Tomato Soup | మాన్‌సూన్ స్పెషల్.. రంగు, రుచి, చిక్కదనాల టొమాటో సూప్!-monsoon special soup delicious tomato soup recipe here ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Monsoon Special Soup Delicious Tomato Soup Recipe Here

Tomato Soup | మాన్‌సూన్ స్పెషల్.. రంగు, రుచి, చిక్కదనాల టొమాటో సూప్!

HT Telugu Desk HT Telugu
Jul 21, 2022 05:45 PM IST

మనకు వంటగదిలో అందుబాటులో ఉండే సుగంధ ద్రవ్యాలతో రుచికరంగా టొమాటో సూప్ చేసుకోవచ్చు. ఈ వర్షకాలంలో ఇలాంటి ఒక సూప్ ఎంతో ఆరోగ్యకరం కూడా. రెసిపీ ఇక్కడ ఉంది, ట్రై చేయండి.

Tomato soup
Tomato soup (Unsplash)

ఈ వర్షాకాలంలో ఒకవైపు ధారగా కురుస్తున్న వర్షం, పచ్చని పరిసరాలు, చల్లగా వీస్తున్న పిల్లగాలులు, పన్నీరు చిలరించినట్లుగా ఉండే తుంపరుల నడుమ వేడివేడిగా ఘుమఘుమలాడే ఒక కప్పు సూప్ తాగితే ఎంతో హాయిగా ఉంటుంది. మంచి ఆరోగ్యం మీ సొంతమవుతుంది. మనకు ఎన్నో రకాల సుగంధభరితమైన సూప్ రెసిపీలు అందుబాటులో ఉన్నాయి. అయితే అన్నింటికంటే టోమాటో సూప్ మంచి రంగు, రుచి, చిక్కదనంతోపాటు ఎన్నో పోషకాలతో నిండి ఉంటుంది.

టొమాటో సూప్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి. పొటాషియం, విటమిన్లు C, K, A అధికంగా ఉంటాయి. అంతేకాదు టొమాటోలో అనేక ఆరోగ్య ప్రయోజనాలకు కారణమయ్యే లైకోపీన్‌ అనే సమ్మేళనం ఉంటుంది. మరి ఇంకా ఎందుకు ఆలస్యం? రుచికరంగా టొమాటో సూప్ ఎలా చేసుకోవాలో ఈ రెసిపీ చూసి తెలుసుకోండి.

కావాల్సిన పదార్థాలు

  • 250 గ్రాముల టొమాటోలు
  • 100 గ్రాముల కొత్తిమీర
  • 1 టీస్పూన్ వెన్న లేదా నెయ్యి
  • 1 టీస్పూన్ నూనె
  • 3 వెల్లులి రెబ్బలు
  • ½ టీస్పూన్ కారం
  • 2 పచ్చిమిర్చి
  • ½ అంగుళం అల్లం
  • ½ అంగుళం దాల్చిన చెక్క
  • 2 యాలకులు
  • 2 లవంగాలు
  • టీస్పూన్ మిరియాలు
  • 1 బిరియాని ఆకు
  • 1 టీస్పూన్ గోధుమ పిండి
  • 500 మి.లీ. నీరు
  • ఉప్పు తగినంత

తయారీ విధానం

  1. ముందుగా ఒక గిన్నెలో అర టీస్పూన్ వెన్న లేదా నెయ్యి వేడి చేయాలి. అలాగే 1 టీస్పూన్ నూనె కూడా వేడి చేయాలి.
  2. అనంతరం వేడయ్యాక అందులో తురిమిన వెల్లుల్లి, తురిమిన అల్లం వేసి దోరగా వేయించాలి.
  3. ఆపైన దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, బిరియాని ఆకు, మిరియాలు వేసి వాసన వెదజల్లే వరకు వేపుకోవాలి.
  4. ఇప్పుడు ఇందులోనే ఒక టీస్పూన్ గోధుమ పిండి వేసుకొని అన్నింటితో బాగా కలిపేయాలి.
  5. ఇప్పుడు టొమాటో ముక్కలు వేసి ఒక 3 నిమిషాలు సన్నని మంటమీద ఉడికించాలి.
  6. ఇప్పుడు తాజా కొత్తిమీరను కాడలతో పాటుగా వేసి, అర టీస్పూన్ కారం, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలిపుకోవాలి.
  7. టోమాటో కూరలాగా ఉడికిన తర్వాత, నీరు పోసి మరిగించాలి.
  8. చివరగా, ఒక ఫిల్టర్ సహాయంతో సూప్ ను వడకట్టాలి.

అంతే, రుచికరమైన టొమాటో సూప్ సిద్ధమైనట్లే. దీనిని సర్వింగ్ కప్పుల్లోకి తీసుకొని వేడివేడిగా తాగండి. కావాలనుకుంటే వెన్నలో రోస్ట్ చేసిన బ్రెడ్ ముక్కలు కూడా పైనుంచి కలుపుకోవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్