తెలుగు న్యూస్  /  National International  /  Infosys Ceo Salil Parekh Gets 88 Pc Jump In Salary To <Span Class='webrupee'>₹</span>79.75 Crore

ఇన్ఫోసిస్ సీఈఓ వేత‌నం ఎంతో తెలుసా?

HT Telugu Desk HT Telugu

26 May 2022, 18:58 IST

  • టెక్నాల‌జీ దిగ్గ‌జ సంస్థ ఇన్ఫోసిస్ సీఈఓ వేత‌నం భారీగా పెరిగింది. ఇన్ఫోసిస్ సీఈఓ స‌లిల్ ప‌రేఖ్ ప్ర‌స్తుత వార్షిక‌ వేత‌నం రూ. 42 కోట్లు కాగా, అది తాజా పెంపుతో రూ. 79.75 కోట్ల‌కు పెరిగింది. అంటే, దాదాపు 88% హైక్‌.

ఇన్ఫోసిస్ సీఈఓ స‌లిల్ ప‌రేఖ్
ఇన్ఫోసిస్ సీఈఓ స‌లిల్ ప‌రేఖ్

ఇన్ఫోసిస్ సీఈఓ స‌లిల్ ప‌రేఖ్

భార‌త దిగ్గ‌జ ఐటీ సంస్థ‌ల్లో ఇన్ఫోసిస్ ఒక‌టి. ప్ర‌స్తుతం ఈ సంస్థ సీఈఓగా స‌లిల్ ప‌రేఖ్ ఉన్నారు. తాజాగా ఆయ‌న వేత‌నాన్ని భారీగా పెంచుతూ సంస్థ నిర్ణ‌యం తీసుకుంది. ఆయ‌న వార్షిక వేత‌నాన్ని 88% పెంపుతో రూ. 42 కోట్ల నుంచి రూ. 79.75 కోట్ల‌కు చేర్చింది. తాజా పెంపుతో అత్య‌ధిక వేత‌నం తీసుకుంటున్న సీఈఓల జాబితాలో స‌లిల్ ప‌రేఖ్ కూడా చేరారు. సంస్థ షేర్ హోల్డ‌ర్ల ఆమోదంతో జూలై 2 నుంచి ఈ హైక్ అమ‌ల్లోకి రానుంది. కంపెనీ వార్షిక నివేదిక‌లో గురువారం ఈ విష‌యాన్ని ఇన్ఫోసిస్ వెల్ల‌డించింది.

నో శాల‌రీ టు నంద‌న్ నీలేక‌ని

కాగా, ఇన్ఫోసిస్ సంస్థ‌ను మాజీ చైర్మ‌న్ నారాయ‌ణ మూర్తి, ప్ర‌స్తుత చైర్మ‌న్ నంద‌న్ నీలేక‌ని క‌లిసి స్థాపించిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం చైర్మ‌న్‌గా ఉన్న నంద‌న్ నీలేక‌ని త‌ను సంస్థ‌కు అందిస్తున్న సేవ‌ల‌కు వేత‌నం స‌హా ఎలాంటి ప్ర‌తిఫ‌లం తీసుకోకూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇన్ఫోసిస్‌లో సీఈఓకు ఈ స్థాయిలో, అసాధార‌ణ వేత‌న పెంపు గ‌తంలో ఎప్పుడూ లేదు. మ‌ధ్య‌త‌ర‌గ‌తి మూలాలున్న సంస్థ వ్య‌వ‌స్థాప‌కులైన నారాయ‌ణ మూర్తి, నంద‌న్ నీలేక‌ని సాధార‌ణ మొత్తాల‌నే వేత‌నాలుగా తీసుకున్నారు. స‌లిల్ ప‌రేఖ్‌ను మ‌రో ఐదేళ్ల పాటు ఎండీ, సీఈఓ గా కొన‌సాగించాల‌ని ఇటీవ‌ల ఇన్ఫోసిస్ నిర్ణ‌యం తీసుకుంది. ఆ త‌రువాత‌, ఈ వేత‌న పెంపు నిర్ణ‌యం తీసుకుంది. కంపెనీ సామ‌ర్ధ్య పెంపులో ప‌రేఖ్ పాత్ర చాలా ఉంద‌ని సంస్థ సీనియ‌ర్ ఉద్యోగులు చెబుతున్నారు.

877 రెట్లు ఎక్కువ‌

ఇన్ఫోసిస్ సాధార‌ణ ఉద్యోగి స‌గ‌టు వేత‌నంతో పోలిస్తే సీఈఓ కొత్త వేత‌నం చాలా ఎక్కువ‌. స్టాక్స్ తో పాటు వేత‌నం తీసుకునే ఉద్యోగుల క‌న్నా 872 రెట్లు ఎక్కువ కాగా, స్టాక్స్ తో కాకుండా వేత‌నం తీసుకునే ఉద్యోగుల క‌న్నా 229 రెట్లు ఎక్కువ‌. `ఇత‌ర ఉద్యోగుల‌ను వ‌దిలేసి,కేవ‌లం సీఈఓల‌కే జీతాలను భారీగా పెంచ‌డం మూర్ఖ‌త్వం. సంస్థ‌లో అత్య‌ల్ప‌, అత్య‌ధిక వేత‌న నిష్ప‌త్తి 20 నుంచి 25 మ‌ధ్య‌లోనే ఉండాలి` అని గ‌తంలో సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు నారాయ‌ణ మూర్తి ఒక మేగ‌జీన్‌కు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. ఇటీవ‌లి కాలంలో ఐటీ సంస్థ‌ల సీఈఓల వేత‌నాలు భారీగా పెరుగుతుండ‌గా, స‌గ‌టు ఐటీ ఉద్యోగి వేత‌నం ఆశించిన స్థాయిలో పెర‌గ‌డం లేదు.

ఎందుకంత జీతం?

సంస్థ సాధించిన విజ‌యాలు, సంస్థ సామ‌ర్ధ్య పెంపు, సంస్థ ఆర్థిక ప‌ర‌పుష్టి, సంస్థ ప‌నితీరు, షేర్ హోల్డ‌ర్ రిట‌ర్న్ మొద‌లైన వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ వేత‌న పెంపు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఇన్ఫోసిస్ వివ‌రించింది. సీఈఓ స‌లిల్ ప‌రేఖ్ నాయ‌క‌త్వంలో ఇన్ఫోసిస్‌ టోట‌ల్ షేర్ హోల్డ‌ర్ రిట‌ర్న్ 314% పెరిగింది. ఆదాయం 2018 ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ. 70, 522 కోట్లు ఉండ‌గా, అది 2022ఆర్థిక సంవ‌త్స‌రానికి రూ. 1,21, 641 కోట్ల‌కు చేరింది. అదే కాలంలో, లాభాలు రూ. 16,029 కోట్ల నుంచి రూ. 22,110 కోట్ల‌కు పెరిగాయి` అని సంస్థ వివ‌రించింది.

టాపిక్