Beer for Kidney Stones | కిడ్నీలో రాళ్లు తొలగిపోవాలంటే బీర్ తాగాలా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి!
10 March 2023, 16:54 IST
- Beer for Kidney Stones Facts: భారతదేశంలో చాలా మంది బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు తొలగిపోతాయని నమ్ముతున్నారట. ఇటీవల చేసిన ఓ తాజా సర్వేలో, కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.
Beer for Kidney Stones
భారతదేశంలో కిడ్నీలో రాళ్లకు సంబంధించిన కేసులు పెరుగుతున్నాయి. మూత్రపిండాల పనితీరు, కిడ్నీ వ్యాధులతో కలిగే ప్రమాదాల గురించి ఎక్కువ మందిలో తగినంత అవగాహన లేకపోవడమే దీనికి కారణం. ప్రముఖ ఆరోగ్య సంరక్షణ సంస్థ ప్రిస్టిన్ ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడితే బీర్ తాగడమే చికిత్స అని ప్రతీ ముగ్గురిలో ఒకరు విశ్వసిస్తున్నారని వెల్లడైంది. ఈ కారణం చేత తమకు కిడ్నీలో రాళ్లు ఏర్పడినట్లు నిర్ధారించుకున్న వారు అతిగా బీర్ తాగుతూ చికిత్స చేసుకోవడాన్ని దాటవేస్తున్నారు. ఇలా ఆలస్యం చేయడం వలన సమస్య మరింత ముదిరి ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లు వెల్లడైంది. ప్రిస్టిన్ సర్వేలో కిడ్నీలో రాళ్లు కలిగిన దాదాపు వెయ్యి మంది వ్యక్తులు పాల్గొన్నారు, ఇందులో 50% మంది సుమారు 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు కిడ్నీ స్టోన్ చికిత్సను ఆలస్యం చేసినట్లు డేటా వెల్లడించింది.
లైబ్రేట్ ప్రకారం, కిడ్నీ స్టోన్స్‌కు సంబంధించిన కేసులు 2021తో పోలిస్తే 2022లో భారీగా 180% పెరిగాయి. రోగుల్లో ఎక్కువ మంది పురుషులే ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కిడ్నీ స్టోన్స్‌కు సంబంధించి స్త్రీల సంఖ్యతో పోలిస్తే పురుషుల సంఖ్య 3 రెట్లు ఎక్కువ ఉంది. మూత్రపిండాల్లో రాళ్లకు మధుమేహం, రక్తపోటు అనేవి అత్యంత సాధారణ ప్రమాద కారకాలు. మధుమేహం, రక్తపోటు ఉన్నప్పుడు కిడ్నీలో రాళ్లు తయారయ్యే అవకాశం ఉంటుందని కేవలం వారిలో 14% శాతం మందికి మాత్రమే తెలుసు. ఇదిలా ఉంటే కిడ్నీలు మూత్రాన్ని ఉత్పత్తి చేస్తాయని సగానికి పైగా వ్యక్తులకు తెలియకపోవడం గమనార్హం.
ఫిట్‌నెస్, బాడీబిల్డింగ్ చేసే చాలా మంది వ్యక్తులు తమ ఆహారంలో ప్రోటీన్ సప్లిమెంట్‌లను ఎక్కువగా చేర్చడం ప్రారంభించారు. అయితే సగానికి పైగా ప్రోటీన్ సప్లిమెంట్లు మూత్రపిండాల్లో రాళ్లకు కారణమవుతాయని తేలింది.
Beer for Kidney Stones - Myths vs Facts - బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు తొలగిపోతాయా?
బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు తొలగిపోతాయనేది ఒక వాదన ఉంది. అయితే ఇది పూర్తిగా నిజం కాదు. ఇప్పటివరకు చేసిన పరిశోధనలు, అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం.. బీర్ అనేది ఒక మూత్ర విసర్జక కారకం. బీర్ తాగడం వలన ఎక్కువ మూత్రం ఉత్పత్తి అవుతుంది, కాబట్టి ఆ మూత్ర ప్రవాహంలో 3 మిమీ వరకు పరిమాణం కలిగిన రాళ్ల గుళికల లాంటివి ఏవైనా మూత్రం ద్వారా బయటకు వెళ్లవచ్చు, కానీ ఇది రాళ్లను కరిగించదు. అలాగే 5 మిమీ అంతకంటే పెద్ద సైజ్ రాళ్లు ఏర్పడితే అవి మూత్రనాళం గుండా ప్రవహించలేవు. బదులుగా అవి ఆ నాళాల్లో ఇరుకొని మూత్రాన్ని అడ్డుకోవచ్చు, అలాంటపుడు బీర్ తాగడం వలన ఉత్పత్తి అయ్యే ఎక్కువ మూత్రంతో పరిస్థితి తీవ్రంగా మారవచ్చు. మూత్రం చూసేటపుడు మంటగా, చాలా బాధాకరంగా అనిపించవచ్చు.
ఎక్కువ మొత్తంలో బీర్ తీసుకోవడం వల్ల అది మిమ్మల్ని డీహైడ్రేట్‌గా చేస్తుంది, అధిక బరువుకు కారణం అవుతుంది, కాలేయానికి హాని చేస్తుంది. అందువల్ల బీర్ కంటే సురక్షితమైన పానీయాలు, మందులు చాలా ఉన్నాయి. అవి బీర్ కంటే తక్కువ ధరకే లభిస్తాయి. కాబట్టి వైద్యులను సంప్రదించి, కిడ్నీలో రాళ్ల కోసం వారు సూచించిన మందులు తీసుకోవాలని నిపుణులు పేర్కొన్నారు.