Cooking Tips । కూరలో నూనె ఎక్కువైతే, ఇలా సరిచేయండి!
09 April 2023, 19:21 IST
- Cooking Tips: ఇష్టంగా ఏదైనా వండుకుంటే అందులో నూనె, ఉప్పులు ఎక్కువైనపుడు అది తినాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇలాంటపుడు సులభంగా ఇలాంటి చిట్కాలు పాటిస్తే మళ్లీ అంతా సెట్ అవుతుంది.
Tips To Remove Excess Oil From Cooked Food
Cooking Tips: కూరలో నూనె, మసాలాలు వేసినపుడే ఆ వంటకం రుచికరంగా ఉంటుంది. ఘుమఘులాడుతూ మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇవి లేకుండా వండితే ఆ కూర రుచిపచీ లేకుండా చప్పగా ఉంటుంది. అయితే నూనె, మసాలాలు వంటకాల రుచిని ఎలాగైతే మెరుగుపరుస్తాయి, వాటి మోతాదు ఎక్కువైతే అవి రుచిని దెబ్బతీయడమే కాకుండా మీ ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. వంటచేసినపుడు అప్పుడప్పుడూ ఇలాంటి పొరపాట్లు జరగటం సహజం. కానీ, ఎంతో కష్టపడి వండిన వంట చిన్న కారణంగా రుచి కోల్పోతేనో, ప్రశంసలకు బదులు విమర్శలు వస్తే చాలా బాధగా అనిపిస్తుంది.
అయితే కూరలో ఉప్పు ఎక్కువైందని, కారం ఎక్కువైందని లేదా మసాలాలు నూనెలు ఎక్కువయ్యాయని చింతించడం అవసరం లేదు. వాటిని తినకుండా పక్కనపెట్టడం కూడా చేయాల్సిన అవసరం లేదు. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా గతితప్పిన కూరను మళ్లీగా రుచికరంగా మార్చవచ్చు. మీరు ఏదైనా మ్యాజిక్ చేశారా లేక కొత్తగా వండుకొని వచ్చారా అని తిన్నవారు ఆశ్చర్యపోతారు. పెరిగిన రుచిని ఆస్వాదిస్తారు.
Tips Reduce Excess Salt and Salt from Food
వంటల్లో నూనె, ఉప్పు, సుగంధాల డోస్ ఎక్కువైతే, ఎలా సరిచేయాలో ఇప్పుడు తెలుసుకోండి.
బంగాళాదుంపలు కలపండి
మీరు చేసిన కూరలో ఉప్పు లేదా నూనె ఎక్కువ అయితే అందులో బంగాళదుంప ముక్కలను వేసి, బాగా కలిపి ఆపైన మూతపెట్టి కొన్ని నిమిషాలు ఉడికించాలి. ఈ బంగాళాదుంప ముక్కలు మీ కూరలోని అదనపు నూనెను, ఉప్పును గ్రహిస్తాయి దీంతో మసాలా నిష్పత్తి సమానంగా అవుతుంది. టేస్ట్ అదిరిపోతుంది.
టొమాటో ప్యూరీ కలపండి
మీరు చేసిన కూరలో నూనె ఎక్కువైందా? పైకి తేలిన నూనెను తొలగించిన తర్వాత కూడా ఇంకా నూనె అలాగే ఉందా? ఇలాంటి పరిస్థితుల్లో కూరలో కొద్దిగా టొమాటో ప్యూరీ కలిపి ఉడికించాలి. ఈ టొమాటో ప్యూరీ అదనపు నూనెను గ్రహించి కూరలో నూనెను సరిచేస్తుంది. రుచి కూడా పెరుగుతుంది. మీరు డీప్ ఫ్రై కర్రీలకు కూడా టొమాటో ప్యూరీ చిట్కాను ఉపయోగించవచ్చు. డీప్ ఫ్రైలలో నూనె, మసాలాలు ఎక్కువైతే ఆ నూనెను ఒక గిన్నెలో పిండివేయండి. ఆపై ఆ నూనెలో టొమాటో ప్యూరీ వేయించండి. ప్యూరీ ఉడికిన తర్వాత అందులో మిగతా కూరగాయలను వేసి కలపండి, సెట్ అవుతుంది.
శనగపిండి
ఏదైనా ఫ్రై కూరల్లో నూనె ఎక్కువగా ఉంటే, దాని నుంచి నూనెను తొలగించలేకపోతే, శనగపిండిని తేలికగా వేయించి, పైనుంచి కలపండి. ఆపైన ఆ కూరను మంటపై ఉంచి కాసేపు వేడిచేయాలి. ఇప్పుడు ఈ శనగపిండి ఆ కూరలోని అదనపు నూను గ్రహించి కూరగాయలపై పూతగా ఏర్పడుతుంది. ఇది మీ ఫ్రై కూరను మరింత క్రిస్పీగా మార్చుతుంది, రుచిని మరింత పెంచుతుంది.
బ్రెడ్ లేదా టోస్ట్
కూరలో నూనె ఎక్కువైతే పొడిగా కాల్చిన బ్రెడ్ ముక్కలను లేదా టోస్ట్ లను కలపండి. అవసరం అయితే వేడిచేయండి. కూరలోని అదనపు నూనెను బ్రెడ్ గ్రహిస్తుంది, రుచిని సమానంగా ఉంచుతుంది. నూనె గ్రహించిన బ్రెడ్ ముక్కలను తీసేసి కూరను మీ ఆహారంగా తీసుకోవచ్చు.
ఇక, కారం మసాలాలు ఎక్కువైతే నిమ్మరసం, పెరుగు కలుపుకుంటే రుచి సరిపోతుంది.