Baby Potato Roast । మామూలు ఆలుగడ్డలకు, చిన్న ఆలుగడ్డలకు తేడా అదే, బేబీ పొటాటో రోస్ట్ ఇదే!
Baby Potato Roast Recipe: మామూలు బంగాళాదుంపలకు, బేబీ పొటాటోలకు తేడా ఏమి? చిన్న బంగాళాదుంపలతో చేసే చెట్టినాడ్ బేబీ పొటాటో రోస్ట్ రెసిపీ ఇక్కడ చూడండి.
మీరు కూరగాయల సంతకు లేదా సూపర్ మార్కెట్ కు వెళ్లినపుడు మీకు బంగాళాదుంపలతో పాటు చిన్న సైజులో ఉండే బేబీ పోటాటోలు కూడా కనిపిస్తాయి. సాధారణంగా బంగాళదుంపలతో చేసే చాలా వంటకాలు ఎంతో రుచిగా ఉంటాయి, మీరు తరచూ తింటూ ఉంటారు కూడా. అయితే అయితే చిన్న సైజు బంగాళాదుంపలతో వండే వంటకాలు చాలా తక్కువ మందికి తెలుసు. కానీ ఇవి కూడా చాలా రుచిగా ఉంటాయి.
బేబీ బంగాళాదుంపలు అనేవి హైబ్రిడ్ రకం అనుకుంటే పొరపాటే, ఇవి కూడా అదే రకం బంగాళాదుంపలే, అయితే పూర్తిగా ఎదగడానికి ముందే వీటిని నేల నుండి సేకరిస్తారు. అందువల్ల వీటి పరిమాణం చిన్నగా ఉంటుంది. ఈ బేబీ పొటాటోలు తియ్యని రుచిని కలిగి ఉంటాయి, మరింత క్రీమీగా ఉంటాయి. వీటిలో పిండిపదార్థాలు చక్కెర స్థాయిలు తక్కువగా ఉండటం మూలనా, అధిక బరువుకు కారణం కావు.
ఈ బేబీ పొటాటోలతో చెట్టినాడ్ మసాలా కలిపి రోస్ట్ చేసుకుంటే దాని రుచి అదరహో అనేలా ఉంటుంది. బేబీ పొటాటో రోస్ట్ రెసిపీ ఈ కింద ఉంది చూడండి.
Baby Potato Roast Curry Recipe కోసం కావలసినవి
- 1/2 కిలో చిన్న బంగాళదుంపలు
- 1 స్పూన్ చెట్టినాడు మసాలా
- 2 టేబుల్ స్పూన్లు నూనె
- 4 ఉల్లిపాయలు
- 3 టమోటాలు
- 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
- 3 పచ్చిమిర్చి
- 5-6 కరివేపాకు
- 1/4 టీస్పూన్ పసుపు పొడి
- 2 స్పూన్ల కారం
- 2 స్పూన్ల ధనియాల పొడి
- 1/2 కప్పు నీరు
- కొత్తిమీర ఆకులు
- రుచికి తగినంత ఉప్పు
బేబీ పొటాటో రోస్ట్ తయారీ విధానం
- ముందుగా బేబీ పొటాటోలను ఉడకబెట్టి, ఆపై వాటి చర్మం ఒలిచి ఒక పక్కన పెట్టండి.
- చెట్టినాడు మసాలా తీసుకోండి, దీనిని ఎలా చేయాలంటే.. కొబ్బరి తురుము, ఎర్ర మిరపకాయలు, ధనియాలు అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, ఏలకులు, లవంగాలు, స్టార్ సోంపు , నల్ల మిరియాలు, కరివేపాకు, పసుపు పొడి అన్ని కలిపి దోరగా పెనంపై వేయించాలి. ఆపై మెత్తని పేస్టుగా గ్రైండ్ చేసుకోవాలి, చెట్టినాడు మసాలా సిద్ధమవుతుంది.
- ఇప్పుడు పాన్‌లో నూనె వేడి చేసి, ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
- ఆపై టొమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు పొడి, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపండి. కొన్ని నీళ్ళు పోసి, పేస్ట్ చిక్కబడే వరకు ఉడికించండి.
- తరువాత అందులో ఉడికించిన బంగాళదుంపలు, చెట్టినాడు మసాలా వేయండి, అది పొడిగా మారే వరకు 3-4 నిమిషాలు ఉడికించాలి.
చివరగా కొత్తిమీర ఆకులతో గార్నిష్ చేయండి. చెట్టినాడ్ బేబీ పోటాటో రోస్ట్ కర్రీ రెడీ అయినట్లే. అన్నం లేదా చపాతీలతో వేడివేడిగా కుమ్మేయండి.
సంబంధిత కథనం