తెలుగు న్యూస్  /  Lifestyle  /  Know Diet Plan Fitness Guide To Healthy Eating Habits For Breast Feeding Mothers

Diet plan for mothers: తల్లి అయిన వారికి డైట్ ప్లాన్ అవసరం అంటున్న డైటీషియన్లు

HT Telugu Desk HT Telugu

23 January 2023, 19:03 IST

    • Diet plan for mothers: తల్లి అయిన వారికి స్పెషల్ డైట్ ప్లాన్ అవసరం అని డైటీషియన్లు చెబుతున్నారు. గర్భధారణ వల్ల ఉండే పరిమితులు, ప్రసవ వేధన వంటి వాటి నుంచి కోలుకుని చిన్నారికి పాలు పడుతున్నందున తల్లి అయిన వారు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
తల్లి అయిన వారికి ప్రత్యేక డైట్ ఛార్ట్ అవసరం
తల్లి అయిన వారికి ప్రత్యేక డైట్ ఛార్ట్ అవసరం (Photo by RODNAE Productions on Pexels)

తల్లి అయిన వారికి ప్రత్యేక డైట్ ఛార్ట్ అవసరం

మీరు అమ్మ అయ్యారా? ఉద్యోగం లేదా వ్యాపారం కూడా చేస్తున్నారా? అయితే మీరు ఈ రెండు పాత్రలతో పాటు మరో అదనపు బాధ్యత కచ్చితంగా మోయాలి. ఆరోగ్యకరమైన ఆహారం ఇప్పుడు చాలా అవసరం. ముఖ్యంగా మీరు శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉండాలంటే అధిక ప్రోటీన్ గల ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మంచి ఆరోగ్యం కోసం పురుషులైనా, మహిళలైనా సమతుల ఆహారం తీసుకోవడం తప్పనిసరి. అయితే పాలిచ్చే తల్లులు ఈ విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాలి.

హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జిందాల్ నేచర్‌క్యూర్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన డైటీషియన్ సుష్మా ఈ అంశంపై మాట్లాడారు. ‘మగ వారి శరీరంతో పోలిస్తే మహిళ శరీరానికి విభిన్న పోషకాలు అవసరం అవుతాయి. అందువల్ల డైట్ కూడా అందుకు తగినట్టుగా ఉండాలి. మహిళల జీవ ప్రక్రియకు తగినరీతిలో కార్బొహైడ్రేట్లు, కొవ్వు, ప్రోటీన్‌ అవసరమవుతాయి..’ అని వివరించారు.

పోషకాల సమ్మేళనం అవసరం

‘మహిళలు తమ డైట్లో‌ రంగురంగుల కూరగాయలన్నీ చేర్చుకోవాలి. అలాగే చిక్కుళ్లు, బీన్స్, బఠాణీలు, పండ్లు, సోయా ఉత్పత్తులు, నట్స్, విత్తనాలు, తృణ ధాన్యాలు, చక్కెర లేని పాల ఉత్పత్తులు, ఆరోగ్యకర కొవ్వులు ఉండే ఆలివ్ ఆయిల్, బాదాంలు, కొబ్బరి వంటి ఆహారం తీసుకోవాలి. షుగర్, సోడియం, శాచ్యురేటెడ్ కొవ్వు ఎక్కువగా ఉండే స్నాక్స్‌కు దూరంగా ఉండాలి. హెల్తీ డైట్ అంటే కేవలం కేలరీలు తగ్గించడం, పరిమాణం తగ్గించడం మాత్రమే కాదు. పోషకాల సమ్మేళనం, అందులో ఉండే ఆహార పదార్థాలను గమనించాలి..’ అని వివరించారు.

మన దేశంలో చాలా మంది తల్లులు ఎనీమియాతో బాధపడుతున్నారు. తల్లి కాబోతున్న వారు, తల్లి అయిన వారు కూడా వీరిలో ఉంటున్నారు. ఎనీమియాకు సంబంధించిన దాదాపు 50 శాతం సమస్యలు సమతుల ఆహారం తీసుకోవడం వల్ల తగ్గిపోతాయి. ‘బీన్స్, బచ్చలి వంటి ఆకుకూరలు, ఎండు ద్రాక్ష, అప్రికాట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. అలాగే విటమిన్ సీ పుష్కలంగా ఉండే పండ్లు కూడా ఎనీమియా చికిత్సలో ఉపయోగపడుతుంది..’ అని వివరించారు.

