తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Parenting Tips: పిల్లలతో పరేషాన్ అవుతున్నారా? ఈ టిప్స్‌తో మీలో హుషారు

Parenting tips: పిల్లలతో పరేషాన్ అవుతున్నారా? ఈ టిప్స్‌తో మీలో హుషారు

HT Telugu Desk HT Telugu

13 January 2023, 16:16 IST

    • Parenting tips: పిల్లల సంరక్షణ ఒక సవాలు. చాలా తల్లిదండ్రులు ఈ విషయంలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటారు. వాటిని అధిగమించాలంటే అనుసరించాల్సిన టిప్స్ చదవండి.
పేరెంటింగ్ ద్వారా వచ్చే ఒత్తిడి ఎదుర్కోవడానికి టిప్స్
పేరెంటింగ్ ద్వారా వచ్చే ఒత్తిడి ఎదుర్కోవడానికి టిప్స్ (Pexels)

పేరెంటింగ్ ద్వారా వచ్చే ఒత్తిడి ఎదుర్కోవడానికి టిప్స్

పేరెంటింగ్ ఒక యాగం లాంటిదే. ఇక అప్పుడే పుట్టిన శిశువు అయితే రాత్రి పూట ఫీడింగ్ దగ్గరి నుంచి మొదలు పెద్దవుతున్న కొద్దీ వారు చేసే అల్లరి సహా పిల్లల సంరక్షణ ఒక సవాలుతో కూడుకున్న పని. బడికి వెళ్లే పిల్లలైతే వారి హోం వర్క్‌లు, వారికి అల్పాహారం, స్నాక్ బాక్స్, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం ఒక్కటా రెండా.. తల్లులకైతే ప్రతి నిత్యం బోర్డ్ ఎగ్జామ్ లాంటిదే. పిల్లల డిమాండ్లు, వారి భావోద్వేగాలు తల్లిదండ్రులకు ఒత్తిడిని కలిగిస్తాయి. పేరెంట్స్‌కు వారిపై వారికి కంట్రోల్ ఉండకుండా పోతుంది.

పిల్లల సంరక్షణ మాత్రమే కాకుండా ఇతర బాధ్యతలతో కూడా తల్లిదండ్రులు సతమతమవుతుంటారు. ఉద్యోగం లేదా వ్యాపారం, ఇంటి బాధ్యతల వంటి వాటితో సతమతమవుతుంటారు. అందువల్ల పేరెంట్స్‌కు టైమ్, ఎనర్జీ సరిపోవు. దీంతో అతలాకుతలమై పోతుంటారు.

అందువల్ల పేరెంట్స్ వారి ఆరోగ్యంపై శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే ఈ ఒత్తిడి పెను ప్రభావం చూపుతుంది. శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అలాగే మీరు పిల్లలను చూసుకునే తీరుపై కూడా ప్రభావం చూపుతుంది. వారి ప్రవర్తనపై కూడా వ్యతిరేక ప్రభావం పడుతుంది. అందువల్ల మీరు అన్నీ ఓ పద్ధతిగా పెట్టుకుంటే ఒత్తిడి మీ దరి చేకుండా ఉంటుంది. హెల్తీ-వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది. మంచి పేరెంట్‌గా ఉండేందుకు ఉపయోగపడుతుంది. ఇందుకు ఈ కింది టిప్స్ దోహదపడుతాయి.

1. సెల్ఫ్ కేర్ అవసరం

మీ గురించి మీరు పట్టించుకోవడం కూడా మీ టాప్ ప్రయారిటీ అయి ఉండాలి. వ్యాయామం, ఆరోగ్యకరమైన డైట్ తీసుకోవడం, తగినంత నిద్ర పోవడం, మీరు ఆనందించే కార్యకలాపాల్లో పాల్గొనడం వంటివి చేయాలి. మీపై మీరు శ్రద్ధ పెడితే మీకు మరింత శక్తి సమకూరుతుంది. పేరెంట్‌గా మీ బాధ్యతలను చక్కగా డీల్ చేయగలుగుతారు.

