తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Jama Masjid Bans Entry Of 'Girls': ‘‘జామా మసీదులోకి అమ్మాయిలకు ప్రవేశంలేదు’’

Jama Masjid bans entry of 'girls': ‘‘జామా మసీదులోకి అమ్మాయిలకు ప్రవేశంలేదు’’

HT Telugu Desk HT Telugu

24 November 2022, 19:47 IST

  • Jama Masjid bans entry of 'girls': ఢిల్లీలోని జామా మసీదు తాజాగా జారీ చేసిన నిషేధాజ్ఞలు వివాదాస్పదమయ్యాయి. మసీదులోకి యువతులకు ప్రవేశం లేదని మసీదు కమిటీ నిషేధం విధించింది.

ఢిల్లీలోని జామా మసీదు
ఢిల్లీలోని జామా మసీదు

ఢిల్లీలోని జామా మసీదు

Jama Masjid bans entry of 'girls': ఢిల్లీలోని జామా మసీదులోకి యువతులకు ప్రవేశం లేదంటూ మసీదు కమిటీ ఇచ్చిన నిషేధాజ్ఞలు వివాదాస్పదమయ్యాయి. యువతులు ఒంటరిగా వచ్చినా, గుంపుగా వచ్చినా, వారిని లోపలికి అనుమతించబోమని మసీదు గేట్లకు నోటీసులు అంటించారు. ఈ ఆదేశాలు మహిళలను అవమానించే, వారిపై వివక్ష చూపేవిగా ఉన్నాయని మహిళా సంఘాలు, పలు రాజకీయ పార్టీలు విమర్శించాయి.

Jama Masjid bans entry of 'girls': తప్పులు చేస్తున్నారు

తమ ఆదేశాలు వివాదాస్పదం కావడంతో మసీదు కమిటీ వివరణ ఇచ్చింది. మసీదు ప్రార్థనా స్థలమని, మసీదులోకి వచ్చేవారు ప్రార్థన కోసమే వచ్చే వారై ఉండాలని స్పష్టం చేసింది. ఇటీవల పలువురు యువతులు యువకుల కోసం ఇక్కడ ఎదురుచూడడం, వారితో సెల్ఫీలు తీసుకోవడం, అనైతిక చర్యలకు పాల్పడడం వంటివి జరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ వివరించారు. ప్రార్థన కోసం వచ్చే వారిని, వారు ఒంటరిగా వచ్చినా, బృందంగా వచ్చినా, కచ్చితంగా లోపలికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. 17వ శతాబ్దం నాటి ఈ జామా మసీదు కేవలం పర్యాటక ప్రదేశం కాదని, ప్రార్థనా స్థలమని తేల్చి చెప్పారు. దేశ సంస్కృతిక వారసత్వ సంపదలో అనైతిక చర్యలను అనుమతించబోమన్నారు. మసీదు అయినా, గుడి అయినా, చర్చి అయినా ప్రార్థనా స్థలాలేనని, ప్రార్థన చేయడం కోసం వచ్చేవారిని, ఎవరైనా సరే అడ్డుకోబోమని వివరించారు.

Jama Masjid bans entry of 'girls': మహిళా హక్కుల ఉల్లంఘన

ఈ ఆదేశాలు మహిళల హక్కుల ఉల్లంఘనేనని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మాలివల్ విమర్శించారు. ఈ విషయాన్ని సుమోటాగా తీసుకుని మసీదు కమిటీకి నోటీసులు జారీ చేస్తున్నామని వెల్లడించారు. ఇది ఇరాక్ కాదని, రాజ్యాంగానికి అందరూ లోబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. వీడియో షూటింగ్ లను కూడా గతంలో మసీదు ప్రాంగణంలో నిషేధించారు.