Urinary Frequency । రోజులో ఎన్నిసార్లు మూత్ర విసర్జన చేయడం సాధారణం? అతిగా రావడానికి కారణాలు తెలుసుకోండి!-know urinary frequency normal range and what causes frequent urination solution and more ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  Know Urinary Frequency Normal Range And What Causes Frequent Urination, Solution And More

Urinary Frequency । రోజులో ఎన్నిసార్లు మూత్ర విసర్జన చేయడం సాధారణం? అతిగా రావడానికి కారణాలు తెలుసుకోండి!

Urinary Frequency
Urinary Frequency (Unsplash)

Urinary Frequency: అతిగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుందా? అశ్రద్ద చేయకండి, అయితే ముందుగా అతి మూత్ర విసర్జన అంటే ఎప్పుడు అంటారో ఇక్కడ తెలుసుకోండి.

మనం జీవించడానికి రోజూవారీగా ఆహారం, నీరు తీసుకోవడం ఎంత ముఖ్యమో ఆ తీసుకున్న వాటి నుండి ఉత్పన్నమయ్యే వ్యర్థాలను బయటకు పంపడం అంతే కీలకం. మనం రోజూ తీసుకునే నీరు సహా ఇతర ద్రవపదార్థాలను శరీరంలోని వ్యవస్థలు చెమట, మూత్రం రూపంలో బయటకు పంపిస్తాయి. ఇందులో మూత్ర విసర్జన అనేది ప్రతీ వ్యక్తి ఆరోగ్యానికి సంబంధించి చాలా ముఖ్యమైన క్రియ. అయితే ఇది కూడా సాధారణ స్థాయిలో ఉండాలి. మూత్ర విసర్జన తక్కువైనా లేదా ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేయాల్సి వచ్చినా అది అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కొంతమంది రోజులో తరచుగా మూత్ర విసర్జన చేస్తుంటారు. ఎక్కువ నీళ్లు తాగినా, వాతావరణం చల్లగా ఉన్నా మూత్ర విసర్జన ఎక్కువగా రావడం సహజం. కానీ అసాధారణంగా మూత్ర విసర్జన చేస్తుంటే మాత్రం అది ఆలోచించాల్సిన విషయమే. దానిని అశ్రద్ధ చేయకూడదు.

ట్రెండింగ్ వార్తలు

తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి రావడం వివిధ దీర్ఘకాలిక వ్యాధులతో ముడిపడి ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితి మీకు చాలా కాలంగా కొనసాగితే ఒకసారి వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మంచిది. మరి ఇక్కడ అతి మూత్ర విసర్జన ఆని ఎలా తెలుస్తుంది. సాధారణంగా ఒక వ్యక్తి ఎన్నిసార్లు మూత్ర విసర్జన చేయడం సాధారణంగా చెప్పవచ్చు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Normal Urinary Frequency - సాధారణ మూత్రవిసర్జన ఫ్రీక్వెన్సీ ఏమిటి?

ప్రతి ఒక్కరి జీవితంలో చాలా విషయాల మాదిరిగానే, వారి వారి ఆరోగ్య స్థితిగతులు భిన్నంగా ఉంటాయి. ఇది వారి మూత్ర విసర్జనకు కూడా వర్తిస్తుంది. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి 24 గంటల వ్యవధిలో సగటున రోజుకు 6 - 7 సార్లు మూత్ర విసర్జన చేస్తే గనక అది సాధారణ సంఖ్య అని చెప్పవచ్చు. కొన్ని పరిస్థితులలో రోజుకు 4 మరియు 10 సార్లు మూత్ర విసర్జన చేసినా అది కూడా సాధారణమే అనిపించుకుంటుంది కానీ, ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి, మూత్ర విసర్జన సౌకర్యవంతంగా సాగాలి. ఒకవేళ వారికి ఇందులో ఏదైనా ఇబ్బంది కలిగితే అది సాధారణ మూత్ర విసర్జన అనిపించుకోదు.

