Vastu Tips for Home । కొత్త ఇల్లు కొంటున్నారా? అయితే ఈ వాస్తు నియమాలు చూడండి!-vastu tips for home know basic rules if you are purchasing a new house ,రాశి ఫలాలు న్యూస్
Telugu News  /  Rasi Phalalu  /  Vastu Tips For Home, Know Basic Rules If You Are Purchasing A New House

Vastu Tips for Home । కొత్త ఇల్లు కొంటున్నారా? అయితే ఈ వాస్తు నియమాలు చూడండి!

HT Telugu Desk HT Telugu
Nov 28, 2022 06:11 PM IST

Vastu Tips for Home: కొత్త ఇల్లు కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నారా? అయితే ఆ ఇల్లు ఎలాంటి వాస్తు దోషాలు లేకుండా చూసుకోండి, వాస్తు బాగున్న ఇల్లు ఎలా ఉంటుందో ఇక్కడ కొన్ని చిట్కాలు చూడండి.

Vastu Tips for Home
Vastu Tips for Home (iStock)

ఏ ఇంటికైనా వాస్తు అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు వాస్తు లేకుండా ఎవరూ ఇల్లు కట్టుకోవడం లేదు. ఎవరైనా సరే తమ జీవితంలో తమకంటూ ఒక ఇల్లు కట్టుకొని, అందులో ప్రశాంతంగా జీవిస్తే చాలు అనుకుంటారు. కాబట్టి ఆ ఇల్లు ఎలాంటి వాస్తు దోషాలు లేకుండా ఉన్నది చూసుకోవాలి. వాస్తు దోషాలు ఉన్న ఇల్లు ఎంత పెద్దదైనా, ఎన్ని సౌకర్యాలు ఉన్నా, ఆ ఇంట్లో సంతోషం, ప్రశాంతత ఉండదని నమ్ముతారు. వారి జీవితంలో నిత్యం ఏవో ఒక సమస్యలు చుట్టుముడుతూనే ఉంటాయి. శ్రేయస్సు వృద్ధి అనేదే ఉండదు. అదే వాస్తు బాగున్న ఇంట్లో వారికి అంతా శుభమే జరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతారు.

ట్రెండింగ్ వార్తలు

ఇవన్నీ పక్కనపెడితే వాస్తుపైన నమ్మకం లేని వారు కూడా తమ ఇంటికి వాస్తు ప్రకారం కట్టుకుంటారు అంటే నమ్ముతారా? ఎందుకంటే వాస్తుపరంగా బాగున్న ఇంటికే మార్కెట్లో విలువ ఎక్కువ ఉంటుంది. కష్టకాలంలో ఆ ఇల్లే వారిని ఆదుకుంటుందని భావిస్తారు.

Vastu Tips for Home- ఇంటికి ప్రాథమిక వాస్తు నియమాలు

మీరు కొత్త ఇంటిని కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటే లేదా కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అవ్వాలనుకుంటే ఆ ఇల్లు వాస్తుపరంగా ఉందో, లేదో చూసుకోండి. వాస్తుశాస్త్రం ప్రకారం ఇల్లు ఎలా ఉండాలో ఇక్కడ కొన్ని చిట్కాలు అందిస్తున్నాం, చూడండి.

ఇంటి ప్రవేశ ద్వారం

వాస్తుశాస్త్రం ప్రకారం, ఇంటి ప్రధాన ద్వారం కేవలం అందరూ వచ్చి, పోయే ప్రవేశ ద్వారం మాత్రమే కాదు, సానుకూల శక్తిని లేదా ప్రకంపనల మోసుకొచ్చే మార్గం కూడా. కాబట్టి ఇంటి ప్రవేశ ద్వారం ఏ దిశలో ఉందనేది చూసుకోవాలి. వాస్తు ప్రకారంగా మీ ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారం ఉత్తరం, తూర్పు లేదా ఈశాన్య (Northeast) దిశలో ఉండాలి. మీరు ఇంటి నుంచి అడుగు బయట పెట్టినప్పుడు, ఆ అడుగు ఉత్తరం, తూర్పు లేదా ఈశాన్య దిశలో పడేటట్లుగా ఉండాలని నిపుణులు చెబుతారు. ప్రవేశద్వారం తలుపులు నలుపు రంగులో ఉండకూడదు.

