తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Stop Overthinking । అతిగా ఆలోచిస్తున్నారా? ఆ సుడిగుండం నుంచి బయటపడే మార్గాలు ఇవిగో!

Stop Overthinking । అతిగా ఆలోచిస్తున్నారా? ఆ సుడిగుండం నుంచి బయటపడే మార్గాలు ఇవిగో!

HT Telugu Desk HT Telugu

20 May 2023, 9:35 IST

    • Stop Overthinking: అతిగా ఆలోచించేవారు సమస్య-పరిష్కారానికి బదులుగా, అతిగా విశ్లేషించడం లేదా వాటిపై దృష్టి పెట్టడం చేస్తారు.
Ways to Stop Overthinking
Ways to Stop Overthinking (pexels)

Ways to Stop Overthinking

Stop Overthinking: మీరు ఏదైనా విషయంపై పదేపదే ఆలోచనలు చేస్తున్నారా? అతిగా ఆలోచిస్తూ అనవసరపు ఆందోళనలకు లోనవుతున్నారా? మరెందుకు ఆలోచించడం? ఆలోచించడం మానేసి, ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. అతిగా ఆలోచించడం అనేది ఒక అనారోగ్యకరమైన అలవాటు. ఇది మిమ్మల్ని ప్రతికూల విషయాలపై దృష్టి సారించేలా చేస్తుంది. గతం గురించి ఆలోచించడం, భవిష్యత్తు గురించి చింతించడం ద్వారా ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది.

అతిగా ఆలోచించేవారు సమస్య-పరిష్కారానికి బదులుగా, అతిగా విశ్లేషించడం లేదా వాటిపై దృష్టి పెట్టడం చేస్తారు. మీరు ఊహాజనిత భావనలతో మీ సొంత అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. దీనివల్ల టెన్షన్ ఎక్కువవుతుంది. నిరంతరం పెరిగే ఆందోళన, ప్రతికూల భావనలతో మీరు ఆలోచనల పక్షవాతాన్ని అనుభవించవచ్చు. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తుంది. ఆనందించే ప్రస్తుత క్షణాలను కూడా మిమ్మల్ని ఆస్వాదించలేకుండా చేస్తుంది.

Ways to Stop Overthinking- అతిగా ఆలోచించడం నుంచి బయటపడేందుకు మార్గాలు

అతిగా ఆలోచించడం ఆపడానికి ప్రభావవంతమైన మార్గాలు అనేకం ఉన్నాయి, అందులో కొన్నింటిని ఇక్కడ తెలుసుకోండి.

మీ ఆలోచనలను సవాలు చేయండి

మీ ఆలోచనలలో నిజం ఎంత? వాటికి ఉన్న విలువ ఎంత ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ ఆందోళనలు వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయా లేక మీ అంతటమీరే ఏదో ఊహించుకుంటున్నారా? మీ ఆలోచనలపై అవగాహాన కలిగి ఉండండి. మనసును ఎక్కువ ఒత్తిడికి గురిచేయకుండా అవసరమైతే మీ భావాలను ఇతరులతో పంచుకోండి. వాస్తవంలో జీవించండి.

మైండ్‌ఫుల్‌నెస్ సాధన చేయండి

గతం లేదా భవిష్యత్తు గురించి చింతించే ఆలోచనలతో పరుగెత్తడం కంటే ప్రస్తుతంపై దృష్టిపెట్టండి. ఏకాగ్రతతో మైండ్‌ఫుల్‌నెస్‌ను ప్రాక్టీస్ చేయండి. లోతైన శ్వాసలు తీసుకోండి. ధ్యానం చేయండి. ప్రస్తుతంపై దృష్టి పెట్టడంలో మీకు సహాయపడే మైండ్‌ఫుల్‌నెస్ పద్ధతులు ఉన్నాయి, వాటిని అనుసరించండి.

మీ ఆలోచనలకు సరిహద్దులను సెట్ చేయండి

మీ ఆలోచనలకు స్వీయ హద్దులు పెట్టుకోండి, అంతకుమించి ఆలోచించకుండా మీకు మీరుగా నియంత్రణ విధించుకోండి. ఒక పరిధి వరకు మాత్రమే ఆలోచనలు చేయండి, మీకు ఉన్న చింతలను పరిష్కరించడానికి నిర్ధిష్ట సమయాన్ని కేటాయించండి. మీరు ఆ సమయానికి మించి ఎక్కువగా ఆలోచిస్తున్నప్పుడు, ఆలోచించడం ఆపేయండి, ఇది సరైన సమయం కాదని మీకు మీరు గుర్తు చేసుకోండి, మీ దృష్టిని మరోచోట కేంద్రీకరించండి.

స్వీయ సంరక్షణ చేసుకోండి

మీ గురించి, మీ సంరక్షణ గురించి ఆలోచనలు చేయండి. మీ ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలి. మీ శ్రేయస్సును మెరుగుపరుచుకునేందుకు ఎలాంటి కార్యకలాపాలలో పాల్గొనాలి అనే వాటిపై దృష్టిపెట్టండి. మీకు విశ్రాంతి అవసరం అయితే విశ్రాంతి తీసుకోండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. క్రమబద్ధమైన వ్యాయామం చేయండి, మీకు సంతోషం, సంతృప్తిని కలిగించే హాబీలు లేదా సాధనలను అభ్యాసం చేయండి. మొత్తంగా మీ శ్రేయస్సును ప్రోత్సహించే కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇవ్వండి.

సమాచారాన్ని మీ మైండ్‌లో ఓవర్‌లోడ్‌ చేయకండి

మీకు అవసరమైన దానిని, కాని దానిని ప్రతీది మీ మైండ్‌లో ఎక్కించుకోకండి. అన్నింటినీ తెలుసుకోవాలనే ఉత్సుకతను ప్రదర్శించకండి. కొన్ని విషయాలు వినటానికి, సమాచారం తెలుసుకోవడానికి దూరంగా ఉండండి. వార్తలు, సోషల్ మీడియా లేదా ఇతర సమాచార వనరులను చూడటం తగ్గించండి. నిరంతరమైన సమాచారం మిమ్మల్ని పలు దిక్కులా అతిగా ఆలోచించడాన్ని ప్రేరేపిస్తుంది. కాబట్టి మీ మీడియా వినియోగంపై పరిమితులను సెట్ చేయండి.

స్వీయ కరుణను సాధన చేయండి

మీపై మీరే జాలి, దయను కలిగి ఉండండి, స్వీయ కరుణను అభ్యసించడం ద్వారా మిమ్మల్ని మీరు కేర్ చేసుకోవచ్చు. మీ గురించి ఆలోచించవచ్చు. అప్రధానమైన ఆందోళనలను పక్కనబెట్టి, నిజంగా ముఖ్యమైన వాటిపై దృష్టి పెట్టడం సరైందేనని గుర్తుపెట్టుకోండి.