Remove Sun Tan with Tomato । టొమాటోతో కాంతివంతమైన చర్మం.. పిగ్మెంటేషన్ ఇలా తొలగించండి!
ఎండ కారణంగా మీ చర్మం నల్లగా మారిందా? ఈ సమస్యకు సహజ విధానంలో టొమాటోను ఉపయోగించి తొలగించవచ్చు. ఎలా చేయాలో ఇక్కడ చూడండి.
మీరు ఎప్పుడైనా గమనించారా? మన శరీరంలో దుస్తులతో ఎప్పుడు కప్పి ఉండే భాగాలు తెల్లగా ఉంటే, మిగతా భాగాలు ముదురు రంగులో ఉంటాయి. దీనికి కారణం మనం ఎండలో తిరిగినపుడు, సూర్యకాంతిలోని UVA కిరణాలు బాహ్యచర్మంలోని దిగువ పొరలకు చొచ్చుకుపోతాయి, అక్కడ ఇవి మెలనోసైట్‌లు అని పిలిచే కణాలను ప్రేరేపించటంతో మెలనిన్ అనే వర్ణద్రవ్యం ఉత్పత్తి అవుతుంది. దీంతో తెల్లని చర్మం కాస్త నల్లగా మారుతుంది. దీనిని టానింగ్ అంటారు. ముఖ్యంగా ముఖం నేరుగా సూర్య రశ్మికి గురవుతుంది కాబట్టి సన్ టాన్ మీ అందాన్ని దెబ్బతీస్తుంది.
సాధారణంగా ఈ సన్ టాన్ అనేది వారం, పది రోజుల్లో దానంతటదే తొలగిపోతుంది. అయితే అది మీ చర్మ రకం, మీరు ఎండలో తిరిగే పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కొంతమందికి సన్ టాన్ పోవటానికి చాలా కాలం పడుతుంది. మరి మీరూ ఇలాంటి సమస్యను ఎదుర్కొంటూ, పరిష్కారం చూస్తుంటే మీకు సులభమైన మార్గం ఒకటి ఉంది. అదేంటంటే మీరు టొమాటోను ఉపయోగించి ఈ నలుపుదనాన్ని తెలుపుగా మార్చుకోవచ్చు.
టొమాటోలు ఆహారంగానే కాదు, వీటితో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. టమోటాలు చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. స్కిన్ టోన్‌ను మెరుగుపరచడంలో, మచ్చలను తొలగించి కాంతివంతంగా మార్చడంలో టొమాటోలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని లోపల నుంచి రిపేర్ చేయడానికి పని చేస్తాయి.
Get Rid of Sun Tan with Tomato
మీరు టమోటాలను సన్ టాన్ లేదా కాలిన చర్మానికి చికిత్స కోసం ఉపయోగించవచ్చు. ఇందుకోసం మీరు అనుసరించాల్సిన కొన్ని పద్ధతుల గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం. అవేంటో చూడండి..
టొమాటో షుగర్ స్క్రబ్
టొమాటోలు, చక్కెరను కలిపి స్క్రబ్‌గా తయారు చేసుకొని మాడిన చర్మంపై అప్లై చేయండి. ముందుగా టొమాటోలను గ్రైండ్ చేసి, ఆ ప్యూరీలో పంచదార కలపాలి. ఈ స్క్రబ్ ను ముఖంపై అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. ఆరిన తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా చేస్తే చర్మంపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. పలు మార్లు ఇలా చేస్తూ ఉంటే చర్మంపై పిగ్మెంటేషన్‌ను తొలగించి, చర్మాన్ని కాంతివంతంగా మారుతుంది.
టొమాటో లెమన్ లిక్విడ్
టానింగ్ సమస్య ఉన్నప్పుడు, టమోటా రసంలో నిమ్మరసం కలిపి చర్మానికి అప్లై చేయండి. టొమాటోలు సహజమైన బ్లీచింగ్ గుణాలను కలిగి ఉంటాయి, నిమ్మకాయలో ఉండే విటమిన్ సి చర్మపు రంగును మెరుగుపరుస్తుంది. ఒక టొమాటోను రసం పిండి దానికి రెండు టీస్పూన్ల నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరనివ్వాలి. అనంతరం రోజ్ వాటర్ స్ప్రే చేసి చేతులతో తేలికగా మర్దన చేసి చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి.
టొమాటో హనీ క్రీమ్
టొమాటోలోని బ్లీచింగ్ గుణాలు మేనిఛాయను మెరుగుపరిచేందుకు పనిచేస్తాయి, అయితే తేనె చర్మంలో నిగారింపును పెంచుతుంది. టొమాటోను సగానికి కట్ చేసి దానిపై కొద్దిగా తేనె రాయండి. ఆపై దానిని రంగు మారిన చర్మంపై మసాజ్ చేయండి. కనీసం 3 నిమిషాల పాటు ఇలా చేయండి. చర్మం మృదువుగా అవడమే కాకుండా, పిగ్మెంటేషన్ కూడా తొలగిపోతుంది.
సంబంధిత కథనం
టాపిక్