World Health Day 2023 | ఆహరమే దివ్యౌషధం.. మీ ఆరోగ్యం కోసం రోజూ ఇలాంటి ఆహారాలు తీసుకోండి!
07 April 2023, 8:48 IST
- World Health Day 2023: ఆహారంలోనే ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి మీరు తినే ఆహారమే మిమ్మల్ని రోగాల నుంచి కాపాడుతుంది. మీ ఆరోగ్యం కోసం రోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇక్కడ చూడండి.
World Health Day 2023:- Healthy Foods
World Health Day 2023: ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ప్రతీ ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటారు. 1948లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటైంది కూడా ఈరోజే. అప్పట్నించీ ఈరోజును ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా పాటిస్తున్నారు. 2023లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తన 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేస్తున్న వివిధ అనారోగ్యాలపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం, అందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రతీఏటా ఏప్రిల్ 7న ఆరోగ్య దినోత్సవంగా జరుపుతున్నారు. "అందరికీ ఆరోగ్యం" అనేది ఈ సంవత్సరం థీమ్.
మనందరికీ తెలుసు మనం ఆరోగ్యంలో ప్రధాన పాత్ర పోషించేది ఆహారం. మనం తినే ఆహారమే ఔషధం. ఎందుకంటే, ఆహారంలోనే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ వంటి అన్ని రకాల పోషకాలు ఉంటాయి. ప్రతిరోజూ సరైన, సమతుల్యమైన ఆహారం తీసుకుంటే ఏ రోగాలు దరిచేరవు. చికిత్స కంటే నివారణ మేలు అని గ్రహించాలి. మన ఆరోగ్యం గురించి మనకే శ్రద్ధ ఉండాలి.
Foods For Health- ఆరోగ్యానికి సరైన ఆహారాలు
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా, మిమ్మల్ని మీరు ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రతిరోజూ ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
తాజా పండ్లు, కూరగాయలు
మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, సీజన్ కు తగినట్లుగా లభించే వివిధ రకాల పండ్లు, కూరగాయలను ఆహారంగా తీసుకోవడం చాలా ముఖ్యం. విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉండే పాలకూర, మెంతికూర, కాలే వంటి ఆకు కూరలు. అరటిపండ్లు, నారింజలు, ఆపిల్స్, బెర్రీ ఫ్రూట్స్, ద్రాక్షపండ్లు వంటి పండ్లను తింటూ ఉండాలి.
తృణధాన్యాలు
కేవలం అన్నం మాత్రమే తింటే ప్రయోజనం ఉండదు. ప్రోటీన్లు, ఫైబర్ ఇతర పోషకాలు పుష్కలంగా ఉండే తృణధాన్యాలను ప్రతిరోజూ ఆహారంగా తీసుకోవాలి. ఇందులో భాగంగా గోధుమలు, వోట్స్, బ్రౌన్ రైస్ వంటివి మీకు మంచి శక్తిని ఇస్తాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. విటమిన్ బి, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
మాంసకృత్తులు
మాంసకృత్తులు మీ శరీర పెరుగుదలకు, కణజాలాల నిర్మాణానికి అవసరం. కాబట్టి మీ ఆహారంలో చికెన్, చేపలు, బీన్స్, కాయధాన్యాలు టోఫు వంటివి తినండి. వీటిలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. మటన్ వంటి మాంసాల మాదిరిగా కాకుండా లీన్ ప్రోటీన్లలో అనారోగ్యకరమైన సంతృప్త కొవ్వులు ఉండవు.
గింజలు- విత్తనాలు
బాదం, వాల్‌నట్‌లు, చియా గింజలు, అవిసె గింజలు, గుమ్మడికాయ గింజలు మొదలైనవి మీ ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్ , విటమిన్ E, మెగ్నీషియం , సెలీనియం వంటి మీ శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన పోషకాలు నిండుగా ఉంటాయి. వీటిని సరైన పరిమాణంలో తీసుకుంటూ ఉండాలి.
ఆరోగ్యకరమైన కొవ్వులు
ఆలివ్ ఆయిల్, అవకాడో, సాల్మన్ వంటి కొవ్వు చేపలలో లభించే కొవ్వులను ఆరోగ్యకరమైన కొవ్వులుగా పరిగణిస్తారు. వీటన్నింటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఈ కొవ్వులు గుండె ఆరోగ్యానికి , మెదడు పనితీరుకు మేలు చేస్తాయి.
ప్రతిరోజూ ఇలాంటి ఆహారాలను తీసుకుంటూనే మరోవైపు ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర పానీయాలు, సంతృప్త, ట్రాన్స్ ఫ్యాట్‌లకు తగ్గించడం ముఖ్యం. ఇదే కాకుండా ప్రతిరోజూ సరిపడా నీరు తాగడం, క్రమం తప్పని వ్యాయామం, ఒత్తిడిని నియంత్రించడం, తగినంత నిద్రపోవడం వంటివి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.