’ అని పుతిన్ ఉదయం 6 గంటలకు టీవీలో ఆశ్చర్యకరమైన ప్రకటన చేశారు.

ఉక్రెయిన్ తూర్పు భాగాన జరుగుతున్న మారణహోమాన్ని, అలాగే రష్యా పట్ల నాటో దూకుడు విధానాన్ని ఖండిస్తున్నట్టు తెలిపారు.

‘ఇందుకోసం మేం ఉక్రెయిన్‌లో సైన్యాల మోహరింపును నిలువరిస్తాం. రష్యన్ పౌరులతో సహా పౌరుల రక్తపాతానికి కారణమైన వారిని కోర్టుకు తీసుకువస్తాం..’ అని ప్రకటించారు.

తాను ఉక్రెయిన్‌ ‘ఆక్రమణ’ కోరుకోవడం లేదని, అక్కడి నుంచి పాశ్చాత్య దేశాల సైనిక బలగాల ఉపసంహరణ కోరుకుంటున్నానని చెప్పారు.

‘ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తే రష్యా ప్రతిస్పందన తక్షణమే ఉంటుందని, మునుపెన్నడూ చూడని పరిణామాలకు దారితీస్తుందని వారు తెలుసుకోవాలి’ అని హెచ్చరించారు.

‘రష్యా సైనికులు, అధికారులు తమ విధిని ధైర్యంగా నెరవేరుస్తారని నేను విశ్వసిస్తున్నా..’ అని పుతిన్ పేర్కొన్నారు. కాగా సైనిక చర్య పరిధిని పుతిన్ వెల్లడించలేదు.