Stress- Uncertainty । రాబోయే కాలం ఎలా ఉంటుంది.. భవిష్యత్తుపై బెంగగా ఉందా? నిపుణుల మాట ఇదీ!
Dealing with Stress- Uncertainty: ఏడాది ప్రారంభంలో ఉన్న జోష్ రెండు రోజులకే ఆవిరైపోయిందా? మళ్లీ భవిష్యత్తు గురించి బెంగగా ఉందా? నిపుణుల చిట్కాలు చూడండి.
Dealing with Stress- Uncertainty: కొత్త సంవత్సరం ప్రారంభమైనపుడు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది, చాలా మంది గొప్ప లక్ష్యాలను ఏర్పచుకుంటారు, మంచి తీర్మానాలు చేసుకుంటారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ మళ్లీ అంతా సాధారణంగానే అనిపిస్తుంది. కొత్త సంవత్సరం కోసం ప్రణాళికలను రూపొందించే సమయంలో పాత జ్ఞాపకాలు గుర్తుకువచ్చి ఒక అనిశ్చితి ఏర్పడుతుంది. దీంతో ప్రారంభంలో ఉన్న ఉత్సాహం నీరుగారిపోతుంది. ఆ తర్వాత చేసుకున్న తీర్మానాలు, ఏర్పర్చుకున్న లక్ష్యాలపై తమ దృక్పథాన్ని మార్చుకుంటూ ముందుకు సాగుతారు. అదే సమయంలో గత అనుభవాలు నేర్పిన పాఠాలు గుర్తుకు వచ్చి భవిష్యత్తుపై బెంగ పెట్టుకుంటారు. గడిచిన ఏడాది ఎలాగూ గడిచింది, ఈ ఏడాది ఎలా గడుస్తుంది అని ఆందోళన చెందుతారు.
రాబోయే కాలంలో ఎవరికి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో తెలియదు, కొత్త అవకాశాలు ఏమైనా వస్తాయో, రావో తెలియదు. ఇటువంటి తరుణంలో ఒత్తిడికి లోనవడం సర్వసాధారణం. అయితే ఇలాంటి ఒతిళ్లను, అనిశ్చితిని ఎదుర్కోవడానికి సైకోథెరపిస్ట్ డాక్టర్ చాందిని తుగ్నైట్ కొన్ని సూచనలు ఇచ్చారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుకు ఆలోచించండి
గతం గురించి ఎప్పుడూ ఎక్కువగా ఆలోచించకూడదు. భవిష్యత్తు గురించి ఆశాజనకంగా ఉండాలి, రాబోయే సంవత్సరాల్లో మీరు మీ జీవితంలో ఎలాంటి మార్పులను చూడాలనుకుంటున్నారో కూడా ఆలోచించండి. రేపటి మిమ్మల్ని ఊహించుకోండి, మీ గత విజయాలను పరిగణలోకి తీసుకోండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నిర్భయంగా మీదైన రీతిలో ముందుకు సాగండి. తద్వారా మీరు విజయానికి బాటలు వేయవచ్చు. మీకు స్పష్టమైన లక్ష్యం ఉంటే, అది విజయాన్ని సాధించడంలో సహాయపడుతుంది.
సలహాలు సూచనలు తీసుకోండి
ఈ కొత్త సంవత్సరంలో మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు ఉంటే వాటి జాబితా సిద్ధం చేయండి, మీ జీవితం మెరుగుపడేందుకు మీకు ఏం కావాలో ఒక ప్రణాళికను రూపొందించుకోండి. ఇందుకు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, నిపుణులు అందరి సలహాలు తీసుకోండి, నిర్ణయం మీరు తీసుకొని, ఆ మార్గం దిశగా ముందుకు సాగండి.
లక్ష్యాన్ని గురిపెట్టండి
మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా? లేదా నూతన వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా? లేదా మీ ఉద్యోగంలో ఉన్నత స్థితిని పొందాలనుకుంటున్నారా? మీకంటూ స్పష్టమైన లక్ష్యం ఉంటే, అది విజయాన్ని సాధించడంలో సహాయపడుతుంది.
సమయం- సంయమనం
అన్ని సమయాలు ఒకేలా ఉండవు, అన్నీ మీకు అనుకూలంగా జరగకపోవచ్చు, అయినప్పటికీ దానిని దాటవేయవద్దు. సమయం మనది కానపుడు సంయమనం పాటించాలి. ఓపికగా ఉండటం నేర్చుకోవాలి. ఏ విషయానికీ ఒత్తిడికి గురవ్వాల్సిన అవసరం లేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా స్థిరంగా, దృఢంగా ఉండాలి. మీకు ఎదురొచ్చే సమస్యకు మీరే ఒక సమస్యగా మారాలి, సహనంతో పనులు పూర్తి చేసుకోవాలి.
సరదాగా గడపండి
లైఫ్ అంటే కొంచెం ఫన్ కూడా ఉండాలి, రోజూ ఉండాలి. సరదా కార్యకలాపాలను మీ రోజూవారి దినచర్యలో భాగంగా చేసుకోండి. మిమ్మల్ని మీరు గదిలో లాక్ చేసుకోకుండా బయటకు వచ్చి స్వేచ్ఛగా విహరించండి, రోజూ సరదాగా మీ స్నేహితుడితో కలిసి నడకకు వెళ్లండి, ప్రతీవారం ఏదైనా అడ్వెంచర్ యాక్టివిటీ ప్లాన్ చేయండి, వీకెండ్ టూర్ వేయండి, సరదాతో నిండిన జుంబా డాన్స్, హైకింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేయండి, మీ ఆత్మీయులతో కలిసి సమయాన్ని గడపండి. ఇలాంటి కార్యకలాపాలు మీలోని విచారాన్ని, ఉద్రిక్తతలను తొలగిస్తాయి. మిమ్మల్ని మానసికంగా, శారీకంగా చురుకుగా ఉంచడంలో తోడ్పడతాయి.
చివరగా చెప్పేదేమిటంటే.. మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉండండి, సరదాగా ఉండండి, మీకు దక్కాల్సినవి దక్కుతాయి. అవసరమైతే మీ పరిస్థితుల నుండి బయటపడటానికి థెరపిస్ట్ సహాయం కూడా తీసుకోవచ్చు.
సంబంధిత కథనం