2. హద్దులు గీసుకోండి

మీ జీవితంలో పేరెంట్‌గానే ఎక్కువ కాలం గడిచిపోతుంది. అయితే మీ ఆసక్తులు, మీ అవసరాలపై కూడా శ్రద్ద అవసరం. ఇందుకు తగిన హద్దులు నిర్ణయించుకోవడం ముఖ్యం. అంటే మీ హాబీస్, సోషల్ యాక్టివిటీస్‌కు టైమ్ కేటాయించాలి. అలాగే మీకు ఒంటరిగా, ప్రశాంతంగా ఉండేందుకు కొంత సమయం తీసుకోండి.

3. సపోర్ట్ తీసుకోవడంలో తప్పు లేదు

పేరెంట్‌గా గంపెడు బాధ్యతలు. ఇలాంటి సమయంలో మీకు సపోర్ట్ సిస్టమ్ అవసరం. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, లేదా సపోర్ట్ గ్రూప్ ఏదైనా కావొచ్చు. పిల్లల పెంపకంలో ఉన్న సవాళ్లను అర్థం చేసుకునే వాళ్ల నుంచి సహాయం పొందడం వల్ల మీ భావోద్వేగాలను పక్కనపెట్టి సమస్యలకు పరిష్కారం పొందగలుగుతారు.

4. భాగస్వామికి టైమ్ ఇవ్వండి

పిల్లల పెంపకం వల్ల మీ రిలేషన్‌షిప్‌లో ఒత్తిడి ఎదుర్కొంటారు. ఈ దశలో మీ భాగస్వామి నుంచి సపోర్ట్ పొందుతూనే వారికి కొంత సమయం కేటాయించండి. మీ బంధం బాగోలేకపోతే మీ పిల్లల మానసిక స్థితిపై వ్యతిరేక ప్రభావం పడుతుంది. అందువల్ల మీ భాగస్వామితో కమ్యూనికేషన్ బాగుండాలి.

5. నో చెప్పడం నేర్చుకోండి..

పిల్లల కోసం అన్నీ చేయాలనుకోవడం ప్రతి పేరెంట్ చేసే పనే. వారు అడిగిందల్లా ఇవ్వాలని, వారికి అందుబాటులో ఉండాలని అనుకోని తల్లిదండ్రులు ఎవరు ఉంటారు? అయితే కొన్ని అవసరం లేనివాటికి సంబంధించి వచ్చే డిమాండ్లకు నో చెప్పడం నేర్చుకోండి. అలాగే మీ ఆరోగ్యంపై ప్రభావం చూపే అంశాలకు నో చెప్పండి.

5. బ్రేక్ తీసుకోండి

పిల్లల పెంపకంలో చాలా ఓపిక అవసరం. కానీ నిరంతర పనుల వల్ల మీపై ఒత్తిడి తీవ్రమవుతుంది. అందువల్ల బ్రేక్ తీసుకోవడం చాలా అవసరం. వెకేషన్ వెళ్లడమో, వీకెండ్ బయటికి వెళ్లడమో, లేదా అలా షాపింగ్ వెళ్లి రావడమో చేస్తే మీ అలసట నుంచి బయటపడుతారు. ఒత్తిడి తగ్గి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

6. మీకోసం సమయం కేటాయించండి

ముందే చెప్పుకున్నట్టుగా మీ అవసరాలను గుర్తించి మీకోసం సమయం కేటాయించడం ముఖ్యం. యోగా క్లాస్ అటెండ్ అవ్వడమో, మార్నింగ్ వాక్ వెళ్లడమో, లేక స్కిల్స్ నేర్చుకోవడమో ఏదైనా ఒకటి చేస్తూ ఉండండి. మానసిక ప్రశాంతత, ఆత్మ విశ్వాసం చేకూరుతాయి.

7. ఇతరులతో పోల్చుకోకండి

మీరు ఇతర తల్లిదండ్రులతో అస్సలు పోల్చుకోకండి. ప్రతి పేరెంట్ జర్నీ విభిన్నంగా ఉంటుంది. మీ అనుభవాలపై దృష్టి పెట్టండి తప్ప ఇతరులతో పోల్చుకోవద్దు.