తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Asaduddin Owaisi | నేనేం నేరం చేశాను?

Asaduddin Owaisi | నేనేం నేరం చేశాను?

HT Telugu Desk HT Telugu

09 June 2022, 19:29 IST

  • ప‌విత్ర దేవ‌తామూర్తుల‌పై అభ్యంత‌రక‌ర వ్యాఖ్య‌ల వివాదం రోజురోజుకీ ముదురుతోంది. మొహ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన బీజేపీ మాజీ నేత‌లు నుపుర్ శ‌ర్మ‌పై ఢిల్లీ పోలీసులు కేసు న‌మోదు చేశారు. అలాగే, మ‌త విద్వేషాల‌ను రెచ్చ‌గొట్టేలా వ్యాఖ్య‌లు చేశార‌ని ఎంఐఎం చీఫ్ అస‌దుద్దీన్ ఓవైసీపై కూడా కేసు న‌మోదు చేశారు.

అస‌దుద్దీన్ ఓవైసీ
అస‌దుద్దీన్ ఓవైసీ

అస‌దుద్దీన్ ఓవైసీ

త‌న‌పై ఢిల్లీ పోలీసులు కేసు న‌మోదు చేయ‌డంపై అస‌దుద్దీన్ ఓవైసీ స్పందించారు. తాను చేసిన నేరం ఏంటో ఎఫ్ఐఆర్‌లో స్ప‌ష్టంగా పేర్కొన‌లేద‌న్నారు. బీజేపీని వ్య‌తిరేకిస్తున్న‌వారిపై కావాల‌నే కేసుసు పెడ్తున్నారని పోలీసుల‌పై మండిప‌డ్డారు.

9 మందిపై..

మొహ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై అనుచిత వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో విద్వేషాల‌ను రెచ్చ‌గొడ్తున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై బీజేపీ మాజీ నేత‌లు నుపుర్ శ‌ర్మ, న‌వీన్ జిందాల్‌ స‌హా 9 మందిపై ఢిల్లీలో పోలీసులు కేసు న‌మోదు చేశారు. వారిలో ఎంఐఎం చీఫ్ అస‌దుద్దీన్ ఓవైసీ కూడా ఉన్నారు. వీరు కాకుండా జ‌ర్న‌లిస్ట్ స‌బా న‌ఖ్వీ, మౌలానా ముఫ్తీ న‌దీమ్‌, అబ్దుర్ ర‌హ్మాన్‌, గుల్జార్ అన్సారీ, అనిల్‌కుమార్ మీనాల‌పై కూడా ఎఫ్ఐఆర్ న‌మోదైంది. ఢిల్లీ స్పెష‌ల్ బ్రాంచ్‌లోని `ఇంట‌లిజెన్స్ ఫ్యూజ‌న్ అండ్ స్ట్రాటెజిక్ ఆప‌రేష‌న్స్‌` విభాగం ఈ కేసులు న‌మోదు చేసింది.

పోలీసుల‌కు ధైర్యం లేదు

`నుపుర్ శ‌ర్మ‌,య‌తి, న‌వీన్ జిందాల్‌ల‌పై కేసులు పెట్టే ధైర్యం పోలీసుల‌కు లేదు. అందుకే వారం పాటు ఏ చ‌ర్యా తీసుకోలేదు. హిందుత్వ‌వాదుల‌కు కోపం రాకుండా ఏం చేస్తే బావుంటుందా అని ఇన్ని రోజులు ఆలోచించారు. ఇప్పుడు బాలెన్స్ చేయ‌డం కోసం మాపై కేసులు పెట్టారు` అని అస‌దుద్దీన్ వ్యాఖ్యానించారు. `వారు బ‌హిరంగంగా మొహ‌మ్మ‌ద్ ప్ర‌వక్త‌ను అవ‌మానించారు. వారిని వెంట‌నే అరెస్ట్ చేయ‌కుండా, బీజేపీ మ‌ద్ధ‌తుదారుల‌ను సంతృప్తి ప‌ర్చ‌డం కోసం మాపై కేసులు పెట్టారు` అని మండిప‌డ్డారు. రెండు వైపుల నుంచి విద్వేష వ్యాఖ్య‌లు చోటు చేసుకున్నాయ‌ని ప్ర‌చారం చేయ‌డం కోసం ఈ కేసుల డ్రామా ఆడుతున్నార‌ని ఓవైసీ మండిప‌డ్డారు.

ఎఫ్ఐఆర్‌లో వివ‌రాలే లేవు

త‌న‌పై పెట్టిన కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌ను ప‌రిశీలించాన‌ని ఓవైసీ తెలిపారు. అందులో తాను చేసిన నేర‌మేమిటో స్ప‌ష్టంగా పేర్కొన‌లేద‌ని వివ‌రించారు. అయినా, దీనిపై మా న్యాయ‌వాదులు స్పందిస్తార‌న్నారు. ఇలాంటి బెదిరింపుల‌కు భ‌య‌ప‌డేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. విద్వేష వ్యాఖ్య‌ల‌ను వ్య‌తిరేకించ‌డాన్ని, విద్వేష వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని ఒకేలా తీసుకోకూడ‌ద‌ని సూచించారు.