Savoury French Toast | సమయం లేదు మిత్రమా.. త్వరగా చేసుకునే అల్పాహారమా? ఇదిగో!-quick and easy breakfast here is savory french toast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Quick And Easy Breakfast Here Is Savory French Toast

Savoury French Toast | సమయం లేదు మిత్రమా.. త్వరగా చేసుకునే అల్పాహారమా? ఇదిగో!

HT Telugu Desk HT Telugu
Jun 06, 2022 09:21 AM IST

వారం ప్రారంభమయిందంటే ఉదయం సమయం దొరకడం చాలా కష్టం. కాబట్టి త్వరగా కేవలం 10 నిమిషాల్లో సిద్ధం చేసుకొని ఎప్పుడైనా, ఎక్కడైనా తినగలిగే సేవొరి ఫ్రెంచ్ టోస్ట్ రెసిపీని ఇక్కడ అందించాం.

Savoury French Toast
Savoury French Toast (Pixabay)

సోమవారం వచ్చిందంటే మళ్లీ ఉరుకులు, పరుగుల జీవితం మొదలవుతుంది. ఉదయం నుంచి అన్ని పనులు చేసుకుంటూ స్కూళ్లకు, ఆఫీసులకు, ఇతర పనులకు బయలుదేరడానికి సిద్ధమైపోవాలి. ఈ సమయంలో మనకు చాలా త్వరగా సిద్ధం చేసుకునే అల్పాహారం ఉండాలి. మీరు త్వరగా బ్రేక్ ఫాస్ట్ చేసేయాలనుకుంటే మీకోసం గుడ్డుతో చేసే సేవొరి ఫ్రెంచ్ టోస్ట్ రెసిపీని ఇక్కడ అందిస్తున్నాం. ఇది చిటికెలో కేవలం 10 నిమిషాల్లోనే తయారుచేసుకోవచ్చు. పేరుకు తగినట్లు ఇది ఎంతో రుచికరమైనది, అలాగే ఆరోగ్యకరమైనది కూడా.

ఫ్రెంచ్ టోస్ట్ ను తాజా పండ్లు, వెన్న, జామ్ ఇంకా మాపుల్ సిరప్‌తో కలిపి తీసుకుంటారు. అయితే తీపిని ఇష్టపడని వారికోసం క్లాసిక్ ఫ్రెంచ్ టోస్ట్ కొంచెం సాల్టీగా, నోటికి రుచి తగిలేట్లుగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ సేవోరి ఫ్రెంచ్ టోస్టుకు కావాల్సిన పదార్థాలు ఏమిటి? ఇండియన్ స్టైల్లో ఎలా తయారుచేసుకోవాలి. ఇక్కడ చూడండి..

సేవొరి ఫ్రెంచ్ టోస్ట్ కోసం కావాల్సిన పదార్థాలు

  • 2 బ్రెడ్ ముక్కలు (Whole Wheat)
  • 1 గుడ్డు
  • 2 టేబుల్ స్పూన్లు పాలు
  • 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన కొత్తిమీర
  • 1 పచ్చిమిర్చి సన్నగా తరిగినది
  • 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన ఉల్లిపాయ
  • 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన టమోటా
  • 1/4 టీస్పూన్ పసుపు పొడి
  • 1/4 స్పూన్ ఉప్పు.
  • 1/4 స్పూన్ మిరియాల పొడి
  • 1 స్పూన్ నెయ్యి లేదా వెన్న

తయారీ విధానం

  1. ముందుగా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకొని అందులో గుడ్డు పగలకొట్టి వేయండి. ఆ తర్వాత నెయ్యి మినహా మిగతా అన్ని పదార్థాలు వేసి బాగా కలపండి.
  2. ఇప్పుడు నాన్-స్టిక్ పాన్ వేడి చేసి 1/2 స్పూన్ నెయ్యి లేదా వెన్నతో పైపైన బ్రష్ చేయండి.
  3. ఇప్పుడు బ్రెడ్ ముక్కలను గుడ్డు మిశ్రమంలో ముంచి అన్ని పదార్థాలు బ్రెడ్ కు అంటుకునేలా నిర్ధారించుకోండి. ఈ బ్రెడ్ ను నెయ్యితో వేడిచేసిన పాన్‌పై వేసి కాల్చండి.
  4. బ్రెడ్ క్రిస్పీగా మారి బంగారు గోధుమ రంగు వచ్చేంత వరకు 1-2 నిమిషాలు వేయించాలి.
  5. అంతే! రుచికరమైన సేవొరీ ఫ్రెంచ్ టోస్ట్ రెడీ అయినట్లే. 

సర్వింగ్ ప్లేటులో కొద్దిగా టొమాటో కెచప్ తీసుకొని అందులో అద్దుకొని ఈ టోస్ట్ తింటూ, మరోపక్కగా అల్లం ఛాయ్ తాగుతూ ఉంటే ఫుల్ జోష్ వచ్చే కిక్కుంటుంది. ఈ ఫ్రెంచ్ టోస్ట్ ఉదయమే కాదు బ్రేక్ సమయంలో, సాయంత్రం స్నాక్స్ లాగా కూడా తినొచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్