తెలుగు న్యూస్  /  National International  /  Mumbai Rains: North-west Suburbs Affected, Four Subways Shut For Traffic

Heavy rains in Mumbai | మున‌క ముప్పులో ముంబై

HT Telugu Desk HT Telugu

05 July 2022, 22:35 IST

  • మ‌రోసారి ముంబై ని వ‌ర్షం ముంచెత్తింది. అంధేరీ, ఘ‌ట్కోప‌ర్‌, చెంబూర్‌, ధార‌వి, దాద‌ర్ త‌దిత‌ర ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురిసింది. సోమ‌వారం రాత్రి ప్రారంభ‌మైన వాన‌, మంగ‌ళ‌వారం కూడా కొన‌సాగింది. దాంతో రోడ్లు జ‌ల‌మ‌యమయ్యాయి.

ముంబైలో వ‌ర్ష బీభ‌త్సం
ముంబైలో వ‌ర్ష బీభ‌త్సం (PTI)

ముంబైలో వ‌ర్ష బీభ‌త్సం

భారీ వ‌ర్షాలు ముంబైని అత‌లాకుత‌లం చేస్తున్నాయి. వ‌ర‌ద ప‌రిస్థితిపై ముఖ్య‌మంత్రి ఏక్‌నాథ్ షిండే స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. స‌హాయ చ‌ర్య‌ల కోసం ప్ర‌త్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు.

సోమ‌వారం రాత్రి నుంచి..

సోమ‌వారం రాత్రి నుంచి ముంబై, ముంబై శివార్ల‌ను వ‌ర్షం ముంచెత్తుతోంది. రోడ్లు జ‌ల‌మ‌యమయ్యాయి. లోత‌ట్లు ప్రాంతాలు నీట‌మునిగాయి. వాహ‌న‌దారులు రోడ్ల‌పై నిలిచిన నీళ్ల‌లో నుంచి ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితుల్లో ప్ర‌యాణాలు చేస్తున్నారు. వ‌ర్షం కొనసాగితే, 2005లో ముంబై నీట మునిగిన నాటి ప‌రిస్థితులు త‌లెత్తుతాయ‌న్న భ‌యాందోళ‌న‌లు వ్య‌క్త‌మవుతున్నాయి.

లోక‌ల్ ట్రైన్ల‌పై ప్ర‌భావం

ముంబై స్థానిక ప్ర‌యాణాల‌కు ప్రాణాధారం వంటి లోక‌ల్ ట్రైన్ స‌ర్వీసులపై ఈ భారీ వ‌ర్షాలు ఎక్కువ ప్ర‌భావం చూపాయి. మెయిన్ కారిడార్‌, హార్బ‌ర్ కారిడార్ల‌లో చాలా లోక‌ల్ ట్రైన్ స‌ర్వీసులు ర‌ద్ద‌య్యాయి. ట్రాక్స్‌పై నీరు నిల‌వ‌డంతో కొన్ని లోక‌ల్ ట్రైన్స్‌ చాలా నెమ్మ‌దిగా వెళ్తున్నాయి. ప‌న్వేల్‌, ఖండేశ్వ‌ర్, మాన‌స్‌స‌రోవ‌ర్ స్టేష‌న్ల వ‌ద్ద స‌బ్‌వేలు నీట మునిగాయి. వ‌ర‌ద ప్ర‌భావం ఎక్కువ‌గా ఉన్న రూట్ల‌లో లోకల్ బ‌స్సులను కూడా నిలిపేశారు. ముఖ్యంగా సియ‌న్‌, చెంబూరు, బాంద్రా, ఎయిర్ ఇండియా కాల‌నీ, కుర్లాల్లో వ‌ర‌ద పరిస్థితి తీవ్రంగా ఉంది.

95.81 మిమీల వ‌ర్ష‌పాతం

మంగ‌ళ‌వారం ఉద‌యం 8 గంట‌ల గ‌ణాంకాల ప్ర‌కారం, అంతకుముందు 24 గంట‌ల్లో స‌గ‌టున 95.81 మిమీల వ‌ర్ష‌పాతం న‌మోదైంది. ముంబై తూర్పు శివారులో 115.09మిమీ, ముంబై ప‌శ్చిమ శివారులో 116.73మిమీల వ‌ర్ష‌పాతం న‌మోదైంది. ముంబైలో మంగ‌ళ‌వారం ఉద‌యం 8 గంట‌ల నుంచి 11.30 గంట‌ల మ‌ధ్య స‌గ‌టున‌41 మిమీల వ‌ర్షపాతం న‌మోదైంది.

మ‌రికొన్ని రోజులు

ముంబైలో మ‌రికొన్ని రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే ప్ర‌మాద‌ముంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. ముంబైకి ఆరెంజ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించింది. జులై 4 నుంచి జులై 8 మ‌ధ్య రాయిగ‌ఢ్‌, రత్న‌గిరి, సింధుదుర్గ్ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు ఉంటాయ‌ని హెచ్చ‌రించింది. ఈ హెచ్చ‌రిక‌ల‌తో రాష్ట్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. స‌హాయ బృందాల‌ను సిద్ధం చేసింది.