తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Housing Prices Rise: జూన్ క్వార్టర్‌లో 15 శాతం పెరిగిన ఇళ్ల ధరలు

Housing prices rise: జూన్ క్వార్టర్‌లో 15 శాతం పెరిగిన ఇళ్ల ధరలు

HT Telugu Desk HT Telugu

27 July 2022, 15:32 IST

  • Housing prices rise: జూన్‌తో ముగిసిన క్వార్టర్‌లో దేశవ్యాప్తంగా 9 మేజర్ నగరాల్లో ఇళ్ల ధరలు 15 శాతం పెరిగాయని ప్రాప్‌ఈక్విటీ డేటా అనలిటిక్స్ సంస్థ తెలిపింది.

Housing sales: 15 శాతం పెరిగిన ఇళ్ల ధరలు
Housing sales: 15 శాతం పెరిగిన ఇళ్ల ధరలు (HT_PRINT)

Housing sales: 15 శాతం పెరిగిన ఇళ్ల ధరలు

న్యూఢిల్లీ, జూలై 27: ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో 9 ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు 15 శాతం వరకు పెరిగాయని డేటా అనలిటిక్ సంస్థ ప్రాప్ ఈక్విటీ వెల్లడించింది.

చెన్నైలో సగటు ధర చదరపు అడుగుకు గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 5,855 ఉండగా.. ఇప్పుడది 15 శాతం పెరిగి రూ. 6,744గా ఉందని తెలిపింది.

గురుగ్రామ్‌లో సగటున చదరపు అడుగు ధర రూ. 10,315 నుంచి 12 శాతం పెరిగి రూ. 11,517కు చేరిందని తెలిపింది.

హైదరాబాద్‌లొ కూడా సగటున చదరపు అడుగు ధర 12 శాతం పెరిగి రూ. 5,764 నుంచి రూ. 6,472కి చేరిందని వివరించింది.

ఇక నోయిడాలో సగటు ధర 9 శాతం పెరిగి రూ. 7,411కు చేరింది. అంతకుముందు ఏడాది ఇదే క్వార్టర్‌లో ఈ ధర రూ. 6,719గా ఉంది.

బెంగళూరులో ఇళ్ల ధరలు 8 శాతం పెరిగాయి. రూ. 5,760 నుంచి రూ. 6,196కు పెరిగాయి. ఇక ముంబై, థానే, పూణే నగరాల్లో ఇళ్ల ధరలు 3 శాతం పెరిగాయి.

ముంబైలో రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ ధరలు చదరపు అడుగుకు రూ. 18,295 నుంచి రూ. 18,896కు పెరిగాయి. థానేలో రూ. 6,125 నుంచి రూ. 6,325కు పెరిగాయి.

పూణేలో కూడా ఇళ్ల ధరలు చదరపు అడుగుకు రూ. 5,189 నుంచి రూ. 5,348కి పెరిగాయి.

కోల్‌కతాలో ఇళ్ల ధరలు 1 శాతం పెరిగాయి. గత ఏడాది తొలి త్రైమాసికంలో రూ. 5,355గా ఉన్న ధర ప్రస్తుతం రూ. 5,431కి పెరిగింది.

ఏడాది కాలంగా అమ్మకాలు, ధరల పెరగుదల విషయంలో రెసిడెన్షియల్ మార్కెట్ స్థిరమైన వృద్ధిని కనబరుస్తోందని ప్రాప్ ఈక్విటీ ఎండీ సమీర్ జసూజ తెలిపారు.

జూన్‌తో ముగిసిన క్వార్టర్‌లో గత ఏడాదితో పోలిస్తే హౌజింగ్ సేల్స్ 96 శాతం పెరిగి 93,153కు చేరుకున్నాయని గణాంకాలు వెల్లడించాయి. అయితే క్రితం క్వార్టర్‌తో పోలిస్తే అమ్మకాలు 7 శాతం పడిపోయాయి.

ఏప్రిల్-జూన్ కాలంలో 9 నగరాల్లో కొత్తగా 69,813 ఫ్లాట్లు లాంఛ్ అయ్యాయి. అంటే శంకుస్థాపనల్లో 51 శాతం వృద్ధి కనిపించింది. కానీ క్రితం క్వార్టర్‌తో పోలిస్తే 24 శాతం పడిపోయింది.

జూన్ త్రైమాసికంలో అమ్ముడుపోని హౌసింగ్ ఇన్వెంటరీ వార్షికంగా 11 శాతం తగ్గి 4,05,586 యూనిట్లకు చేరుకుంది. అంతకు ముందు త్రైమాసికంతో పోలిస్తే 5 శాతం పతనమైంది.

ప్రాప్‌ఈక్విటీ డేటా ప్రకారం జూన్ త్రైమాసికంలో థానేలో హౌసింగ్ అమ్మకాలు రెండింతలు పెరిగి 22,966 యూనిట్లకు చేరుకున్నాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంలో 10,878 యూనిట్లు ఉన్నాయి.

పూణేలో గృహాల విక్రయాలు 10,829 యూనిట్ల నుంచి 21,927 యూనిట్లకు రెట్టింపు అయ్యాయి. ముంబైలో అమ్మకాలు 5,929 యూనిట్ల నుంచి 98 శాతం పెరిగి 11,733 యూనిట్లకు చేరుకున్నాయి.

హైదరాబాద్ 8,176 యూనిట్ల నుంచి 77 శాతం పెరిగి 14,457 యూనిట్లకు చేరుకున్నాయి. బెంగళూరు 6,088 యూనిట్ల నుంచి 119 శాతం పెరిగి 13,324 యూనిట్లకు చేరుకుంది. చెన్నైలో అపార్ట్‌మెంట్ల విక్రయాలు 45 శాతం పెరిగి 2,374 యూనిట్ల నుంచి 3,453 యూనిట్లకు చేరుకున్నాయి. కోల్‌కతా అమ్మకాలు 56 శాతం వృద్ధితో 1,988 యూనిట్ల నుంచి 3,103 యూనిట్లకు చేరుకున్నాయి.

గురుగ్రామ్‌లో 57 శాతం పెరిగి 769 యూనిట్ల నుంచి 1,205 యూనిట్లకు చేరుకోగా, నోయిడాలో గతేడాది ఏప్రిల్‌-జూన్‌లో 539 యూనిట్ల నుంచి 87 శాతం వృద్ధితో ప్రస్తుతం 1,010 యూనిట్లకు చేరిందని గణాంకాలు చెబుతున్నాయి.