Purple Tomato | ఇవి వంకాయలు కాదు నీలిరంగులో ఉన్న టమోటాలు.. పోషకాలు ఎన్నో!
టొమాటోలు ఎర్రగా ఉంటాయి. కానీ ఈ చిత్రంలో చూస్తే నీలిరంగులో ఉన్నాయి. వీటిని వంకాయలు అనుకుంటున్నారా? అయితే మీరు వంకాయ మీద కాలేసినట్లే ఎందుకంటే ఇవి ఊదా రంగు (Purple Tomato) టమోటాలు.
టొమాటో అంటే చాలా మందికి ఇష్టం. ఎర్రగా రసాలూరే ఈ పండును కూరగా వండుకోవచ్చు, ఏ వంటకంలో వేసినా దాని రుచి మరింత పెరుగుతుంది. సాధారణంగా టొమాటోలు ఎరుపు రంగులో ఉంటాయి. కాయగా ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. అయితే మీరెపుడైనా నిగనిగలాడే నీలి రంగు టొమాటోలను (Purple Tomato) చూశారా? ఇవి చూడటానికి అచ్ఛం వంకాయలలాగా ఉంటాయి. పర్పుల్ టొమాటోలను చూసిన వారెవరైనా అవి వంకాయలనే భ్రమపడతారు. కానీ ఇవి కూడా ఒక రకం టొమాటాలే.
ఈ సరికొత్త హైబ్రిడ్ టొమాటోలను యూరోపియన్ శాస్త్రవేత్తలు జన్యుపరమైన మార్పులు చేసి సృష్టించారు. 2008 సంవత్సరంలోనే పర్పుల్ టొమాటోలను పరిశోధకులు విజయవంతంగా అభివృద్ధి చేశారు. ఇందుకోసం వారు స్నాప్‌డ్రాగన్ అనే పువ్వుల నుండి ఆంథోసైనిన్‌లను సేకరించి, వాటిని టొమాటో మొక్కలకు ఎక్కించారు. ఈ రకంగా జన్యుమార్పిడి చేసి నీలి రంగు టమోటాలను ఉత్పత్తి చేయగలిగారు.
పరిశోధకులు ఎలుకలకు తమ పర్పుల్ టొమాటోలు తినిపించి పరిశీలనలు చేపట్టారు. అలాగే ఈ నీలిరంగు టమోటాలను జంతువులకు తినిపించడం వల్ల వాటి ఆయుష్షు పెరిగినట్లు కనుగొన్నారు. అనంతరం ఇవి పూర్తిగా సురక్షితం అని నిర్ధారించుకున్నారు.
పోషకాలు పుష్కలం- Purple Tomato Nutrients
సాధారణ టమోటాల కంటే ఈ నీలిరంగు టమోటాలలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిలోని పోషకాలు క్యాన్సర్‌తో పోరాడే శక్తిని కూడా అందించగలవు. ఈ పర్పుల్ టొమాటాలకు ఇప్పుడు US మార్కెట్లోనూ ఆమోదం లభించింది. పర్పుల్ టొమాటో మొక్కల పెంపకం పూర్తిగా సురక్షితమైనదని, వీటి పెస్టిసైడ్స్ నుంచి USకు ప్రమాదం కలిగించే అంశాలు ఏవీ లేవని USDA తన ప్రకటనలో పేర్కొంది.
పర్పుల్ టొమాటోలలోని గుణాలు క్యాన్సర్ వంటి ప్రధాన వ్యాధుల నివారణలోనూ సహాయపడవచ్చునని నేచర్ బయోటెక్నాలజీ ప్రచురణల్లో ఉంది.
వృద్ధాప్య సమస్యలను దూరం చేస్తుంది- Health Benefits
పర్పుల్ టొమాటోలలోని ఆంథోసైనిన్‌లు అధిక సాంద్రతలను కలిగి ఉంటాయి. ఇవి చర్మం, అంతర్గత అవయవాలను విషపూరిత టాక్సిన్స్ నుండి రక్షించడంలో సహాయపడతాయి. స్థూలకాయం ఉన్నవారు వీటిని తినడం ద్వారా ప్రయోజనం పొందవచ్చునని అంటున్నారు. పర్పుల్ టొమాటోల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు వయసు పెరగటంతో వచ్చే సాధారణ వ్యాధులను నివారించడంలో సహాయపడతాయని నివేదికలు పేర్కొన్నాయి.
రుచి ఎలా ఉంటాయి.. Purple Tomato Taste ?
సాధారణ టొమాటోలతో పోలిస్తే ఈ పర్పుల్ టొమాటోలు ఎలాంటి ప్రత్యేకమైన రుచిని గానీ, సువాసనను గానీ కలిగిలేవు. వీటి రంగు మాత్రమే వేరు. రుచి, సువాసన అలాగే ఉంటాయి. అయితే కొద్దిగా ఆమ్ల రుచిని అనుభూతి పొందవచ్చునని పరిశోధకులు పేర్కొన్నారు.
సంబంధిత కథనం