Kidney Stones | ఈ సంకేతాలు గమనించారా? కిడ్నీలో రాళ్లు కావొచ్చు-these symptoms warn that you might have stones in the kidneys ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  These Symptoms Warn That You Might Have Stones In The Kidneys

Kidney Stones | ఈ సంకేతాలు గమనించారా? కిడ్నీలో రాళ్లు కావొచ్చు

Manda Vikas HT Telugu
Mar 08, 2022 02:15 PM IST

కిడ్నీలు శుద్ధి చేసే ప్రక్రియలో భాగంగా కొనిసార్లు అధిక ఉప్పు, ఖనిజాలు స్ఫటికాల రూపంలో పేరుకుంటాయి. వీటినే రాళ్లు అని చెప్తారు. ఇవి పరిస్థితులను బట్టి పరిమాణం పెరుగుతుంటాయి. సరైన సమయంలో వీటిని గుర్తించకపోతే కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా పరిణమిస్తాయి.

కిడ్నీ సమస్యలు
కిడ్నీ సమస్యలు (Shutterstock)

కిడ్నీలో రాళ్లు ఏర్పడటం ఈ మధ్యకాలంలో సర్వసాధారణమయిపోయింది. చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. మారుతున్న జీవనశైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా ఏ వయసు వారికైనా ఈ సమస్య తలెత్తవచ్చు. తగినంత నీరు త్రాగకపోవడం, ఊబకాయం, ఆహారపు అలవాట్లు, మూత్రంలో సిస్టీన్, యూరిక్ యాసిడ్, ఆక్సలేట్ లేదా కాల్షియం స్థాయులు అధికంగా ఉండటం, పాలీసిస్టిక్ కిడ్నీ వ్యాధి అలాగే కొన్నిరకాల మందులతో కలిగే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల మూత్రపిండాల్లో రాళ్లు తయారవుతాయి. కొన్నిసార్లు జన్యుపరమైన సమస్యలు కూడా కారణం కావొచ్చు.

కిడ్నీల ప్రధాన కర్తవ్యం రక్తాన్ని శుద్ధి చేయడం, అవసరం మేరకు లవణాలను, ఖనిజాలను గ్రహించడం, మలినాలను తొలగించడం.

కిడ్నీలు శుద్ధి చేసే ప్రక్రియలో భాగంగా కొనిసార్లు అధిక ఉప్పు, ఖనిజాలు స్ఫటికాల రూపంలో పేరుకుంటాయి. వీటినే రాళ్లు అని చెప్తారు. ఇవి పరిస్థితులను బట్టి పరిమాణం పెరుగుతుంటాయి. సరైన సమయంలో వీటిని గుర్తించకపోతే కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా పరిణమిస్తాయి.

అయితే కిడ్నీలో రాళ్లు ఏర్పడినట్లు తెలుసుకోవాలంటే మనం కొన్ని సంకేతాలను అర్థం చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో మన శరీరం మనకు కొన్ని సంకేతాలను పంపిస్తుంది. ప్రాథమిక దశలోనే ఈ సమస్యను గుర్తిస్తే జరగబోయే భారీ నష్టాన్ని నివారించవచ్చు. కిడ్నిలో రాళ్లు తయారయినపుడు అతి సాధారణమైన లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకోండి.

కిడ్నీలో రాళ్లను ఈ సంకేతాలతో గుర్తించవచ్చు

వెన్నులో, పొత్తికడుపులో నొప్పి  

ఒక రాయి మూత్ర నాళం లోపల ఇరుక్కుపోయినప్పుడు. అది ఆ మార్గంలో అడ్డంకిని కలుగజేస్తుంది. దీంతో వీపు కింది భాగంలో, పొత్తికడుపులో లేదా ప్రక్కలో తీవ్రమైన నొప్పి, మంటకు దారితీస్తుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లకు సంబంధించిన ప్రాథమిక సంకేతాలలో ఒకటి. కొంతమందికి ఈ నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది.

తరచుగా మూత్రవిసర్జన

 మీ మూత్రాశయం సమీపంలో రాయి ఉన్నట్లయితే, అప్పుడు మూత్రాశయ గోడలు సున్నితత్వానికి లోనవుతాయి. దీంతో మూత్రాశయం సంకోచం చెందుతూ తరచుగా మూత్ర విసర్జన చేయాలనే కోరికను కలుగుస్తుంది.

ఒకవేళ మీరు సాధారణంగా మూత్రవిసర్జన చేసే దానికంటే మాటిమాటికి  చేయాల్సిన పరిస్థితి ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించవలసిన సమయం ఆసన్నమైందని అర్థం చేసుకోవాలి.

మూత్రవిసర్జనలో మంట

మూత్రవిసర్జన చేసే సమయంలో కూడా నొప్పి లేదా మంటను అనుభవిస్తే, ఇది కూడా మూత్రపిండాల్లో రాళ్లు ఉండటానికి ఒక సంకేతం. మూత్ర నాళంలో ఏదైనా అడ్డంకి ఉన్నపుడు ఇలా జరుగుతుంది. ఒకవేళ నిజంగా మూత్ర నాళంలో రాళ్లు చేరితే కొన్నిసార్లు అది ఇన్ఫెక్షన్‌కూ దారితీయవచ్చు.

గ్యాస్ట్రిక్ సమస్యలు

 కిడ్నీలో రాళ్లు ఉన్నవారు తరచుగా అనేక గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతుంటారు. కిడ్నీలలోని రాళ్లు జీర్ణవ్యవస్థలో ఇబ్బందిని కలిగిస్తాయి. దీంతో తీవ్రమైన కడుపు నొప్పి, వికారం, వాంతులు ఉంటాయి.

జ్వరం, చలి

మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడినపుడు కొంతమందికి జ్వరం, చలి ఉంటుంది. అయితే ఇది చాలా అరుదుగా సంభవించే పరిస్థితి. మూత్రనాళాల్లో మూత్ర ప్రవాహానికి రాళ్లు అడ్డంకిగా మారినపుడు చలిజ్వరం వచ్చే ఆస్కారం కూడా ఉంటుంది.

మూత్రంలో రక్తం

మూత్రం రంగు మారినా లేదా మూత్రంతో పాటు రక్తం వస్తే, ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడినట్లు తెలిపే అతి సాధారణ సంకేతం.

మూత్ర ప్రవాహానికి రాళ్లు అడ్డుపడినపుడు కలిగే ఒత్తిడి కారణంగా రక్తం రావొచ్చు. ఈ పరిస్థితిని హెమటూరియా అని పిలుస్తారు. ఇది మూత్రాన్ని ఎరుపు, గులాబీ లేదా గోధుమ రంగులో మారుస్తుంది.

దుర్వాసనతో కూడిన మూత్రం

కిడ్నీ వ్యవస్థలో ఏదైనా ఇన్ఫెక్షన్ కారణంగా ఈ పరిస్థితి ఉంటుంది. కిడ్నీలో రాళ్లు అధిక సాంద్రతతో కూడిన లవణాలు, ఖనిజాల వల్ల ఏర్పడతాయి కాబట్టి ఇది మూత్రాన్ని చిక్కగా మారుస్తుంది. ఇలాంటి సందర్భంలో మూత్ర నాళంలో బ్యాక్టీరియాలు వృద్ధి చెందుతాయి. దీంతో మూత్రం ఒకరమైన దుర్వాసనను కలుగజేస్తుంది.

కాబట్టి, ఇలాంటి సంకేతాలలో మీరు దేనినైనా గమనించినట్లయితే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

 

WhatsApp channel

టాపిక్