అలాగే ఒక వ్యక్తి ఒక రోజులో 2 లీటర్ల ద్రవాన్ని తాగి, రోజుకు ఏడు కంటే ఎక్కువ సార్లు , మూత్ర విసర్జన చేయాల్సి వస్తే అది అతిమూత్ర విసర్జనగా పేర్కొనవచ్చు.

Frequent Urination Causes- అతి మూత్ర విసర్జనకు కారణాలు

పైన పేర్కొన్న సాధారణ స్థాయిల కంటే ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేస్తే అందుకు కొన్ని అనారోగ్య కారణాలు, వ్యాధులు దారితీయవచ్చు. ఇందులో కొన్నింటిని ఇక్కడ తెలుసుకోండి.

మధుమేహం- Diabetes

తరచుగా మూత్రవిసర్జన చేయడం టైప్-1 , టైప్-2 మధుమేహం ప్రారంభ లక్షణం అని వైద్యులు అంటున్నారు. మధుమేహం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. ఇది మరింత గ్లూకోజ్‌ను ఫిల్టర్ చేయడానికి మూత్రపిండాలపై ఒత్తిడి తెస్తుంది. దీనివల్ల ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. నిర్లక్ష్యం చేస్తే కిడ్నీల పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉంది. మీరు తరచుగా మూత్ర విసర్జనకు వెళుతుంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

అతి చురుకైన మూత్రాశయం- OAB

అతి చురుకైన మూత్రాశయం కూడా తరచుగా మూత్ర విసర్జన చేయాలనే కోరికను కలిగిస్తుంది. ఈ సమయంలో మూత్రాన్ని నియంత్రించడం కష్టం కావచ్చు. తరచుగా మూత్రవిసర్జన ఈ పరిస్థితి సాధారణ లక్షణం.

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్-UTI

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కూడా తరచుగా మూత్ర విసర్జనకు దారితీస్తుంది. కానీ ఈ సమస్య ఉన్న కొందరికి మూత్రంలో మంట, రక్తస్రావం కూడా ఉండవచ్చు. కడుపు నొప్పి కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మీరు ఈ లక్షణాలను అనుభవిస్తే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

కిడ్నీ స్టోన్స్- Kidney Stones

కిడ్నీ స్టోన్స్ తరచుగా మూత్రవిసర్జనకు కారణమవుతాయి. మూత్రాశయంలోని ఖనిజాలు, ప్రోటీన్లు రాళ్ల వంటి స్ఫటికాలు మూత్రనాళాల్లో అడ్డుపడతాయి. ఇవి తరచుగా మూత్ర విసర్జన చేసే కోరికను కలిగిస్తాయి.

పురుషులలో ప్రోస్టేట్ సమస్య

పురుషులలో తరచుగా మూత్రవిసర్జన చేయడం ప్రోస్టేట్ సమస్యలకు సంకేతం. విస్తరించిన ప్రోస్టేట్ సంక్రమణ, ప్రోస్టేట్ వాపు, ప్రోస్టేట్ క్యాన్సర్ కారణంగా తరచుగా మూత్రవిసర్జనకు కారణమవుతుంది.

మహిళల సమస్యలు

మహిళల్లో తరచుగా మూత్రవిసర్జన యూటీఐ, ఓఏబీ, బ్లాడర్ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు. ప్రెగ్నెన్సీ, ఫైబ్రాయిడ్స్, మెనోపాజ్, అండాశయ క్యాన్సర్, ఈస్ట్రోజెన్ తక్కువగా విడుదల కావడం కూడా కారణం కావచ్చు. కాబట్టి, అలాంటి సమస్యలు ఉంటే, నిర్లక్ష్యం చేయకండి, వెంటనే నిపుణులైన వైద్యుడిని సంప్రదించండి.

WhatsApp channel

సంబంధిత కథనం