Numaish 2023: నుమాయిష్ షురూ.. 46 రోజులు షాపింగ్ సందడి-minister harish rao inaugrates numaish 2023 at nampally exhibition grounds ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Minister Harish Rao Inaugrates Numaish 2023 At Nampally Exhibition Grounds

Numaish 2023: నుమాయిష్ షురూ.. 46 రోజులు షాపింగ్ సందడి

HT Telugu Desk HT Telugu
Jan 01, 2023 10:03 PM IST

Numaish 2023: దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ఎగ్జిబిషన్ గా పేరున్న హైదరాబాద్ నుమాయిష్.. షురూ అయింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేదికగా జరిగే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఈ ప్రదర్శన జరగనుంది. ఈ 46 రోజుల షాపింగ్ వేడుక నగరవాసులకి గొప్ప అనుభూతులు అందించనుంది.

నుమాయిష్
నుమాయిష్

Numaish 2023: హైదరాబాద్ లో జరిగే పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన 'నుమాయిష్'.. కేవలం మన నగరంలోనే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాలలోనూ అత్యంత ప్రజాదరణ కలిగి ఉందని .. ఆర్థిక మంత్రి, ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు హరీశ్ రావు అన్నారు.

ట్రెండింగ్ వార్తలు

జమ్ము కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న వ్యాపారులు ఇక్కడికి వచ్చి తమ ఉత్పత్తులు ప్రదర్శిస్తారని పేర్కొన్నారు. 1938లో ప్రారంభమైన నుమాయిష్.. ఏటా దిగ్విజయంగా జరుగుతోందని అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలో 82వ నుమాయిష్ ను మంత్రులు మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి హరీశ్ ప్రారంభించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి తొలి రోజే.. 70 శాతం స్టాల్స్ నిండిపోయాయని వెల్లడించారు. కరోనాను దృష్టిలోపెట్టుకొని.. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని... నిరంతరం పర్యవేక్షిస్తూ.. ప్రజలకు కావాల్సిన అన్ని సేవలు అందిస్తామని స్పష్టం చేశారు.

"ఎగ్జిబిషన్ సొసైటీ రాష్ట్రవ్యాప్తంగా 19 విద్యాసంస్థలు నడుపుతోంది. 30 వేల మంది విద్యార్థులను చదివించిన ఘనత సొసైటీ సొంతం. ఈ విద్యా సంస్థల్లో చదువుకున్న విద్యార్థులు దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ మహిళా విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తోంది. ప్రజలకు, వ్యాపారస్తులకు, విద్యార్థులకు ఉపయోగపడుతోంది. పిల్లలతో కలిసి కుటుంబ సమేతంగా ఎగ్జిబిషన్ ను సందర్శించండి. అద్భుత అనుభూతులను సొంతం చేసుకోండి" అని హరీశ్ రావు కోరారు.

82వ నుమాయిష్ జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు జరగనుంది. ప్రతి రోజు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు ఈ ఎగ్జిబిషన్ ఉంటుంది. శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో రాత్రి 11 గంటల వరకు ఉంటుంది. ఈ సారి టికెట్ ధర పెంచారు. గతంలో రూ.30 ఉన్న టికెట్ ధరను ఇప్పుడు రూ.40కి పెంచారు. ఐదేళ్ల లోపు వయసున్న చిన్నారులకు ప్రవేశం ఉచితం అని నిర్వాహకులు తెలిపారు. ఎగ్జిబిషన్ కు వచ్చే వారి వాహనాలకు ఉచిత పార్కింగ్ సదుపాయం కల్పిస్తున్నారు. మొత్తం 2,400 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో విదేశీ సంస్థలకు చెందిన స్టాళ్లు కూడా ఉన్నాయి.

1983లో ప్రారంభం

స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులకు ప్రచారం, ప్రోత్సాహం అందించాలన్నదే నుమాయిష్ ప్రదర్శన ప్రధాన ఉద్దేశం. ఈ నినాదంతోనే 1938లో 'నుమాయిష్' ప్రారంభమైంది. అప్పటి హైదరాబాద్ సంస్థాన్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ పారిశ్రామిక ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. మొదట్లో 50 స్టాళ్లతో ప్రారంభమైన 'నుమాయిష్' ఇప్పుడు 2 వేలకు పైగా స్టాళ్లతో దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రదర్శనగా గుర్తింపు తెచ్చుకుంది.

IPL_Entry_Point