తెలుగు న్యూస్  /  Lifestyle  /  Here Are Some Yoga Poses To Balance Body Temperature This Summer

Body Cooling Yoga | వేసవిలో శరీర ఉష్ణోగ్రతను సహజంగా తగ్గించే కొన్ని యోగాసనాలు!

HT Telugu Desk HT Telugu

03 June 2023, 18:18 IST

    • వేసవిలో శరీర ఉష్ణోగ్రతను సహజంగా తగ్గించే కొన్ని యోగాసనాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకోండి..
Body Cooling Excercises
Body Cooling Excercises (istock)

Body Cooling Excercises

Body Cooling Yoga: వేసవిలో తీవ్రమైన ఎండ వేడిని భరించలేకపోతున్నారా? చల్లగా ఉండాటానికి ఏసీలు, కూలర్లను నిరంతరం నడిపిస్తున్నారా? పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందేందుకు సహజమార్గాలు కూడా ఉన్నాయి. యోగా మీ శరీర ఉష్ణోగ్రతను సహజంగా తగ్గించి, ఈ వేసవిలో మిమ్మల్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. సాధారణంగా శరీరంలో జీవక్రియ ప్రక్రియలు జరుగుతున్నప్పుడు కొంత ఉష్ణం అనేది ఉత్పత్తి అవుతుంది, దీనికి బయట ఉష్ణోగ్రత తోడైనపుడు, శరీరం మరింత వేడెక్కుతుంది. ఫలితంగా డీహైడ్రేషన్ తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే యోగా ఈ సమస్యలకు చక్కని పరిష్కారం చూపటమే కాకుండా మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

HT లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, అక్షర యోగా సంస్థల వ్యవస్థాపకుడు హిమాలయన్ సిద్ధా అక్షర్ ఈ మండే వేసవిలో శరీర ఉష్ణోగ్రతను తగ్గించే కొన్ని యోగాసనాలు, యోగ ముద్రల గురించి తెలియజేశారు. అవేమిటో తెలుసుకోండి

సూర్య చంద్ర నమస్కారాలు

వేసవిలో శరీర వేడిని తగ్గించుకునేందుకు, మరెన్నో ఆరోగ్య ప్రయోజనాల కోసం సూర్య నమస్కారం, చంద్ర నమస్కారం రెండూ చేయవచ్చు, అయితే వీటిని సమానంగా ఆచరించాలి. ఉదాహరణకు మీరు సూర్య నమస్కారంలోని 5 చక్రాలను అభ్యసిస్తున్నట్లయితే, అదే సంఖ్యలో చంద్ర నమస్కారాలు కూడా చేయాలి. సూర్య నమస్కారాలు ఉదయం వేళ, అలాగే చంద్ర నమస్కారాలు సాయంత్రం వేళ అభ్యసిస్తారు.

అశ్వసంచలనాసనం

అశ్వసంచలనాసనం అనేది యోగాలో ఒక శీతలీకరణ భంగిమ. ఈ ఆసనం ద్వారా దిగువ వీపు, తుంటి, తొడ కండరాలను సాగదీయడం, హిప్ ఫ్లెక్సర్‌లను విస్తరించడం, హిప్ ఎక్స్‌టెన్సర్‌లను బలోపేతం చేయడం, వెనుక కండరాలను సడలించడం, సయాటికా నొప్పిని తగ్గించడం మొదలైన ప్రయోజనాలు ఉంటాయి.

హాకినీ ముద్ర

హాకినీ ముద్రను మైండ్ ముద్ర అని కూడా అంటారు. ఇది సూర్యోదయానికి ముందు చేయాలి. ఇది పద్మాసనం లేదా సుఖాసనం వంటి వెన్నెముకను నిటారుగా ఉంచి కూర్చుని చేసే భంగిమ. హాకినీ ముద్రను అభ్యసించడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, ఆలోచన విధానం, నిర్ణయాలు తీసుకునే శక్తి మెరుగుపడతాయి. ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఒత్తిడి, మెదడు సంబంధిత సమస్యలకు పరిష్కారం చూపుతుంది. అంతేకాకుండా శరీరాన్ని చల్లబరచడానికి, అదనపు వేడిని తగ్గించడానికి అలాగే శరీరంలోని అంతర్గత ఉష్ణోగ్రతను నిర్వహించడానికి సహాయపడుతుంది.

ప్రాణాయామ పద్ధతులు

తీవ్రమైన ఉష్ణోగ్రతలు, వడగాలుల తాకిడి, ఎక్కువసేపు సూర్యరశ్మికి గురవడం, ఎక్కువగా శారీరక శ్రమ చేయడం, తీవ్రమైన భావోద్వేగాలు వంటి పరిస్థితులలో ప్రాణాయామం సాధన చాలా ఉత్తమమైనది. దీనిలో శీతలీ ప్రాణాయామం, శిత్కారీ ప్రాణాయామం వేడిని తగ్గించే ప్రత్యేక అభ్యాసాలు. ఈ పద్ధతులు వాత లేదా కఫాపై ఎటువంటి ప్రభావం చూపవు, పిత్తను సమతుల్యతలోకి తీసుకురావడంలో చాలా సహాయపడతాయి. అయితే తక్కువ రక్తపోటు, ఉబ్బసం, బ్రోన్కైటిస్ వంటి శ్వాసకోశ రుగ్మతలు, మలబద్ధకం సమస్య ఉన్నవారు శీతలీ, శిత్కారీ ఆసనాలను నివారించాలని హిమాలయన్ సిద్ధా అక్షర్ సూచించారు.