నాచురోపతి వైద్యం ప్రకారం సాత్విక ఆహారం శరీరాన్ని, మనస్సును ఉల్లాసంగా ఉంచుతుంది. మనస్సును ప్రశాంతంగా, స్థిరంగా ఉంచుతుంది. స్ట్రెస్‌ను, యాంగ్జైటీని తగ్గిస్తుంది. మొక్కల నుంచి లభించే ఆహారమే సాత్వికాహారంగా పరిగణిస్తారు. అంటే తాజా పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు, పప్పు ధాన్యాలు, ఔషధ మూలికలు వంటివి ఈ సాత్విక ఆహారం కిందికి వస్తాయి.

‘లావెండర్, కామోమైల్ వంటి హెర్బ్స్ యాంగ్జైటీ, నిద్రలేమి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అలసట, ఇతర ఒత్తిడి లక్షణాలైన, కండర సంకోచాలు, జీర్ణక్రియ సమస్యలను తగ్గిస్తాయి. అలాగే దాల్చిన చెక్క, వెల్లుల్లి, పసుపు, అల్లం వంటివి శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తాయి. అలాగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తాయి..’ అని వివరించారు.

అందరూ సమతుల ఆహారం తీసుకోవాలని, అయితే తల్లి అయిన వారు ఈ విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపాలని పారస్ హాస్పిటల్స్ డైటీషియన్ నేహా పఠానియా సూచించారు. ఇందుకు పలు సూచనలు కూడా చేశారు.

తల్లి అయిన వారు ఆహారం విషయంలో పాటించాల్సిన సూచనలు

  1. పోషకాహారం అందుబాటులో ఉండేలా నిల్వ చేసుకోండి. తృణ ధాన్యాలు, తేలికపాటి మాంసాహారం, తాజా కూరగాయలు, పండ్లు, కొవ్వు లేని పాల ఉత్పత్తులు, నట్స్, బీన్స్ అందుబాటులో ఉంచుకోవాలి. స్నాక్స్ కూడా పోషకాలతో నిండినవే తీసుకోవాలి.
  2. జంక్ ఫుడ్ కాకుండా సంపూర్ణ పోషకాహారం ఉండేలా చూడాలి. క్యాలరీలు లెక్కించుకోవడం కాకుండా మీ ఆరోగ్యానికి తగిన విధంగా ఆహారం తీసుకోవడం ఈ సమయంలో అవసరం.
  3. బ్రేక్ ఫాస్ట్ కూడా మీ జీవక్రియకు సరిపడేలా ఉండాలి. కాంప్లెక్స్ కార్బొహైడ్రేట్లు, ఆరోగ్యకర కొవ్వులు, ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి.
  4. పాలిచ్చే తల్లులు తమ దాహాన్ని ఎప్పటికప్పుడు తీర్చుకోవాలి. పాలు, పండ్ల రసాలు, నీళ్లు తగినంత తీసుకోవాలి.
  5. పాలిచ్చే తల్లులు రోజుకు కనీసం 2000 కేలరీల ఆహారం తీసుకోవాలి. విభిన్న రకాల ఆహారాలను ట్రై చేయాలి.
  6. పాలిచ్చే తల్లులు ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. ఆల్కహాల్ తీసుకుంటే అది మీ చిన్నారిపై ప్రభావం చూపుతుంది.
  7. పొగాకు వినియోగానికి కూడా పాలిచ్చే తల్లులు దూరంగా ఉండాలి. ఇది మీ బేబీ హార్ట్ బీట్ పెంచేస్తుంది. వారు విశ్రాంతి లేకుండా ఉండేలా చేస్తుంది. వాంతులు చేసుకుంటారు. లేదా డయేరియా బారిన పడతారు. తల్లిపాలల్లో నికోటిన్ కలుస్తుంది.
  8. మీరు కెఫిన్ ఉన్న పానీయాలు తాగితే మీ బేబీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కాఫీ వంటివాటికి దూరంగా ఉండలేకపోతే క్వాంటిటీ బాగా తగ్గించాలి.