లివింగ్ రూమ్ వాస్తు

ఏ ఇంట్లోనైనా అత్యంత చురుకైన ప్రదేశం, ఎక్కువ సేపు గడిపే ప్రదేశం, ఎవరైనా అతిథులు ఇంటికి వచ్చినపుడు వారికి ఆ ఇంటిపై ఒక అభిప్రాయాన్ని కలుగజేసే ప్రదేశం ఏదైనా ఉందా అంటే, అది లివింగ్ రూమ్ మాత్రమే. ప్రవేశ ద్వారానికి తగినట్లు లివింగ్ రూమ్ తప్పనిసరిగా తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉండాలి. ఈ గదిలో ఫర్నిచర్ పశ్చిమ లేదా నైరుతి దిశలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి వాస్తు దోషం ఉండదు.

డైనింగ్ హాల్ వాస్తు

మీ ఇంటికి డైనింగ్ ఏరియా కోసం ప్రత్యేక స్థలాన్ని కలిగి ఉంటే, ఉత్తమ ఫలితాలను పొందడానికి మీరు మీ డైనింగ్ హాల్‌ను పశ్చిమ భాగంలో ఉంచాలి. అయితే, ఒకవేళ అది సాధ్యం కాకపోతే ఉత్తరం, తూర్పు లేదా దక్షిణ దిశలను ఎంచుకోవచ్చు. కానీ నైరుతి దిశలో డైనింగ్ ఏరియా ఉండకూడదు, ఇది సరైన వాస్తు కాదు.

పడక గదుల వాస్తు

మంచి ఆరోగ్యం, బలమైన సంబంధాలను కొనసాగించడానికి, పడక గదులు నైరుతి దిశలో ఉండాలి. ఈశాన్య దిశలో పడక గది ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది, ఆగ్నేయ వైపు పడకగది దంపతుల మధ్య కలహాలు, తగాదాలను కలిగిస్తుంది. అలాగే పడకగదిలో బెడ్‌ను గది నైరుతి మూలలో ఉంటే, తల పడమర వైపు ఉంచాలి. పడక గదిలో పూజామందిరం ఏర్పాటు చేసుకోకూడదు. మంచానికి ఎదురుగా అద్దం లేదా టెలివిజన్ ఉండకూడదు. ఎందుకంటే పడక గదిలో మనుషుల ప్రతిబింబం వాటి అద్దాలలో కనిపిస్తే ఇది కుటుంబ సభ్యుల మధ్య తగాదాలకు కారణమవుతుంది.

వంటగది వాస్తు

వాస్తు ప్రకారం, వంటగదిని ఇంటికి ఆగ్నేయ దిశలో నిర్మించాలి. వంటగది ఇంటికి ఉత్తరం, ఈశాన్య లేదా నైరుతి దిశలో ఉండకూడదు. వంటగదిలోని మంట పుట్టించే ఉపకరణాలు కూడా ఆగ్నేయ దిశలో ఉండాలి.

బాత్రూమ్ - టాయిలెట్ వాస్తు

బాత్రూమ్ - టాయిలెట్ ప్రవేశ ద్వారం ఉత్తర లేదా తూర్పు గోడకు ఉండాలి. టాయిలెట్ సీటుపై కూర్చున్నప్పుడు వ్యక్తి పశ్చిమం లేదా తూర్పు వైపు చూసేలా ప్లేస్‌మెంట్ ఉండాలి. మీ బాత్రూమ్ లేదా టాయిలెట్ వంటగది లేదా పూజా గదితో గోడను పంచుకోకుండా చూసుకోండి.

గదుల ఆకృతి

వాస్తు శాస్త్రం ఇంట్లోని అన్ని గదులు చతురస్రాకారంలో లేదా దీర్ఘచతురస్రాకారంలో ఉన్నాయని నిర్ధారించుకోండి. వృత్తాకారంలో ఉండేవి, హెచ్చుతగ్గుల మూలలు వాస్తు ప్రకారం సరైనవి కావు. అలాగే ఇంటి గదుల్లోకి వెలుతురు, గాలి చక్కగా రావాలి. పరిసరాలు శుభ్రంగా ఉండాలి.

సంబంధిత కథనం

టాపిక్