తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Video: “రూ.500 ఇచ్చి సభలకు ప్రజలు”: మాజీ సీఎంపై వీడియోతో బీజేపీ ఆరోపణలు

Video: “రూ.500 ఇచ్చి సభలకు ప్రజలు”: మాజీ సీఎంపై వీడియోతో బీజేపీ ఆరోపణలు

03 March 2023, 7:59 IST

    • Siddaramaiah - Viral Video: సభకు ప్రజలను పిలిపించుకునేందుకు కాంగ్రెస్ డబ్బు పంచుతోందని బీజేపీ ఆరోపించింది. కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలకు సంబంధించిన ఓ వీడియోను బీజేపీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య
కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య (HT Photo)

కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య

Siddaramaiah - Viral Video: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య (Siddaramaiah) కు సంబంధించిన ఓ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. ప్రజలకు చెరో రూ.500 ఇచ్చి పార్టీ సభలకు తీసుకురావాలని నాయకులతో సిద్ధరామయ్య చెబుతున్నట్టు ఆ వీడియోలో ఉంది. ఈ వీడియో లీకై సోషల్ మీడియాలోకి రావటంతో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై కర్ణాటకలో రాజకీయ దుమారం మొదలైంది. అధికార భారతీయ జనతా పార్టీ (BJP) .. ఈ వీడియోను పోస్ట్ చేసి విమర్శలు చేసింది. దీనికి కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు.

Siddaramaiah - Viral Video: ఈ వీడియో ఎప్పటిదో అన్న విషయంపై పూర్తి స్పష్టత లేదు. అయితే ఇటీవల బెళగావిలో సిద్దరామయ్య నిర్వహించిన ప్రజా ధ్వని బస్సు యాత్రలో ఇది జరిగినట్టు తెలుస్తోంది. ఈ వీడియోలో సిద్ధరామయ్యతో పాటు కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సతీశ్ జర్కిహోలీ, ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బల్కర్, ఎమ్మెల్సీ చెన్నరాజ్ హత్తిహోలీతో పాటు మరికొందరు ఉన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది మేలోగా జరగనున్న నేపథ్యంలో.. ఇప్పటికే కాంగ్రెస్ బస్సు యాత్ర చేస్తోంది.

ఇక ఈ వీడియోను బీజేపీ అస్త్రంగా చేసుకుంది. డబ్బులు ఇచ్చి కాంగ్రెస్ నేతలు జనాలను పిలిపించుకుంటున్నారని.. కర్ణాటక బీజేపీ ఆరోపించింది. ఈ వీడియోను పాటు ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ధనం పంచి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించింది.

మాకు ఆ అవసరం లేదు

Siddaramaiah - Viral Video: ఈ వీడియో, బీజేపీ ఆరోపణలపై కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ స్పందించారు. అది వాస్తవం కాదని అన్నారు. “ఇది నిజం కాదు. మేం ఎవరినీ ఆ విధంగా ప్రోత్సహించడం లేదు. మేం ఎవరికీ డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాంటి పనులు మేం చేయం” అని శివకుమార్ అన్నారు.

“ఆశ్చర్యమేం లేదు”

ఈ వీడియోపై కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై కూడా స్పందించారు. “ప్రజలను రప్పించుకునేందుకు డబ్బులు పంచడం కాంగ్రెస్ సంప్రదాయం. ఇందులో కొత్తేం లేదు. ఆశ్చర్యపోయేందుకు ఏం లేదు. అది వారి సంప్రదాయం, ఈ విషయం ప్రజలకు కూడా తెలుసు. కాంగ్రెస్ ఇలాంటి పనులకు పాల్పడుతూనే ఉంటుంది.. కాకపోతే ఇప్పుడు బయటికి వచ్చింది” అని బొమ్మై అన్నారు.

Karnataka Assembly elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది మే నెలలోగా జరగాల్సి ఉంది. రాష్ట్రంలోని 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక జరగనుంది. బీజేపీ అధికారం నిలుపుకునేందుకు పట్టుదలగా ఉంది. మళ్లీ పవర్‌లోకి రావాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే బీజేపీ అగ్రనాయకత్వం కర్ణాటకపై ఫోకస్ చేసింది. ప్రచారం కూడా మొదలైపోయింది.